Begin typing your search above and press return to search.

తెలుగులో హిట్టు కోసం పట్టువదలని యాక్షన్ హీరో..!

By:  Tupaki Desk   |   14 Nov 2022 4:40 PM GMT
తెలుగులో హిట్టు కోసం పట్టువదలని యాక్షన్ హీరో..!
X
మన హీరోలకు తమిళ్ లో పెద్దగా మార్కెట్ ఉండదు కానీ.. తెలుగు ప్రేక్షకులు మాత్రం కోలీవుడ్ స్టార్స్ ని నెత్తిన పెట్టుకుంటుంటారు. మనవాళ్ళు భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తుంటారు కనుకే.. తమిళ హీరోలకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడిందనేది వాస్తవం.

రజినీ కాంత్ - కమల్ హాసన్ - విక్రమ్ - సూర్య - కార్తీ - ధనుష్ - విజయ్ - అజిత్ - శింబు - శివ కార్తికేయన్.. ఇలా అనేక మంది తమిళ్ హీరోలకు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో యాక్షన్ హీరో విశాల్ కూడా మంచి క్రేజ్ ఏర్పరచుకున్నాడు.

స్వతహాగా తెలుగువాడైన విశాల్.. తాను నటించే ప్రతీ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. 'పందెం కోడి' 'పొగరు' 'భరణి' 'వాడు వీడు' 'పల్నాడు' 'రాయుడు' 'పూజ' 'అభిమన్యుడు' 'డిటెక్టివ్' వంటి పలు చిత్రాలు విశాల్ ను ఇక్కడి ప్రేక్షకులని బాగా దగ్గరయ్యాడు.

దీంతో విశాల్ టాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. తమిళ్ కంటే ఇక్కడే ప్రమోషన్స్ బాగా చేస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో అతని ప్రయత్నానికి సరైన ఫలితం దక్కడం లేదు. ఎంత కష్టపడినా తెలుగులో ఆశించిన విజయాన్ని సాధించలేకపోతున్నారు.

"అభిమన్యుడు" తర్వాత విశాల్ నటించిన ఏ సినిమా కూడా తెలుగులో హిట్ అనిపించుకోలేదు. తనకు ఇష్టమైన జోనర్ లో చేసిన 'పందెం కోడి 2' 'యాక్షన్' 'చక్ర' 'ఎనిమీ' 'సామాన్యుడు' వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద ప్రభావం చూపించలేకపోయాయి.

అయినప్పటికీ విశాల్ లో తెలుగులో సాలిడ్ హిట్టు అందుకోడానికి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగా ఇప్పుడు "లాఠీ" అనే మరో యాక్షన్ మూవీతో రావడానికి రెడీ అవుతున్నాడు.

విశాల్ కథానాయకుడిగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లాఠీ’. ఇందులో సునయన హీరోయిన్ గా నటించింది. రానా ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై తమిళ నటులు రమణ - నంద ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

"లాఠీ" చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అదే టైటిల్ తో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో వస్తుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

తెలుగు మార్కెట్ మీద దృష్టి సారించిన విశాల్.. టాలీవుడ్ లో 'లాఠీ' సినిమాకు సంబందించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభించారు. హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో మూవీ టీజర్ - ఫస్ట్ సింగిల్ మరియు గ్లింప్స్ ని లాంచ్ చేశారు. మరి విశాల్ ఈసారైనా తెలుగులో హిట్టు కొడతాడేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.