Begin typing your search above and press return to search.

విశాల్ మాస్టర్ ప్లాన్.. యాక్షన్ ఫార్మాట్..!

By:  Tupaki Desk   |   9 Sept 2021 5:00 AM IST
విశాల్ మాస్టర్ ప్లాన్.. యాక్షన్ ఫార్మాట్..!
X
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించే సినిమాలకు కోలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. స్వతహాగా తెలుగువాడైన విశాల్.. తాను నటించే ప్రతీ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తుంటారు. 'పందెం కోడి' 'పొగరు' 'భరణి' 'వాడు వీడు' 'పల్నాడు' 'రాయుడు' 'పూజ' 'అభిమన్యుడు' 'డిటెక్టివ్' వంటి చిత్రాలు విశాల్ కు ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేశాయి. అయితే ఈ మధ్య అన్నీ మల్టీలాంగ్వేజ్ సినిమాలు చేస్తున్న విశాల్.. ఎక్కువగా యాక్షన్ జోనర్ నే నమ్ముకున్నట్లు అర్థం అవుతోంది.

విశాల్ ఈ ఏడాది ప్రారంభంలో 'చక్ర' అనే యాక్షన్ థ్రిల్లర్ తో పలకరించాడు. ఈ క్రమంలో ఇప్పుడు మరో ఐదు ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. అయితే ఇవన్నీ కూడా యాక్షన్ ఫార్మాట్ లో రూపొందే సినిమాలే అవడం గమనార్హం. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన 'ఎనిమీ' సినిమా విడుదలకు రెడీ అయింది. మరో హీరో ఆర్య తో కలిసి చేసిన ఈ చిత్రాన్ని దసరా కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ చూస్తే ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తుంది.

అలానే తూ.పా. శరవణన్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న 'సామాన్యుడు' సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ఈ మూవీ కూడా యాక్షన్ ఫార్మాట్ లోనే తెరకెక్కుతోంది. దీని కోసం విశాల్ డూప్ లేకుండా కొన్ని రిస్కీ ఫైట్స్ చేశారు. ఇదే క్రమంలో విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న 'డిటెక్టివ్ 2' లో యాక్షన్ కు పెద్ద పీట వేస్తున్నారు. ఈసారి డిటెక్టివ్ అద్వైత భూషణ్ విదేశాల్లో ఓ కేసుని చేధించే బాధ్యత తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక 'అభిమన్యుడు 2' సినిమా కూడా సైబర్ హ్యాకింగ్ నేపథ్యంలో రూపొందే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని టాక్.

విశాల్ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమైన '#Vishal32' హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ అని మేకర్స్ తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే ఈ చిత్రానికి ఎ వినోద్ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ లైనప్ చూస్తుంటే అన్నీ యాక్షన్ ఫార్మాట్ సినిమాలే కనిపిస్తున్నాయి. దీంతో సినిమా అటు ఇటు అయినా హిందీ డబ్బింగ్ హక్కులు - నాన్ థియేట్రికల్ రైట్స్ తో సేఫ్ అవ్వొచ్చనే మాస్టర్ ప్లాన్ తో విశాల్ అలాంటి జోనర్ చిత్రాలు చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.