Begin typing your search above and press return to search.

తలతిక్క ఆఫర్..భయపడకుంటే 5 లక్షలా?

By:  Tupaki Desk   |   12 Sept 2015 9:00 PM IST
తలతిక్క ఆఫర్..భయపడకుంటే 5 లక్షలా?
X
సినిమా ప్రమోషన్ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంటుంది. ఐతే సి.కళ్యాణ్ మరీ కొత్తగా ఆలోచించారు. ఆయన క్రియేటివిటీ హద్దులు దాటిపోయింది. ఈ మధ్య తమిళ హార్రర్ సినిమాల్ని డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేయడమే పనిగా పెట్టుకున్న కళ్యాణ్.. తాజాగా నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘మాయ’ సినిమాను తెలుగులో ‘మయూరి’ పేరుతో అనువదిస్తున్నారు. ఐతే ఈ సినిమా ప్రమోషన్ కోసం ఎంచుకున్న ఆలోచన చూసి అందరికీ దిమ్మదిరిగిపోతోంది. ఈ హార్రర్ సినిమాను చూసి భయపడకుంటే రూ.5 లక్షలు ఇస్తామంటూ ఓ తలతిక్క ఆఫర్ ఇచ్చారు కళ్యాణ్.

అయినా ఓ ప్రేక్షకుడు భయపడింది లేనిదీ నిర్మాతకు ఎలా తెలుస్తుందో అర్థం కాని విషయం. థియేటరుకెళ్లి ప్రతి ప్రేక్షకుడినీ గమనిస్తారా? లేదా ఓ ప్రేక్షకుడు తాను సినిమా చూస్తున్న రెండు గంటల సేపు రికార్డు చేసి నిర్మాతకు పంపించాలా? లేదా భయం లేదనే ప్రేక్షకుడు నిర్మాతను కలిస్తే ఆయనేమైనా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసి.. టెస్టు పెడతారా? ఇలాంటి క్లారిటీ ఏమీ ఇవ్వలేదు కళ్యాణ్ సార్. ఏదో తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి నోటికొచ్చినట్లు ఓ ఆఫర్ ఇచ్చేశారన్నమాట.

ఈ ప్రమోషన్ జిమ్మిక్కుల సంగతి పక్కనబెడితే.. ‘మయూరి’ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ప్రామిసింగ్ గానే అనిపిస్తోంది. అశ్విన్ శరవణన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన సినిమా ఇది. ఈ మధ్య తెలుగులో లాగే తమిళంలోనూ హార్రర్ కామెడీలు వరుస కడుతున్నాయి. ఐతే ఇందులో కామెడీ యాంగిల్ ఏమీ లేదు. ఫక్తు హార్రర్ మూవీ. ఈ నెల 17న వినాయకచవితి సందర్భంగా తమిళ - తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోందీ సినిమా.