Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : విరూపాక్ష

By:  Tupaki Desk   |   21 April 2023 2:02 PM
మూవీ రివ్యూ : విరూపాక్ష
X
విరూపాక్ష మూవీ రివ్యూ
న‌టీన‌టులు: సాయిధ‌ర‌మ్ తేజ్-సంయుక్త‌-రాజీవ్ క‌న‌కాల‌-సాయిచంద్-బ్ర‌హ్మాజీ-అజ‌య్-సునీల్-అభిన‌వ్ గోమ‌ఠం-క‌మ‌ల్ కామ‌రాజు-రవికృష్ణ త‌దిత‌రులు
సంగీతం: అజ‌నీష్ లోక్ నాథ్
ఛాయాగ్ర‌హ‌ణం: శ్యామ్ ద‌త్
నిర్మాత‌: బీవీఎస్ఎన్ ప్ర‌సాద్
స్క్రీన్ ప్లే: సుకుమార్
క‌థ‌-ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ దండు

రిప‌బ్లిక్ సినిమా స‌మ‌యంలో జ‌రిగిన ప్ర‌మాదం కార‌ణంగా కెరీర్లో కొంచెం గ్యాప్ తీసుకున్న సాయిధ‌ర‌మ్ తేజ్.. ఆ త‌ర్వాత చేసిన సినిమా విరూపాక్ష‌. సుకుమార్ శిష్యుడైన కొత్త ద‌ర్శ‌కుడు కార్తీక్ దండు రూపొందించిన ఈ చిత్రం.. ఆస‌క్తిక‌ర ప్రోమోల‌తో ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెంచింది. ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విరూపాక్ష ఆ అంచ‌నాల‌ను ఏమేర అందుకుందో చూద్దాం ప‌దండి.


క‌థ:

అట‌వీ ప్రాంతంలో ఉండే రుద్రవ‌నం అనే గ్రామంలో 90వ ద‌శ‌కంలో న‌డిచే క‌థ ఇది. ఆ ఊరిలో జాత‌ర‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఒక వ్య‌క్తి అమ్మ‌వారి ఆల‌యంలోనే అనుమానాస్ప‌ద స్థితిలో చ‌నిపోతాడు. దీంతో అష్ట దిగ్బందం చేసి ఆల‌యంతో పాటు ఊరిని మూసేస్తారు. బ‌య‌టి వారు ఊరిలోకి రాకుండా.. అలాగే ఊర్లోంచి ఎవ‌రూ బ‌య‌టికి వెళ్ల‌కుండా ఆంక్ష‌లు విధిస్తారు. కానీ తాను ప్రేమించిన అబ్బాయి కోసం ఆ ఊరి నుంచి ఒక అమ్మాయి బ‌య‌టికి అడుగు పెట్ట‌డంతో అన‌ర్థాలు మొద‌ల‌వుతాయి. ఆ అమ్మాయితో పాటు ఊరిలో ఒక‌రి త‌ర్వాత ఒక‌రు చ‌నిపోతుంటారు. జాత‌ర కోసం ఆ ఊరికి అతిథిగా వ‌చ్చిన సూర్య (సాయిధ‌ర‌మ్ తేజ్) ఈ మ‌ర‌ణాల వెనుక కార‌ణాల‌ను అన్వేషించ‌డం మొదుల‌పెడ‌తాడు. ఈ ప్ర‌య‌త్నంలో అత‌నేం తెలుసుకున్నాడు.. ఆ మ‌ర‌ణాల‌కు కార‌ణాలేంటి.. ఆ ఊరిని సూర్య కాపాడ‌గ‌లిగాడా అన్న‌ది మిగ‌తా క‌థ‌.


క‌థ‌నం-విశ్లేష‌ణ:

ఒక ఊరిలో ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అనుమానాస్ప‌ద రీతిలో చ‌నిపోతుండ‌టం.. దాని వెనుక కార‌ణాలేంటో అంతుబ‌ట్ట‌క ఊరి వాళ్లంతా అయోమ‌యంలో ప‌డిపోవ‌డం.. అలాంటి స‌మ‌యంలో హీరో ఎంట్రీ ఇచ్చి అస‌లు కార‌ణం బ‌య‌టికి తీసి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌డం.. ఈ లైన్లో చాలా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్లే చూసి ఉంటాం. అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ స్క్రీన్ ప్లేతో ఆయ‌న శిష్యుడు ఈ లైన్లో ఓ సినిమా తీశాడు అంటే.. మ‌న‌కు కొన్ని అంచ‌నాలుంటాయి. లాజిక్కుల‌తో మ్యాజిక్ చేసే సుకుమార్.. ఇలాంటి సినిమాకు స్క్రీన్ ప్లే రాశాడు అంటే.. ఈ చావుల‌ వెనుక మూఢ న‌మ్మ‌కాల్లాంటివేమీ లేవ‌ని.. దానికో సైంటిఫిక్ రీజ‌న్ చూపించి మ‌బ్బులు విడిపోయేలా చేస్తాడ‌ని అనుకుంటాం. కానీ సుకుమార్ ఏం చేసినా ప్రేక్షకుల అంచ‌నాల‌కు భిన్నంగానే ఉంటుంది. మ‌నం ఒక‌టి అనుకుంటే ఆయ‌న ఇంకోటి చూపిస్తాడు. విరూపాక్ష సినిమాలో కూడా ఆయ‌న‌, త‌న‌ శిష్యుడు క‌లిసి అలాగే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తారు. ఇది మంత్ర తంత్రాలు.. చేత‌బ‌డుల చుట్టూ తిరిగే ఒక కాల్ప‌నిక‌ క‌థ‌. ఇందులో మ‌ళ్లీ శాస్త్రీయ దృక్ప‌థం అంటూ ప్రేక్ష‌కుల‌ను క‌న్ఫ్యూజ్ చేయ‌కుండా ఈ క‌థ‌ను అనుస‌రించి వెళ్లిపోయారు కార్తీక్-సుకుమార్. ప్రేక్ష‌కుల ఊహ‌కు అంద‌ని స‌న్నివేశాల‌తో.. ట్విస్టుల‌తో ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డంలో.. ఉత్కంఠ‌కు గురి చేయ‌డంలో ఈ జోడీ విజ‌య‌వంతం అయింది. అక్క‌డ‌క్క‌డా కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్న‌ప్ప‌టికీ.. రెండున్న‌ర గంట‌లు ప్రేక్ష‌కుల‌ను కుదురుగా కూర్చోబెట్ట‌గ‌లుగుతుంది విరూపాక్ష‌.

