Begin typing your search above and press return to search.

ఫలక్ నుమా దాసు.. పోలీసు ఒకటేనా బాసూ?

By:  Tupaki Desk   |   11 Feb 2020 11:31 AM GMT
ఫలక్ నుమా దాసు.. పోలీసు ఒకటేనా బాసూ?
X
ఫలక్ నుమా దాస్' ఫేం విశ్వక్ సేన్ హీరోగా కొలను శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ 'హిట్'. న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై సమరిపిస్తున్నారు. 'చిలసౌ' ఫేమ్ రుహాని శర్మ ఈ సినిమాలో విశ్వక్ కు జోడీగా నటిస్తోంది. ఇటీవల 'హిట్' సినిమా టీజర్ రిలీజ్ అయింది. రెస్పాన్స్ సంగతి ఎలా ఉన్నప్పటికీ సినిమా టైటిల్ ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. సినిమా రిలీజ్ అవ్వకముందే హిట్ అంటూ టైటిల్ పెట్టుకోవడం ఏంటని సెటైర్లు కూడా పడ్డాయి. కొందరైతే హిట్ ఏంటో మీనింగ్ చెప్పాలని కూడా అడిగారట.

దీంతో హిట్ అంటే ఏంటి? అనేది వివరిస్తూ ఒక నిముషం వీడియోను విడుదల చేసింది 'హిట్' టీమ్. ఈ వీడియోలో రిపోర్టర్లు అందరూ ఒక కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు పోలీస్ అధికారి విశ్వక్ సేన్ కోసం ఎదురు చూస్తుంటారు. విశ్వక్ తన జీప్ వద్దకు హడావుడిగా రాగానే అందరూ కేసు గురించి అడుగుతారు. "ప్రీతి మిస్సింగ్ కేస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సర్" అని అడిగితే కొన్ని వివరాలు చెప్తాడు. ఇంకా ఇన్ఫర్మేషన్ ఆడిగితే. "మిగతా వివరాలు HIT అఫిషియల్ హ్యాండిల్ లో పోస్ట్ చేస్తాం" అని బదులిస్తాడు. ఇక "HIT అంటే ఏంటి?" అని ప్రశ్నిస్తే "హోమిసైడ్ ఇంట‌ర్ వెన్ష‌న్ టీమ్" అని సమాధానం చెప్తాడు. ఇక చివరిలో 'హోమిసైడ్ ఇంట‌ర్ వెన్ష‌న్ టీమ్- క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ డిపార్ట్‌మెంట్ అనే లోగోను కూడా చూపించారు.

ఈ వీడియో.. HIT ఫుల్ ఫామ్ సంగతేమో కానీ విశ్వక్ ఏమాత్రం పోలీసు పాత్రకు సూట్ కాలేదని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. విశ్వక్ కేర్ లెస్ యాటిట్యూడ్ పోలీసు పాత్రకు అసలు కుదరలేదని అంటున్నారు. 'ఫలక్ నుమా దాస్' లో ఒక పాతబస్తీ గల్లీపోరడుగా ఆ బాడీ లాంగ్వేజ్ సరిపోయింది కానీ ఇప్పుడు అదే బాడీ లాంగ్వేజ్ తో ఈ పోలీసు రోల్ చెయ్యడంతో విశ్వక్ పై పంచ్ లు పడుతున్నాయి. ఫేస్ లో కూడా ఎక్స్ ప్రెషన్ లు లేవని అంటున్నారు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత స్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఫిబ్ర‌వ‌రి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.