Begin typing your search above and press return to search.

పాత బ‌స్తీ నుంచి రౌడీ షీట‌ర్ ని తెచ్చా!

By:  Tupaki Desk   |   29 May 2019 12:28 PM GMT
పాత బ‌స్తీ నుంచి రౌడీ షీట‌ర్ ని తెచ్చా!
X
`ఫ‌ల‌క్ నుమా దాస్` ఈనెల 31న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ ఫ‌ల‌క్ నుమా ఏరియాలోని ఒరిజిన‌ల్ జీవితాల్ని తెర‌పైకి తెస్తున్నాన‌ని హీరో కం ద‌ర్శ‌కుడు విశ్వ‌క్ సేన్ ప‌లుమార్లు ప్ర‌చారంలో చెప్పారు. అంతేకాదు ఈ సినిమా కాస్టింగ్ విష‌యంలో అత‌డు ఎంచుకున్న మార్గం అంతే బిగ్ షాక్ ఇస్తోంది. బార్బ‌ర్ షాప్ లో బాగా వాగేవాడిని ఓ పాత్ర కోసం.. పాత బ‌స్తీలో రౌడీషీట‌ర్ ని విల‌న్ పాత్ర కోసం ఎంచుకున్నాన‌ని చెప్పి పెద్ద షాకిచ్చారు. పీక‌లు కోసే బ్యాచ్ ని సైతం ఈ సినిమా కోసం దించాన‌ని చెప్పాడు ఈ యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ కం హీరో.

ఈ యంగ్ డైరెక్ట‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు ఈ సినిమాకి అంతే పెద్ద ప్ల‌స్ అవుతాయ‌నే అంచ‌నాలు ట్రైల‌ర్ తో ఏర్ప‌డ్డాయి. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన విశ్వ‌క్ సేన్ ఈ సినిమాలో పాత్ర‌ల ఎంపిక విధానం గురించి అదిరిపోయే వాస్త‌వాల్ని వెల్ల‌డించాడు. ``మీరు నా సినిమా చూస్తే .. ఇప్పుడున్న యాక్ట‌ర్లు ఎవ‌రూ చేయ‌లేరు. ఆ పాత్ర‌లు అలాంటివి. వాళ్ల‌కు నా సినిమాలో పాత్ర‌ల‌ బిహేవియ‌ర్ ఇంత‌కుముందు ప‌రిచ‌యం లేదు. ఇలా చేయాలి అనీ ఇత‌రుల‌కు తెలీదు. రెగ్యుల‌ర్ ప్యాట్ర‌న్ లో చేస్తారు సీనియ‌ర్లు. అయితే నా సినిమాలో క్యారెక్ట‌ర్లు లైవ్ నేచుర‌ల్ క్యారెక్ట‌ర్లు. బార్బ‌ర్ షాప్ లోంచి ప‌ట్టుకొస్తే.. ఒరిజిన‌ల్ పాత్ర‌లు దొరుకుతాయి. నాలుగు బార్బ‌ర్ షాపులు తిరిగి సోది కొట్టేవాళ్ల‌ను తెచ్చి న‌టింప‌జేశాను`` అని తెలిపారు.

విల‌న్ పాత్ర కోసం ఏకంగా పాత బ‌స్తీకే వెళ్లి ప‌ట్టుకొచ్చాడ‌ట‌. ``నా సినిమాలో ఓ మ‌ర్డ‌రర్ .. రౌడీ షీట‌ర్ కావాలి. రౌడీ షీట‌ర్ అని కాదు కానీ పాత బ‌స్తీ నుంచి ఒక‌డిని ప‌ట్టుకొచ్చా. నా సినిమాలో న‌టించాడు. 15 రోజుల త‌ర్వాత డ‌బ్బింగుక‌ని ఫోన్ చేశాను. ఫోన్ లు ఎత్త‌డం లేదు. ఏమైంద్రా? అని అడిగితే మ‌ర్డ‌ర్ చేస్తాడ‌న్నా అన్నారు మావాళ్లు. టీమ్ అంతా షాక్ లో ఉన్నారు. నేనైతే న‌వ్వుకున్నా. ఇట్టాంటిదేదో జ‌రుగుతుంద‌ని ముందే అనుకున్నా. స‌రిగ్గా అట్లాంటి వాయిస్ తెచ్చి డ‌బ్బింగ్ చెప్పించాను. సినిమాలో అంతా అలానే ఉంటారు. నేచురాలిటీ ఉంటుంది సినిమా అంతా`` అని తెలిపాడు విశ్వ‌క్. నేను ఇప్ప‌టివ‌ర‌కూ దీని గురించి ఎవ‌రికీ చెప్ప‌లేద‌ని అన్నారు. 31న సినిమా రిలీజ్ కాబ‌ట్టి మే 30వ తేదీ సాయంత్రం నుంచే భారీగా ప్రీమియ‌ర్ల‌ను ప్లాన్ చేయ‌డం చూస్తుంటే `ఫ‌ల‌క్ నుమా దాస్` క్రేజును అర్థం చేసుకోవ‌చ్చు.