Begin typing your search above and press return to search.

వైజయంతి మూవీస్ @ 40 ఇయర్స్‌

By:  Tupaki Desk   |   11 Dec 2015 7:30 PM GMT
వైజయంతి మూవీస్ @ 40 ఇయర్స్‌
X
తెలుగు సినిమా 85 సంవ‌త్స‌రాల సుదీర్ఘ చ‌రిత్ర‌ను క‌లిగి ఉంది. ఇందులో స‌గం వైజ‌యంతి మూవీస్‌ దే. టాలీవుడ్‌ లో ఉన్న అగ్ర‌నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టిగా పేరు తెచ్చుకుంది ఈ సంస్థ‌. శంకం పూరించే కృష్ణుడు .. అది కూడా వెండితెర కృష్ణుడు నంద‌మూరి తార‌క రామారావు స్ఫుర‌ద్రూపాన్ని లోగోగా మార్చి వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్‌ ని డిజైన్ చేశారు. లోగో హీరో అన్న‌గారు ఎన్టీఆర్‌ హీరోగా 'ఎదురులేని మనిషి' చిత్రంతో వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌ ని 1975 జనవరి 11న అశ్వనిదత్ స్థాపించారు.

బ్యాన‌ర్ ప్రారంభ‌మ‌య్యాక... తొలి ప్ర‌య‌త్నం 'ఎదురులేని మనిషిస ప్రారంభ‌మైన సంవ‌త్స‌రంలోనే డిసెంబర్‌ 12న రిలీజై చ‌క్క‌ని విజ‌యం అందుకుంది. ఎన్టీఆర్‌ - ఏఎన్నార్‌ - కృష్ణం రాజు - శోభన్‌ బాబు - చిరంజీవి వంటి స్టార్ల‌తో ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల్ని నిర్మించిన బ్యాన‌ర్‌ గా పేరు తెచ్చుకుంది. నేటి హీరోల్లో మహేష్‌ - రామ్‌ చరణ్‌ - బ‌న్ని - నారా రోహిత్‌ లను వెండితెరకు పరిచయం చేసింది ఈ సంస్థ‌. సీనియ‌ర్ హీరోలు - నేటి త‌రం హీరోలు అంద‌రితో సినిమాలు తీసిన సంస్థ‌గా వైజయంతి మూవీస్ అసాధార‌ణ ట్రాక్ రికార్డును సొంతం చేసుకుని తెలుగు వారి మ‌న‌సుల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయింది. ఈ బ్యాన‌ర్ ప్రారంభ‌మైంది అన్న‌గారి చేతిలోనే. అది అమృత‌హ‌స్తం. సంస్థ అసాధార‌ణంగా ఎదిగేందుకు క‌లిసొచ్చిన హ్యాండ్ అది. అందుకే ఆరంభ‌మే ఎన్టీఆర్‌ తో వ‌రుస‌గా రెండు సినిమాలు నిర్మించింది ఈ సంస్థ‌. తొలినాళ్లలో కె.బాపయ్య - కె.రాఘవేంద్రరావు కాంబినేష‌న్‌ లో వరుసగా సినిమాల్ని నిర్మించి విజ‌యాలు అందుకుంది. స్టూడెంట్ నంబ‌ర్- 1 చిత్రాన్ని వైజ‌యంతి సంస్థ కు చెందిన అనుబంధ సంస్థ స్వ‌ప్న సినిమాస్‌.. ఎన్టీఆర్ వంటి గొప్ప స్టార్‌ ని వెండితెర‌కి ప‌రిచ‌యం చేసింది.

రాజీలేని పెట్టుబ‌డుల‌తో, అభిరుచి ఉన్న‌ సినిమాలు నిర్మించి గొప్ప విజ‌యాల్ని అందుకుంది వైజ‌యంతి మూవీస్‌. యుగ‌పురుషుడు - గురుశిష్యులు - జ‌గ‌దేక వీరుడు - అతిలోక సుంద‌రి - అమ్మ రాజీనామా - అశ్వ‌మేధం - చూడాల‌ని ఉంది - రాజ‌కుమారుడు - రావోయి చంద‌మామ‌ - ఆజాద్‌ - కంపెనీ (హిందీ) - క‌ల‌క‌త్తా మెయిల్ (హిందీ) - ఇంద్ర‌ - చిరుత - క‌థానాయ‌కుడు - శ‌క్తి వంటి చిత్రాల్ని నిర్మించింది. అనుబంధ సంస్థ త్రి ఏంజిల్స్‌ లో నారా రోహిత్‌ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ బాణం` చిత్రాన్ని నిర్మించారు అశ్వ‌నిద‌త్‌. ఈ చిత్రంతోనే కుమార్తెలు స్వ‌ప్న‌ద‌త్‌ - ప్రియాంక ద‌త్ నిర్మాత‌లుగా కెరీర్‌ ని ప్రారంభించి అభిరుచి ఉన్న సినిమాలు తెర‌కెక్కించే యువ‌నిర్మాత‌లుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ డిసెంబర్‌ 12తో వైజయంతి మూవీస్ నిర్మించిన తొలి చిత్రం 'ఎదురులేని మ‌నిషి' రిలీజై 40 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా ఈ స్పెష‌ల్‌!!