Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : వాల్తేరు వీరయ్య

By:  Tupaki Desk   |   13 Jan 2023 11:19 AM GMT
మూవీ రివ్యూ : వాల్తేరు వీరయ్య
X
'వాల్తేరు వీరయ్య' మూవీ రివ్యూ
నటీనటులు: చిరంజీవి-రవితేజ-శ్రుతి హాసన్-ప్రకాష్ రాజ్-బాబీ సింహా-కేథరిన్ థ్రెసా-రాజేంద్ర ప్రసాద్-నాజర్-సత్యరాజ్-వెన్నెల కిషోర్-శ్రీనివాసరెడ్డి-సప్తగిరి తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: ఆర్థర్.కె.విల్సన్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని-రవిశంకర్
స్క్రీన్ ప్లే: కోన వెంకట్-చక్రవర్తి రెడ్డి-బాబీ కొల్లి
కథ-మాటలు-దర్శకత్వం: బాబీ కొల్లి

సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసబెట్టి సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. గత ఏడాది వేసవికి 'ఆచార్య'తో.. దసరాకు 'గాడ్ ఫాదర్'తో ప్రేక్షకులను పలకరించారు. కానీ అందులో ఒకటి డిజాస్టర్ అయితే.. ఇంకోటి యావరేజ్ అనిపించుకుంది. ఇప్పుడు ఆయన సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టాలన్న లక్ష్యంతో 'వాల్తేరు వీరయ్య'గా బరిలోకి దిగారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను చిరు అండ్ టీం ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

ఇంటర్నేషనల్ డ్రగ్ స్మగ్లర్ అయిన సాల్మన్ సీజర్ (బాబీ సింహా)ను రా అధికారులు అరెస్ట్ చేసి అనుకోకుండా జరిగిన ఫ్లైట్ క్రాష్ కారణంగా ఒక రాత్రి మారేడుమిల్లి పోలీస్ స్టేషన్లో ఉంచుతారు. కానీ అతడి మనుషులు ఆ స్టేషన్లో పోలీసులందరినీ చంపేసి సీజర్ ను తీసుకెళ్లిపోతారు. తన సహచరుల మరణంతో తీవ్రంగా కలత చెందిన ఆ స్టేషన్ సీతాపతి (రాజేంద్ర ప్రసాద్) ఎలాగైనా సీజర్ ను పట్టుకుని అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో వైజాగ్ ఏరియాలో కింగ్ మేకర్ అయిన వాల్తేరు వీరయ్య (చిరంజీవి) సాయం కోరతాడు. మలేషియాలో ఉన్న సీజర్ ను పట్టుకురావడానికి పాతిక లక్షలకు కాంట్రాక్టు కుదుర్చుకుని తన గ్యాంగుతో కలిసి బయల్దేరతాడు వీరయ్య. అక్కడికెళ్లి సీజర్ ను ట్రాప్ చేయడానికి చేసే ప్రయత్నంలో వీరయ్య అసలు ప్లాన్ వేరని తెలుస్తుంది. ఇంతకీ అతడి నేపథ్యమేంటి.. తన లక్ష్యమేంటి.. చివరికి అతను అనుకున్నది సాధించాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

'వాల్తేరు వీరయ్య' సినిమా మొదలైన దగ్గర్నుంచి 'పూనకాలు లోడింగ్'.. 'పూనకాలు లోడింగ్' అంటూ ఊదరగొట్టేస్తోంది చిత్ర బృందం. ఈ మాట పోస్టర్ మీద చూస్తే బాగానే అనిపించింది కానీ.. ఈ సినిమా ప్రోమోలు చూస్తున్నపుడు నిజంగా పూనకాలు లోడయ్యాయా అని అభిమానులను అడిగితే.. ఔనని సమాధానం చెప్పలేని పరిస్థితి. సినిమాలో కూడా పూనకాలు తెప్పించే మూమెంట్స్ అయితే లేవు కానీ ఇందులో పైసా వసూల్ వినోదానికి మాత్రం ఢోకా లేదు. వింటేజ్ చిరును చూపిద్దామని ఆయన పాత సినిమాల బాడీ లాంగ్వేజ్.. లుక్స్.. డైలాగ్స్.. కామెడీ టైమింగ్ ను రీక్రియేట్ చేయడానికి బాబీ అండ్ టీం చేసిన ప్రయత్నం కొంతమేర ఫలితాన్నిచ్చింది. మెగాస్టార్ అభిమానులైతే ఆయన పాత్రతో బాగానే కనెక్టవుతారు. మరీ 'హై' ఇచ్చే ఎపిసోడ్లు లేకపోయినా.. సగటు ప్రేక్షకులు ఆశించే మినిమం గ్యారెంటీ వినోదానికి 'వాల్తేరు వీరయ్య'లో ఢోకాలేదు. ఒక పెద్ద స్టార్ నుంచి ఆశించే కమర్షియల్ అంశాలకు ఇందులో లోటు లేదు.

చిరంజీవి 'రౌడీ అల్లుడు'గా అంత వినోదం పంచారన్నా.. 'ముఠామేస్త్రి'గా మాస్ కు ఎంతో చేరువ అయ్యారన్నా.. 'శంకర్ దాదా'గా వీర లెవెల్లో ఎంటర్టైన్ చేశారన్నా.. అందుకు ఆయా పాత్రల్లో ఉన్న ప్రత్యేకతే కారణం. కేవలం అలాంటి గెటప్పులే వేసి.. అదే బాడీ లాంగ్వేజ్ చూపిస్తూ.. అదే కామెడీ టైమింగ్ ను రిపీట్ చేసినంత మాత్రాన ప్రేక్షకులు ఊగిపోరు. కానీ చిరు వీరాభిమాని అయిన బాబీ.. ఇదే ప్రయత్నం చేసి చిరు అభిమానులు మురిపించగలిగాడు. చిరు తనను తాను ఇమిటేట్ చేయడానికి చేసిన ప్రయత్నం అన్ని చోట్లా సరైన ఫలితాన్నివ్వలేదు కానీ.. కొన్ని సన్నివేశాల వరకు కామెడీ బాగా పండింది. ఉదాహరణకు.. పోలీస్ స్టేషన్లో తన మరదలు తన దగ్గర ఆశీర్వాదం కోసం వస్తోందని భావించి చాలా ఎమోషనల్ అయి ముందుకు వెళ్లి ఆమె వస్తోంది తన కోసం కాదని అర్థం చేసుకుని ఆ విషయాన్ని కవర్ చేస్తూ వెనక్కి వెళ్లిపోయే సీన్లో చిరు పండించిన విధానం అభిమానులనే కాదు.. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది. తమ్ముడి మీద పైకి కోపం చూపిస్తూనే లోపల కొండంత దాచుకునే పాత్రను చిరు పండించిన విధానం ఆకట్టుకుంటుంది. రవితేజతో చిరు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్.

ఐతే 'వాల్తేరు వీరయ్య'ను ఆరంభించిన విధానం అయితే ఏమంత ఆసక్తికరంగా అనిపించదు. చిరును పవర్ ఫుల్ గా చూపించాలా.. ఆయన పాత్రను కామెడీగా ప్రెజెంట్ చేయాలా తెలియని అయోమయంలో దర్శకుడు బాబీ ఉండిపోయినట్లు అనిపిస్తుంది. 'వీరయ్యా వీరయ్యా' అంటూ వీరత్వానికి మరో పేరులా హీరో పాత్రను డిజైన్ చేసినట్లు సంకేతాలు ఇచ్చి.. ఒక రేంజిలో ఈ పాత్రకు బిల్డప్ ఇస్తూ ఇంట్రడ్యూస్ చేయించి.. ఆ తర్వాతి సీన్లోనే దాన్ని ఆకాశం నుంచి నేలమీదికి దించి కామెడీ చేయించాడు. దీంతో క్యారెక్టర్ గ్రాఫ్ ఆరంభంలోనే కింద పడ్డట్లు అనిపిస్తుంది. ఆరంభ సన్నివేశాలతోనే మనం ఒక రొటీన్-ఫార్ములా సినిమా చూడబోతున్న ఫీలింగ్ కలుగుతుంది. విలన్ని పట్టుకునే మిషన్ మీద హీరో మలేషియాలో అడుగు పెట్టాక 'వాల్తేరు వీరయ్య' మెరుగు పడుతుందనుకుంటే.. గ్రాఫ్ ఇంకా కిందికి దిగుతుంది. శ్రుతి హాసన్ తో చిరు రొమాంటిక్ ట్రాక్.. దానికి తోడుగా వచ్చే కామెడీ ట్రాక్ సోసోగా అనిపిస్తాయి. శ్రుతి అండర్ కవర్ కాప్ అంటూ ఇచ్చే ట్విస్టు ప్రేక్షకులను ఆశ్చర్యపరచకపోగా.. వెటకారంగా అనిపిస్తుంది. మంచి హై ఇచ్చే మూమెంట్ కోసం ప్రేక్షకుల నిరీక్షణ ఇంటర్వెల్ సమయానికి ఫలిస్తుంది. హీరో అసలు మిషన్ ఏంటో చూపిస్తూ.. వీరయ్య తన వీరత్వాన్ని చూపించే ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రథమార్ధానికి హైలైట్.

కమర్షియల్ సినిమాల ఫార్మాట్ ప్రకారం ద్వితీయార్ధంలో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అక్కడే రవితేజ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. రవితేజ వచ్చాకే కథలో కొంచెం సీరియస్నెస్ వస్తుంది. చిరు-రవితేజ కాంబినేషన్ సీన్లు ఓకే అనిపిస్తాయి. తమ్ముడి మీద పైకి కోపం నటిస్తూనే లోపల ప్రేమను చూపించే సన్నివేశాల్లో చిరు ఆకట్టుకున్నాడు. అన్నదమ్ముల మధ్య వచ్చే గిల్లి కజ్జాల సీన్లు.. అలాగే చివర్లో ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండ్ మెప్పిస్తాయి. ఫ్లాష్ బ్యాక్ కొంచెం సాగతీతగా అనిపించినా.. సినిమాలో కొంచెం మెరుగ్గా అనిపించే ఎపిసోడ్ అదే. ఇటు కామెడీతో పాటు ఎమోషన్ కూడా కొంత మేర వర్కవుట్ అయింది ఈ ఎపిసోడ్లో. కానీ వర్తమానంలోకి వచ్చాక మళ్లీ మామూలే. హీరో వీర లెవెల్లో విధ్వంసం సృష్టించే ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ ఎపిసోడ్లను భారీగా డిజైన్ చేశారు. వింటేజ్ చిరును తెరపై ప్రెజెంట్ చేయాలన్న బాబీ ప్రయత్నం ఫలించింది. కామెడీ బాగానే వర్కవుట్ అయింది. కొంతమేర హీరోయిజం కూడా ఎలివేట్ అయింది. కానీ కథాకథనాలు సాధారణంగా అనిపిస్తాయి. చిరు కోసం.. కామెడీ కోసం.. రవితేజతో చిరు కాంబినేషన్ సీన్ల కోసం 'వాల్తేరు వీరయ్య'పై ఒక లుక్కేయొచ్చు.

నటీనటులు:

చిరంజీవి తన పాత సినిమాల బాడీ లాంగ్వేజ్.. కామెడీ టైమింగ్ ను గుర్తు చేస్తూ వింటేజ్ ఫీల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అభిమానులను బాగానే ఎంగేజ్ చేయగలిగాడు. ఐతే వీరయ్య పాత్రలో పాత్రలో నిలకడ కొరవడింది. ఒక సీన్లో చాలా సీరియస్ గా కనిపించి.. ఇంకో సీన్లో కామెడీ చేయడంతో క్యారెక్టర్ గ్రాఫ్ పడుతూ లేస్తున్నట్లు సాగుతుంది. ఈ వయసులో చిరు మెయింటైన్ చేసిన లుక్.. ఆయన ఉత్సాహం మాత్రం అభినందనీయం. బాస్ పార్టీ పాటలో చిరు స్టెప్పులు ఆకట్టుకుంటాయి. ప్రత్యేక పాత్రలో రవితేజ మెప్పించాడు. సినిమాలో కరెక్ట్ మీటర్లో సాగుతూ కొంచెం బిగితో కనిపించే పాత్ర అతడిదే. హీరోయిన్ శ్రుతి హాసన్ పేరుకే సినిమాలో ఉంది. అండర్ కవర్ రా ఏజెంట్ గా ఆమె పాత్ర మరీ ఎటకారంగా అనిపిస్తుంది. విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ రొటీన్ అనిపిస్తాడు. ఇలాంటి పాత్రలు లెక్కలేనన్ని చేశారాయన. బాబీ సింహా బాగానే చేశాడు. రాజేంద్ర ప్రసాద్.. కేథరిన్ థ్రెసా.. జాన్ విజయ్.. వీళ్లంతా తమ పాత్రల పరిధిలో నటించారు. నాజర్.. శ్రీనివాసరెడ్డి.. ప్రదీప్ రావత్.. షకలక శంకర్.. సప్తగిరి.. వీళ్లందరి పాత్రలు నామమాత్రం.

సాంకేతిక వర్గం:

ఈ మధ్య అంచనాలను అందుకోలేకపోతున్న దేవిశ్రీ ప్రసాద్.. 'వాల్తేరు వీరయ్య'కు ఓ మోస్తరుగా అనిపించే మ్యూజిక్ ఇచ్చాడు. అతను అందించిన పాటల్లో బెస్ట్ అనదగ్గ 'వీరయ్యా.. వీరయ్యా'ను దర్శకుడు అక్కడక్కడా బిట్లు బిట్లుగా వాడుకోవడం ఒకింత నిరాశ కలిగించేదే. మిగతా పాటలు తెర మీద ఓకే అనిపిస్తాయి. దేవి నేపథ్య సంగీతం పర్వాలేదు. ఆర్థర్ కె.విల్సన్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమా నేపథ్యానికి తగ్గ విజువల్స్ అందించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బాాబీ.. కోన వెంకట్.. చక్రవర్తి రెడ్డి కలిసి అందించిన స్క్రిప్టులో మెరుపులు లేవు. ఒక క్రమ పద్ధతిలో కథ రాసుకుని ఆ తర్వాత మిగతా వ్యవహారం చక్కబెట్టినట్లు కాకుండా.. చిరు ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని మసాలాలు అద్దుతూ కథ సిద్ధం చేసినట్లు అనిపిస్తుంది. బాబీ చిరు మీద అభిమానాన్ని చాటుకుంటూ.. వింటేజ్ మెగాస్టార్ ను గుర్తుకు తెచ్చే ప్రయత్నంలో విజయవంతం అయ్యాడు. అతనన్నట్లు పూనకాలు తెప్పించలేదు కానీ.. ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేశాడు.

చివరగా: వాల్తేరు వీరయ్య.. పూనకాల్లేవు కానీ పైసావసూల్

రేటింగ్-2.75/5