Begin typing your search above and press return to search.

విశాల్.. 'నాట్ ఏ కామన్ మ్యాన్'

By:  Tupaki Desk   |   2 April 2021 6:50 PM IST
విశాల్.. నాట్ ఏ కామన్ మ్యాన్
X
తెలుగువాడైన హీరో విశాల్ కెరీర్ ప్రారంభం నుంచి తన సినిమాలను త‌మిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. 'పందెంకోడి' 'పొగరు' 'భరణి' 'పల్నాడు' 'వాడు వీడు' 'రాయుడు' 'పూజ' 'అభిమన్యుడు' 'డిటెక్టివ్' వంటి సినిమాలు తెలుగులో అనువాద‌మై మంచి విజయాలను అందుకున్నాయి. ఇటీవలే 'చక్ర' సినిమాతో పలకరించిన విశాల్.. ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో మరో కొత్త సినిమాని ప్రకటించాడు విశాల్. తన కెరీర్ లో 31వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వీడియోని తాజాగా విడుదల చేశారు.

'నాట్ ఏ కామన్ మ్యాన్' అంటూ వదిలిన 'విశాల్31' అనౌన్సమెంట్ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది. జన సమూహంతో కూడిన విశాల్‌ లుక్‌ చూస్తే.. మరో వైవిధ్యమైన సినిమాతో రాబోతున్నట్లు అర్థం అవుతోంది. ఈ చిత్రానికి తూ.పా. శరవణన్ దర్శకత్వం వహించనున్నారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. బాలసుబ్రమనియం సినిమాటోగ్రఫీ అందించనున్నారు. దీనికి ఎడిటర్ గా ఎన్బీ శ్రీకాంత్‌.. ఆర్ట్ డైరెక్టర్ గా ఎస్‌ఎస్‌ మూర్తి వర్క్ చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. యువన్ - విశాల్ కాంబోలో వస్తున్న 12వ సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇకపోతే విశాల్ ప్రస్తుతం హీరో ఆర్య తో కలిసి 'ఎనిమీ' అనే సినిమా చేస్తున్నాడు. 'నోటా' ఫేమ్ ఆనంద్‌ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవలే దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇదే క్రమంలో 'డిటెక్టివ్ 2' సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసే ప‌నిలోనూ త‌ల‌మున‌క‌లై ఉన్నాడు విశాల్‌. డైరెక్టర్ మిస్కిన్ తో విభేదాలు రావడంతో ఆయన్ని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించి విశాల్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అలానే 'అభిమన్యుడు 2' చిత్రానికి కూడా విశాల్ డైరెక్షన్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలన్నీ విశాల్ తన హోమ్ బ్యానర్ లోనే చేస్తున్నాడు.