Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘వివేకం’

By:  Tupaki Desk   |   24 Aug 2017 12:24 PM GMT
మూవీ రివ్యూ: ‘వివేకం’
X
చిత్రం : ‘వివేకం’

నటీనటులు: అజిత్ కుమార్ - కాజల్ అగర్వాల్ - వివేక్ ఒబెరాయ్ - అక్షర హాసన్ - కరుణాకరన్ తదితరులు
సంగీతం: అనిరుధ్
ఛాయాగ్రహణం: వెట్రి
మాటలు: రాజేష్ మూర్తి
నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్ - అర్జున్ త్యాగరాజన్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శివ

తమిళంలో రజినీకాంత్ తర్వాతి స్థాయి సూపర్ స్టార్లలో అజిత్ ఒకడు. అతడికక్కడ తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. తెలుగులో ‘శౌర్యం’.. ‘శంఖం’.. ‘దరువు’ లాంటి సినిమాలు తీసిన శివతో అజిత్ కు మంచి కెమిస్ట్రీ కుదిరింది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు ‘వీరం’.. ‘వేదాలం’ లాంటి సూపర్ హిట్లు వచ్చాయి. వీరి కలయికలో తెరకెక్కిన కొత్త సినిమా ‘వివేగం’ తమిళనాటే కాక దక్షిణాది అంతటా హైప్ తెచ్చుకుంది. ఈ చిత్రం తెలుగులో ‘వివేకం’ పేరుతో తమిళంతో పాటుగా ఒకేసారి.. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అజయ్ కుమార్ (అజిత్) యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో సభ్యుడు. మరో నలుగురు సీక్రెట్ ఏజెంట్లతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పని చేస్తుంటాడు. ఉగ్రవాదులు కృత్రిమ భూకంపాలు సృష్టించేందుకు పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నారని అజయ్ బృందానికి తెలుస్తుంది. ఈ కుట్రను ఛేదించే బాధ్యతను అజయ్ తీసుకుంటాడు. అతను లక్ష్యానికి అత్యంత చేరువగా వచ్చిన సమయంలో అతడికి ఊహించని ఎదురుదెబ్బ తగులుతుంది. ఆ ఎదురు దెబ్బ ఏంటి.. దాని వల్ల అజయ్ కుమార్ కు ఏం జరిగింది.. అతను తర్వాత ఎలా పుంజుకుని తాను అనుకున్న పనిని పూర్తి చేయగలిగాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

హీరో బైకు మీద ఓ అమ్మాయిని కాపాడి తీసుకెళ్తుంటాడు. అతడి వెనుక పదుల సంఖ్యలో కార్లు.. బైకుల్లో విలన్లు వెంటపడుతుంటారు. వీళ్లిద్దరి మీదికి వందల బుల్లెట్లు కురిపిస్తుంటారు. కానీ హీరో అన్నింటినీ తప్పించేస్తాడు. కమర్షియల్ సినిమాల్లో ఇలాంటి విన్యాసాలు మామూలే కదా అని సర్దుకుపోతాం. ఐతే ఒక దశలో బుల్లెట్ల వర్షం బాగా ఎక్కువైపోవడంతో హీరో పైకి లేచి ఆ అమ్మాయిని బైకు మీద పడుకోమంటాడు. తాను ఆమె అడ్డుగా నిలబడి బుల్లెట్లను ఎదుర్కొంటాడు. అప్పటికీ సర్దుకుంటాం. కానీ అప్పుడే హీరోకు భార్య నుంచి ఫోన్ వస్తుంది. అప్పుడామె హాస్పిటల్లో స్కానింగ్ చేయించుకుంటూ బిడ్డ హార్ట్ బీట్ వినమంటుంది.

