Begin typing your search above and press return to search.

కమర్షియల్ సినిమాలు చేయనంటే చేయన్నాడు

By:  Tupaki Desk   |   8 Sept 2017 10:11 AM IST
కమర్షియల్ సినిమాలు చేయనంటే చేయన్నాడు
X
స్వతహాగా అభిరుచి ఎలా ఉన్నప్పటికీ.. పెద్ద స్థాయికి వెళ్లాలంటే కమర్షియల్ సినిమాలే మార్గమని ఎవరైనా అనుకుంటారు. నటీనటులైనా.. టెక్నీషియన్లయినా కమర్షియల్ సినిమాలు చేస్తేనే పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వస్తుందని భావిస్తారు. ఐతే యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మాత్రం కమర్షియల్ సినిమాలంటేనే పూర్తి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఆ టైపు సినిమాలు చేయనంటున్నాడు. ‘పెళ్లిచూపులు’ సినిమాలో చాలా కొత్తగా అనిపించే పాటలు - నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్న వివేక్.. ఇప్పుడు ‘యుద్ధం శరణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమా ఆడియో కూడా డిఫరెంట్‌గా అనిపించింది.

ఈ నేపథ్యంలో ఇక కమర్షియల్ సినిమాల బాట పడతారా అని వివేక్‌ను అడిగితే.. ‘‘నేను క్లియర్‌గా చెబుతున్నా. కమర్షియల్ మ్యూజిక్ అన్నది ఎక్కువ కాలం ఉండదు. సంగీతం అనేది కథను బట్టి ఉండాలి కానీ.. ఎప్పుడూ కమర్షియల్ పోకడలు పోకూడదు. నాణ్యమైన సంగీతం అందించేవాళ్లు చాలా త్వరగా తమ ఉనికిని చాటుకుంటారు. ఎవరి సంగతెలా ఉన్నా.. నేను మాత్రం కమర్షియల్ మ్యూజిక్‌ కు చెందిన వాడిని కాదు. నాకు పారితోషకం ముఖ్యం కాదు. నన్ను ఎగ్జైట్ చేసే సినిమాలు ముఖ్యం. ‘పెళ్లిచూపులు’ తర్వాత నాలుగైదు సినిమాలకు ఈజీగా సంతకం చేసి నాకొచ్చిన పేరును క్యాష్ చేసుకునేవాడిని. కానీ నేను నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. అందుకే కంటెంట్ ఉన్న సినిమాలే చేయాలనుకున్నా. కమర్షియల్ సినిమాకు సంగీతం ఇవ్వమని ఎవరైనా అడిగినా నేను చేయను. 90 శాతం సంగీత దర్శకుడు కమర్షియల్ మ్యూజిక్కే ఇస్తున్నారన్నది నా అభిప్రాయం. 10 శాతం అయితే ఉత్తమమైన, కథకు తగ్గ సంగీతం ఇవ్వాలన్నది నా ఫీలింగ్. టైం పట్టినా అలాంటి మ్యూజిక్కే ఇస్తాను’’ అని కుండబద్దలు కొట్టేశాడు.