Begin typing your search above and press return to search.

‘ఉడ్తా పంజాబ్’ తీర్పుపై ఆయనగారేమన్నారంటే..

By:  Tupaki Desk   |   14 Jun 2016 12:30 PM GMT
‘ఉడ్తా పంజాబ్’ తీర్పుపై ఆయనగారేమన్నారంటే..
X
చేతిలో అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే ఏమవుతుందో ప్రహ్లాద్ నిహలానికి బాగానే బోధపడింది. ఈయనగారు గత ఏడాది సెన్సార్ బోర్డు ఛైర్మన్ అయినప్పటి నుంచి ఆగడాలు మామూలుగా లేవు. జేమ్స్ బాండ్ సినిమాలో లిప్ లాక్ నిడివి తగ్గించడం దగ్గర్నుంచి సెన్సార్ బోర్డు తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాల వెనుక ఉన్నది ప్రహ్లాదే. మోడీకి భక్తుడని.. ఆరెస్సెస్ ఉద్దేశాల్ని సినిమాలకు ఆపాదించి.. ఫిలిం మేకర్స్ స్వేచ్ఛను దెబ్బ తీస్తున్నాడని ఈయన మీద తీవ్ర విమర్శలున్నాయి. ఐతే అలాంటి విమర్శలకు అయ్యవారు ఏమాత్రం బెదరలేదు.

‘‘ఔను నేను మోడీ భక్తుడినే.. నేను మోడీ చెంచానే.. అలా పిలిపించుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు’’ అని స్టేట్మెంట్ ఇచ్చే స్థాయికి వెళ్లిపోయింది ఈయనగారి పైత్యం. లేటెస్టుగా ‘ఉడ్తా పంజాబ్’ సెన్సార్ కు సంబంధించిన వివాదంలో సార్ చాలా తీవ్ర వ్యాఖ్యలే చేశాడు. ఆ సినిమా ఎలా బయటికి వస్తుందో చూస్తా అన్నట్లు మాట్లాడాడు. తన పరిధిని మరిచిపోయి.. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ స్పాన్సర్ చేసిన సినిమా అని రాజకీయ వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇంతా అయ్యాక ‘ఉడ్తా పంజాబ్’ నిర్మాత అనురాగ్ కశ్యప్ కోర్టులో పోరాడి విజయం సాధించాడు. సెన్సార్ బోర్డు 89 కట్స్ అంటే.. కోర్టు ఒకే ఒక్క కట్ తో సినిమా బయటికొచ్చేలా చేసింది. సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రహ్లాద్ నిహ్లాని జీ మీడియాతో మాట్లాడాడు. ఇంతకుముందు చూపించిన అహం అంతా పక్కనబెట్టి చాలా సాఫ్ట్ గా మాట్లాడాయన. ‘‘ఉడ్తా పంజాబ్ సినిమా వివాదంపై బాంబే హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. కోర్టు తీర్పుకు కట్టుబడతాను. న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తాను. ఇది ఎవరి ఓటమి.. ఎవరి గెలుపు కాదు. సెన్సార్ నిబంధనలకు అనుగుణంగానే నేను పని చేశాను. సెన్సార్ బోర్డు నిర్ణయాలపై కోర్టును ఆశ్రయించే హక్కు ప్రతి నిర్మాతకు ఉంది’’ అని వ్యాఖ్యానించాడు. చూశారా కోర్టు నుంచి అక్షింతలు పడేసరికి అయ్యవారి స్వరం ఎలా మారిపోయిందో?