Begin typing your search above and press return to search.

'డి అండ్ డి' అనడానికి సిద్ధమైన శ్రీను వైట్ల ఏమైనట్టు?

By:  Tupaki Desk   |   20 May 2021 1:30 PM GMT
డి అండ్ డి అనడానికి సిద్ధమైన శ్రీను వైట్ల ఏమైనట్టు?
X
శ్రీను వైట్ల .. కొంతకాలం క్రితం వరకూ ఈ పేరు ఒక వెలుగు వెలిగింది .. ఎన్నో సూపర్ హిట్లను అందించింది. కానీ ఈ మధ్య కాలంలో ఈ పేరు ఎక్కడా వినిపించడం లేదు .. కనిపించడం లేదు. సాధారణంగా చిత్రపరిశ్రమలో దర్శకుడిగా అవకాశాన్ని సంపాదించుకోవడం .. నిలదొక్కుకోవడం .. స్టార్ డైరెక్టర్ అనిపించుకోవడం అంత తేలికైన పనేం కాదు. కానీ తొలి సినిమా 'నీ కోసం' తోనే శ్రీను వైట్ల మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఆ సినిమా తరువాత ఆయన నిన్నమొన్నటి వరకూ అవకాశాల కోసం ఎదురుచూసింది లేదు.

'ఆనందం' సినిమా చూసినవారు కామెడీ ఎపిసోడ్స్ ను పట్టుగా నడిపించడంలో ఆయన ప్రతిభను మెచ్చుకున్నారు. ఆ తరువాత కామెడీ ట్రాక్ కోసమే శ్రీను వైట్ల సినిమాలకు వెళ్లిన వారు చాలామందే ఉన్నారు. సినిమా మొదలైన దగ్గర నుంచి చివరివరకూ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడమెలాగో శ్రీను వైట్లకి బాగా తెలుసు. పైగా కథలపై .. స్క్రీన్ ప్లే పై ఆయనకి మంచి పట్టు ఉంది. అందువలన ఆయన ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను విజయాల దిశగా పరుగులు తీయించాడు. అందుకు ఉదాహరణగా 'వెంకీ' .. 'ఢీ' .. 'దుబాయ్ శీను' .. 'రెడీ' .. 'నమో వెంకటేశ .. 'దూకుడు' సినిమాలు కనిపిస్తాయి.

అలాంటి శ్రీను వైట్లకు కథలు .. కాలం కలిసి రాకపోవడంతో, వరుసగా పరాజయాలు పలకరించడం మొదలుపెట్టాయి. దాంతో అవకాశాలు తగ్గడం కూడా మొదలైంది. కొంతకాలంగా ఆయన తన తదుపరి ప్రాజెక్టును సెట్ చేసుకుని పనుల్లోనే ఉన్నాడు. మంచు విష్ణు హీరోగా 'డి అండ్ డి' ఎనౌన్స్ చేసినప్పటికీ, ఇంతవరకూ అది పట్టాలెక్కలేదు. పోనీ ఆ దిశగా పనులేమైనా మొదలుపెట్టిన జాడ కూడా లేదు. దాంతో శ్రీను వైట్ల అభిమానులంతా ఆయన అసలు ఏమైనట్టు? అనుకుంటున్నారు. తిరిగి ఆయన పూర్వ వైభవాన్ని అందుకోవాలని కోరుకుంటున్నారు.