తన మీదికి వందల సంఖ్యలో బుల్లెట్లు దూసుకొస్తున్నప్పటికీ హీరో కాల్ కట్ చేయకుండా తన బిడ్డ హార్ట్ బీట్ వింటాడు. అవతల ఉన్న హీరో గారి భార్యకు కూడా ఈ కాల్పుల మోత ఏమీ వినిపించదు. ఆమెలో ఏ కంగారూ కనిపించదు. ఇద్దరూ తీరిగ్గా ఏకాంత ప్రదేశంలో ఉన్న వాళ్లలాగా ముచ్చటించుకుంటారు. ‘వివేగం’ ఎలాంటి సినిమానో చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటి విచిత్ర విన్యాసాలు సినిమాలో ఇంకా చాలానే ఉన్నాయి. లాజిక్ అనే మాటే పట్టించుకోకుండా హీరోయిజాన్ని హద్దులు దాటించేయడంలో తెలుగు దర్శకులే సిద్ధహస్తులు అనుకునేవాళ్లం. కానీ ఈ మధ్య తెలుగు సినిమాల్లో మార్పు వచ్చి వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమాలు చేస్తున్నారు. కానీ రియలిస్టిక్ సినిమాల విషయంలో మనకు పాఠాలు నేర్పించిన తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు ఎటు పోతోందో అని సందేహం కలిగిస్తుంది ‘వివేకం’.

‘వివేకం’ సినిమా మొత్తంలో అజిత్ కనీసం ఓ వెయ్యి మందినైనా చంపేస్తాడేమో. అందులో ఎవ్వరూ కూడా అతడి మీదికి ఖాళీ చేతులతో ఏమీ రారు. అత్యాధునిక తుపాకులతోనే వస్తారు. కానీ అజిత్ మాత్రం కొన్నిసార్లు చేతిలో ఆయుధాలు లేకుండానే అందరినీ ఎదుర్కొంటాడు. ఒక్కరూ మిగలకుండా మట్టుబెట్టేస్తాడు. కొన్నిసార్లు అతడికి బుల్లెట్లే తగలవు. ఒక సందర్భంలో అతడి ఒంట్లోకి రెండంకెల సంఖ్యలో బుల్లెట్లు దిగి మనుషులే లేని ప్రదేశంలో పడిపోయినా బతికి బట్ట కట్టేస్తాడు. హద్దులు దాటిపోయిన ఈ ‘హీరోయిజం’ అజిత్ తమిళ అభిమానులకు అద్భుతంగా అనిపించొచ్చేమో కానీ.. మన ప్రేక్షకులకు మాత్రం చాలా అతిగా అనిపిస్తుంది.

హీరో ఒక సీక్రెట్ ఏజెంట్ గా ఉండి.. తనకు ఇచ్చిన టాస్కులన్నీ అలవోకగా ఛేదించేయడం.. కానీ అతడితో ఉన్నవాడే వెన్నుపోటు పొడిచేసి.. హీరోను ఉగ్రవాదిగా చిత్రించడం.. హీరో తిరిగొచ్చి ఆ మిత్రుడి అంతు చూడటం.. ఇలా ఎప్పట్నుంచో చూస్తున్న రొటీన్ మాస్ మసాలా కథతోనే తెరకెక్కింది ‘వివేకం’ కూడా. లాజిక్కులతో సంబంధం లేని హీరోయిజాన్ని.. కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాల్ని చూడాలనుకుంటే ‘వివేకం’ ఓకే. రెండున్నర గంటల నిడివిలో కనీసం గంటన్నర పాటు యాక్షన్ సన్నివేశాలే ఉంటాయి. చివరికి పాటల్లో సైతం ‘యాక్షనే’ చూడొచ్చు. ఓ దశ దాటాక ఏంటీ గోల అనిపించే స్థాయిలో.. నాలుగైదు సినిమాలకు సరిపోయేంత యాక్షన్ సన్నివేశాలతో సినిమాను నింపేశారు.

‘వివేకం’ సినిమాను అంతర్జాతీయ స్థాయి స్పై థ్రిల్లర్‌ గా చెప్పారు. కంటెంట్ పరంగా చూస్తే ఆ స్థాయి ఎంతమాత్రం కనిపించదు. కానీ యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించిన తీరులో మాత్రం కచ్చితంగా ఇది అంతర్జాతీయ స్థాయి సినిమానే. కళ్లు చెదిరే కెమెరా వర్క్.. సూపర్బ్ ఎడిటింగ్.. అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్.. ఈ సన్నివేశాలకు ఆకర్షణగా నిలిచాయి. ప్రథమార్ధంలో తనకిచ్చిన టాస్క్ ను హీరో ఛేదించే క్రమంలో వచ్చే సన్నివేశాలు కొంతమేర మెప్పిస్తాయి. అక్షర హాసన్ పాత్ర చుట్టూ అల్లుకున్న ఎపిసోడ్ వరకు పర్వాలేదనిపిస్తుంది. కానీ ఆమె పాత్రను ముగించేశాక.. ద్వితీయార్ధం నుంచి సినిమా గాడి తప్పుతుంది. విలన్ పాత్రలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం.. హీరో-విలన్ మధ్య ఎత్తులు పై ఎత్తులు కూడా ఫ్లాట్ గా సాగిపోవడంతో ‘వివేకం’ విసుగెత్తిస్తుంది.

