Begin typing your search above and press return to search.

సుశాంత్ సింగ్ మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ పోస్ట్...!

By:  Tupaki Desk   |   16 Jun 2020 12:10 PM GMT
సుశాంత్ సింగ్ మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ పోస్ట్...!
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ ఉరేసుకొని చనిపోయాడనే వార్త యావత్ సినిలోకాన్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఎంతో ప్రతిభావంతుడైన నటుడు డిప్రెషన్‌ కు లోనవ్వడం.. ఉరి వేసుకుని ఇలా తనువు చాలించడం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. అయితే సుశాంత్ మరణంపై సినీ ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొందరు ప్రముఖులు వ్యవహరించిన తీరు వల్ల సుశాంత్ సింగ్ మనస్తాపానికి గురయ్యారని పలువురు తమ ట్వీట్లలో పేర్కొంటున్నారు. బాలీవుడ్‌ లో ఓ వర్గం మాఫియాలా మారి సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారని విమర్శిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో నెపోటిజం (బంధుప్రీతి) ఫేవరిజం లాంటి వాటి వలన టాలెంటెడ్ యాక్టర్స్ తొక్కివేయబడుతున్నారని ఎత్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ మరణానికి ఇండస్ట్రీలోని కొందరు వ్యవహరించిన తీరే కారణం అంటూ కంగనా రనౌత్, శేఖర్ కపూర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపన్ లాంటి వారు అభిప్రాయపడుతున్నారు. కాగా సుశాంత్ చివరి చూపు కోసం కూపర్ హాస్పిటల్‌ లోనే ఆయన పార్థీవ దేహాన్ని ఉంచారు. అయితే సుశాంత్ మరణంపై సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న వారెవరూ చివరి చూపు చూడటానికి రాలేదు. ఆయన అంత్యక్రియలకు బాలీవుడ్ సినీ ప్రముఖులు వివేక్ ఒబేరాయ్, కృతిసనన్, రియా చక్రవర్తి, శ్రద్ధాకపూర్, అభిషేక్ కపూర్, పొలిటిషియన్ సంజయ్ నిరుపన్ తదితరులు మాత్రమే హాజరయ్యారు.

ఇదిలా ఉండగా సుశాంత్ అంత్యక్రియల్లో పాల్గొన్న వివేక్ ఒబెరాయ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ''సుశాంత్ దహన సంస్కారాలు చూస్తుంటే హృదయం బద్దలైపోతోంది. నా వ్యక్తిగత అనుభవం, నాకు ఎదురైన పరిస్థితులను చెప్పి అతనికి ఉన్న బాధను తీర్చాలని అనుకున్నాను. నేను బాధలతోనే ప్రయాణం చేశాను. అది ఎంతో చీకటిగానూ, ఒంటరిగాను ఉంటుంది. కానీ చావు ఒక్కటే సమాధానం కాదు. ఆత్మహత్య ఎప్పటికీ పరిష్కారం కాదు. ఆయన తన కుటుంబ సభ్యులు, మిత్రులు, మిలియన్ల కొద్ది ఉన్న అభిమానుల దుఃఖం గురించి ఆలోచించి ఉండడు. అతని కోసం ఎంతో మంది ఉన్నారని అనుకోని ఉండడు. ఈ రోజు చితికి మంటను పెడుతున్న ఆయన నాన్న చూస్తుంటే.. ఆ కళ్లలోని బాధను భరించలేకపోయాను. తిరిగి రా అంటూ అతని సోదరి ఏడుపులు.. మాటల్లో చెప్పడానికి వీల్లేని విషాదం. ఓ కుటుంబంగా చెప్పుకొని సినీ ఇండస్ట్రీ.. లోతుగా పరిశీలించుకోవాల్సిన సమయమిది.. మనల్ని మనం మార్చుకోవాల్సిన తరుణం వచ్చింది. ఒకరి గురించి చెడుగా చెప్పడం తగ్గించి.. జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకోవాలి. పవర్ ప్లేను తక్కువ వాడుతూ.. గొప్ప మనసును చాటాలి. ఈగోలను తగ్గించుకొని ప్రతిభకు సరైన స్థానాన్ని కల్పించాలి. ఈ కుటుంబం నిజంగా ఓ కుటుంబంలా మారాలి. టాలెంట్ ని ఎంకరేజ్ చేసే స్థలంలో తొక్కేయకూడదు. ప్రతిభకు ప్రశంసలు ఇచ్చే స్థలంలో మ్యానిపులేట్స్ చేయకూడదు. మనమంతా మేల్కోవాల్సిన సమయం ఇది. నిత్యం నవ్వుతూ ఉండే సుశాంత్‌ ను మిస్ అవుతున్నాను. ఆయనకున్న బాధలన్నింటిని దూరం చేయాలని దేవున్ని కోరుతున్నాను. నీవు లేని లోటు భరించే శక్తిని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నీ స్థాయికి తగ్గట్టు సరైన చోటే నువ్వు ఉంటావని ఆశిస్తున్నాను.. అయితే మేము ఆ చోటుకు అర్హులు కాకపోవచ్చు'' అని భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు.