Begin typing your search above and press return to search.

OTTలు ఒత్తిడి చేసినా `ల‌వ్ స్టోరి`ని ఆపాము!-నారంగ్

By:  Tupaki Desk   |   8 July 2021 4:45 AM GMT
OTTలు ఒత్తిడి చేసినా `ల‌వ్ స్టోరి`ని ఆపాము!-నారంగ్
X
క‌రోనా మ‌హ‌మ్మారీ థియేట‌ర్ల రంగాన్ని నాశ‌నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓటీటీల వెల్లువ‌తో ఈ రంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పేరున్న నిర్మాత‌లే త‌మ సినిమాల‌ను ఓటీటీల‌కు అమ్ముకుంటుంటే చిన్నా చితకా నిర్మాత‌లు అదే దారిని అనుస‌రించాల్సిన ప‌రిస్థితి ఉంది. దీనివ‌ల్ల థియేట‌ర్ల రంగం స‌ర్వ‌నాశ‌నం అవుతుంద‌ని ఎగ్జిబిట‌ర్లు పంపిణీదారులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఏషియ‌న్ సునీల్ నారంగ్ ఈ విష‌యంలో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పెద్ద నిర్మాత‌లు సంయ‌మ‌నం పాటించ‌డం లేద‌ని అక్టోబ‌ర్ చివ‌రి వ‌ర‌కూ వేచి చూడాల‌ని ఆయ‌న కోరారు. కంగారు ప‌డి ఓటీటీల‌కు సినిమాల‌ను అమ్ముకుంటే ఎగ్జిబిష‌న్ రంగం పంపిణీ రంగం స‌ర్వ‌నాశ‌నం అవుతాయ‌ని నారంగ్ అన్నారు.

అంతేకాదు.. తాను చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డి త‌మ సినిమాని ఓటీటీకి అమ్ముకోలేద‌ని తెలిపారు. నాగ‌చైత‌న్య‌- సాయి ప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరిని కొనుగోలు చేసేందుకు ఓటీటీల నుంచి ప‌ది భారీ ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని కానీ తాము తిర‌స్క‌రించామ‌ని నారంగ్ తెలిపారు. ఓటీటీలకు నిర్మాత‌లు ఎవ‌రూ సినిమాల్ని అమ్మొద్ద‌ని తెలంగాణ ఛాంబ‌ర్ త‌ర‌పున‌ ఏషియ‌న్ సునీల్ నారంగ్ అల్టిమేట‌మ్ జారీ చేశారు. అక్టోబ‌ర్ 30వర‌కూ వేచి చూసి ఆ త‌ర‌వాత స్వేచ్ఛ‌గా నిర్ణ‌యం తీసుకోండ‌ని అన్నారు. మా అభ్య‌ర్థ‌న‌ను ప‌ట్టించుకోక‌పోతే ఛాంబ‌ర్ త‌ర‌పున క‌ఠిన నిర్ణ‌యాల్ని తీసుకుంటామ‌ని నారంగ్ అన్నారు.

నేనూ నిర్మాత‌నే.. నిర్మాతల బాధ నాకు తెలుసు కానీ ఎగ్జిబిటర్లు ఎక్కువగా క‌ల‌త చెందుతున్నారు. నా చిత్రం `లవ్ స్టోరీ`కి OTT నుండి పది భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ సినిమాను థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను.. అని సునీల్ నారంగ్ తెలిపారు. ఎగ్జిబిట‌ర్లు పంపిణీదారులను కాపాడాల్సిన అవ‌స‌రం నిర్మాత‌ల‌కు ఉంద‌ని అన్నారు. నిజానికి కోవిడ్ సెకండ్ వేవ్ కి ముందే ల‌వ్ స్టోరి థియేట్రిక‌ల్ రిలీజ్ కి రెడీ అయ్యింది. కానీ అనూహ్యంగా కరోనా విజృంభ‌ణ‌తో ప్ర‌ణాళిక త‌ల‌కిందులైంది.