సినిమాలో ‘టెక్నాలజీ’ని మహ బాగా వాడుకున్నారు. ఓ దశ దాటాక మనం సినిమా చూస్తున్నామా.. వీడియో గేమ్ చూస్తున్నామా అన్న సందేహాలు కలుగుతాయంటే నమ్మండి. హీరో అజిత్ తో పాటు చిత్ర బృందం పడ్డ కష్టం తెరమీద కనిపిస్తుంది కానీ.. కంటెంట్ మీద దృష్టిపెట్టకుండా ప్రతి సన్నివేశాన్నీ హీరోయిజం ఎలివేట్ చేయడానికి వాడుకోవడం.. అభిమానులకు గూస్ బంప్స్ ఇవ్వాలన్న లక్ష్యంతోనే సినిమాను నడిపించడంతో సగటు ప్రేక్షకుడికి అసహనం కలుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే అజిత్ ను ఒక సూపర్ మ్యాన్ లాగా చూపిస్తూ.. అతడి అభిమానుల్ని అలరించడానికి చేసిన ఒక సాదాసీదా ప్రయత్నమే.. ‘వివేకం’.

నటీనటులు:

అజిత్ తన వరకు సిన్సియర్ గా కష్టపడ్డాడు. బహుశా తన కెరీర్లో ఏ సినిమాకూ అతను ఇంత కష్టపడి ఉండడేమో. ఆ కష్టమంతా తెర మీద కనిపిస్తుంది. అజిత్ లుక్.. అతడి నటన.. తన స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటాయి. కాజల్ అగర్వాల్ కథకు కీలకమైన పాత్రలో పర్వాలేదనిపించింది. ఎమోషనల్ సీన్స్ లో కాజల్ హావభావాలు కొంచెం ఇబ్బంది పెడతాయి కానీ.. ఓవరాల్ గా ఓకే. వివేక్ ఒబెరాయ్ బాగానే చేసినప్పటికీ అతడి పాత్రలో బలం లేదు. అక్షర హాసన్ పాత్ర కేవలం పది నిమిషాలకే పరిమితమైంది. ఆమె ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. కరుణాకరన్ కానీ.. అతడి కామెడీ కానీ.. మన ప్రేక్షకులకు అంతగా ఎక్కకపోవచ్చు.

సాంకేతికవర్గం:

సినిమాలో అన్నింటికంటే మెప్పించే విషయం.. అనిరుధ్ నేపథ్య సంగీతమే. ప్రతి సన్నివేశాన్నీ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు అనిరుధ్. సినిమా అంతటా కూడా ప్రేక్షకుల్ని ఉత్తేజితుల్ని చేస్తుంటుంది అతడి బ్యాగ్రౌండ్ స్కోర్. పాటలు అంతగా రిజిస్టర్ కావు. వెట్రి ఛాయాగ్రహణం కూడా బాగుంది. తన విజువల్స్ తో సినిమాకు ఇంటర్నేషనల్ లుక్ తీసుకువచ్చాడు సినిమాటోగ్రాఫర్. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఎక్కడా రాజీ పడకుండా భారీగా ఖర్చు పెట్టారు. రిచ్ లొకేషన్లలో సినిమా తీశారు. దర్శకుడు శివ ఎప్పట్లాగే హీరోయిజం ఎలివేషన్ మీదే దృష్టిపెట్టాడు. టెక్నికల్ గా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తీయగలిగాడు కానీ.. కంటెంట్ గురించి అసలేమాత్రం పట్టించుకోలేదు. కథ పాతది. దాని ట్రీట్మెంట్ కూడా అలాగే సాగింది. కథాకథనాల్లో ఎగ్జైట్ చేసే అంశాలేమీ లేవు. సినిమా నుంచి బయటికి వస్తే యాక్షన్ సన్నివేశాల మోత తప్ప ఏమీ గుర్తుండదు.

చివరగా: వివేకం.. యాక్షన్ వీడియో గేమ్!!

రేటింగ్- 1.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre