Begin typing your search above and press return to search.

'ఆ విషయంలో ఆగేదే లేదంటున్న వినాయక్!

By:  Tupaki Desk   |   30 Jan 2022 2:30 AM GMT
ఆ విషయంలో ఆగేదే లేదంటున్న వినాయక్!
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో వినాయక్ ఒకరుగా కనిపిస్తాడు. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీపై వినాయక్ కి మంచి పట్టుంది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా ఆయనకి మంచి క్రేజ్ ఉంది. ఆది .. ఠాగూర్ .. కృష్ణ ... అదుర్స్ .. వంటి సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. చిరంజీవి రీ ఎంట్రీ తమ సినిమా ద్వారా జరగాలని చాలామంది సీనియర్ డైరెక్టర్లు గట్టి ప్రయత్నమే చేశారు. కానీ 'ఖైదీ నెంబర్ 150' సినిమాను వినాయక్ మాత్రమే చేయాలని చెప్పి చిరంజీవి ఆయనను రంగంలోకి దింపారు. దీనిని బట్టి ఒక దర్శకుడిగా ఆయనపై చిరంజీవికిగల నమ్మకం ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు.

ఇక దర్శకుడిగా అంతటి పేరు తెచ్చుకున్న వినాయక్, తన సినిమాల్లో ఒకటి రెండు సార్లు తెరపై మెరిశారు. వినాయక్ కాస్త రంగు తక్కువైనా, కనుముక్కుతీరు బాగుంటుంది. అందువలన ఆయనకి కూడా నటనపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఏజ్ కి తగిన ప్రధానమైన పాత్రతో 'శీనయ్య' సినిమా రూపొందనున్నట్టు ఆ మధ్య ప్రకటించారు. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు రంగంలోకి దిగాడు. కొంత షూటింగు కూడా నడిచింది. ఈ సినిమాకి సంబంధించి వినాయక్ లుక్ కూడా బయటికి వచ్చింది. అయితే ఆ తరువాత ఈ సినిమా షూటింగు ఆగిపోయింది.

తాజాగా వినాయక్ ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ .. "శీనయ్య కథను పావుగంటలో విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. కానీ ఒక సినిమాకి అవసరమైన కథగా రెండున్నర గంటలకి తగినట్టుగా రెడీ చేసిన తరువాత ఆశించిన స్థాయిలో రావడం లేదనే విషయం అర్థమైంది. అప్పుడే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేయడం జరిగింది. భవిష్యత్తులో ఇక 'శీనయ్య' వచ్చే అవకాశం లేదుగానీ, మరో రూపంలో మీ ముందుకు వస్తాను. మంచి ప్రాజెక్టుతో మిమ్మల్ని తప్పకుండా పలకరిస్తాను" అంటూ నటుడిగా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంటాననే విషయాన్ని స్పష్టం చేశాడు.

ఇక తన దర్శకత్వంలోని సినిమాను గురించి ప్రస్తావిస్తూ .. "దర్శకుడిగా నా ప్రయాణం ఆగదు .. అందుకు సంబంధించిన పనులు నడుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఒక మంచి కథను సెట్ చేస్తున్నాను. అయితే ఆ కథకు పూర్తి రూపం రావలిసి ఉంది. కథ పూర్తయిన తరువాత అది ఎవరితో చేస్తే బాగుంటుందా అనేది చూస్తాను. స్టార్ హీరోలందరికీ నేనేంటే ఇష్టమే. అయితే కథ ఎవరికైతే సరిపోతుందో వాళ్లతో చేయడానికే నేను ఇష్టపడతాను" అని చెప్పాడు. మరి వినాయక్ తయారుచేసే ఆ కథ ఏ జోనర్లో ఉంటుందో .. ఏ హీరో దగ్గరికి వెళుతుందో చూడాలి.