Begin typing your search above and press return to search.

అంచనాలు మోయలేక సీక్వెల్‌ కాదంటున్నారా?

By:  Tupaki Desk   |   24 Nov 2020 4:40 PM IST
అంచనాలు మోయలేక సీక్వెల్‌ కాదంటున్నారా?
X
మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'ఢీ' సినిమా సూపర్‌ హిట్‌ అయిన విషయం తెల్సిందే. గత కొన్నాళ్లుగా సినిమా సీక్వెల్‌ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఢీ సీక్వెల్‌ కు తాను ఎప్పుడు రెడీగా ఉన్నాను అంటూ గతంలో పలు సందర్బాల్లో మంచు విష్ణు అన్నాడు. శ్రీనువైట్ల కూడా ఢీ సీక్వెల్‌ చేసే యోచనలో ఉన్నట్లుగా పలు వేదికల మీద పేర్కొన్నాడు. చాలా మంది వీరి అభిమానులు ఢీ సీక్వెల్‌ కోసం వెయిట్‌ చేశారు. ఎట్టకేలకు నిన్న 'డి అండ్‌ డి' సినిమాను ప్రకటించారు. దాంతో అంతా కూడా ఢీ సీక్వెల్‌ మొదలు కాబోతుంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇంతలో దర్శకుడు ఇది సీక్వెల్‌ కాదంటూ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

ఢీ సీక్వెల్‌ అనగానే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకడం ఖాయం. ఆ అంచనాలను అందుకోవాలంటే ఢీ ని మించిన ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సినిమాను తెరకెక్కించాల్సి ఉంది. అంతటి అంచనాలతో డి అండ్‌ డి ను తీసుకు వచ్చి కాస్త అంచనాలకు తగ్గినా కూడా ప్రేక్షకులు విమర్శలు చేసే అవకాశం ఉంది. అందుకే డి అండ్‌ డి సినిమా ఢీ కి సీక్వెల్‌ కాదని చెబితే బెటర్‌ అని వీళ్లు భావిస్తున్నారా అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీను వైట్ల తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డి అండ్‌ డి సినిమా కు ఢీ కి సంబంధం లేదు. పూర్తిగా వేరే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఢీ సీక్వెల్‌ శ్రీహరి మరియు జెనీలియా లేకుండా సాధ్యం కాదు. కనుక సీక్వెల్‌ ను చేయాలని మేము అనుకోలేదు అంటూ ఆయన చెప్పాడు. కాని నెటిజన్స్‌ మాత్రం ఢీ సీక్వెల్‌ అంటే అంచనాలు భారీగా ఉంటాయనే ఉద్దేశ్యంతో ఇలా మాట్లాడుతున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.