ప్ర‌పంచంలో ఎక్క‌డెక్క‌డో తీసే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్లను ఒక్క ట‌చ్ తో సింపుల్ గా చూసి ఆస్వాదిస్తున్న ఈ రోజుల్లో ఆ జాన‌ర్లో సినిమా తీసి ప్రేక్ష‌కుల‌ను ఉత్కంఠ‌కు గురి చేయ‌డం అంటే స‌వాలుతో కూడుకున్న విష‌య‌మే. ఇంట్రో సీన్ చూసి.. క్లైమాక్స్ వ‌ర‌కు ఊహించేసే తెలివితేట‌లు ఈ త‌రం ప్రేక్ష‌కుల‌వి. సినిమాల విష‌యంలో పెరిగిన యాక్సెస్ అందుకు కార‌ణం. అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల‌ను ఉత్కంఠ‌తో ఊపేసిన‌ అన్వేష‌ణ సినిమా ఇప్పుడు వ‌స్తే.. కిల్ల‌ర్ రాళ్ళ‌ప‌ల్లి అని ఈజీగా క‌నిపెట్టేస్తారేమో. ఇలాంటి స‌మ‌యంలో ప్రేక్ష‌కుల‌ను చివ‌రి వ‌ర‌కు గెస్సింగ్ లో ఉంచ‌డంలో.. వారి అంచ‌నాల‌కు అంద‌ని విధంగా క‌థ‌ను న‌డిపించ‌డంలో విరూపాక్ష టీం స‌క్సెస్ అయింది. పెద్ద‌గా హ‌డావుడి లేకుండా సింపుల్ గానే క‌థ‌ను మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు కార్తీక్.. ఆ త‌ర్వాత క‌థ టేకాఫ్ అయ్యేవ‌ర‌కు సాధార‌ణంగానే బండి న‌డిపించాడు. మ‌రీ డ‌ల్లుగా క‌నిపించే హీరో.. తిక్క తిక్క‌గా ప్ర‌వ‌ర్తించే క‌థానాయిక‌ల మ‌ధ్య ప్రేమ‌క‌థ ఏమంత ఆస‌క్తి రేకెత్తించ‌దు. ఆ ప్రేమ‌క‌థ న‌డుస్తున్నంత‌సేపు సినిమా అలా మొద‌లై ఇలా వెళ్తోందేంటి అనే అస‌హ‌నం క‌లుగుతుంది.

కానీ ద‌ర్శ‌కుడు అస‌లు క‌థ‌లోకి దిగాక విరూపాక్ష ప్రేక్ష‌కుల‌ను ఎంగేజ్ చేయ‌డం మొద‌లుపెడుతుంది. గ్రామంలో ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ప్రాణాలు కోల్పోయే తీరు భ‌యం పుట్టిస్తే.. ఆ చావుల వెనుక కార‌ణ‌మేంట‌న్న‌ స‌స్పెన్స్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. త‌ర్వాతి చావు క‌థానాయిక‌ద‌ని తెలియ‌డంతో ఉత్కంఠ రెట్టింప‌వుతుంది. క‌థ మ‌రింత ర‌స‌కందాయంలో ప‌డుతుంది. స‌స్పెన్స్ ఫ్యాక్ట‌ర్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్లి ఇంట‌ర్వెల్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. హీరోయిన్ని కాపాడుకోవ‌డానికి హీరో చేసే పోర‌టం నేప‌థ్యంలో ద్వితీయార్ధం న‌డుస్తుంది. ద్వితీయార్ధంలో హీరో చేసే సాహ‌సాలు.. అత‌ను ఒక్కో ర‌హ‌స్యాన్ని వెలికి తీసే తీరు.. సినిమాటిగ్గా ఉన్న‌ప్ప‌టికీ.. అదేమంత ఇబ్బంది కాదు. హీరోయిన్ పాత్ర చిత్ర‌ణ.. ఆ పాత్ర‌కు క‌థ‌లో ఇచ్చిన ప్రాధాన్యం సినిమాకు అతి పెద్ద బ‌లం. ఆ పాత్ర‌ను చివ‌ర్లో చూసి షాక‌వ్వ‌కుండా ఉండ‌లేరు. మారిన ప్రేక్ష‌కుల అభిరుచి మీద న‌మ్మ‌కంతో ఆ పాత్ర‌ను అలా తీర్చిదిద్దిన‌ట్లున్నారు.

ఈ క‌థ మూఢ న‌మ్మ‌కాలు.. చేత‌బ‌డులు.. ఆత్మ‌ల చుట్టూ తిరిగేది. ఐతే ప్ర‌థ‌మార్ధంలో క‌థ న‌డిచే తీరు చూస్తే.. దీనికి సైంటిఫిక్ ట‌చ్ ఇస్తాడేమో అన్న సందేహాలు క‌లుగుతాయి. అలా ప్ర‌య‌త్నించి ప్రేక్ష‌కుల‌ను క‌న్విన్స్ చేయ‌డం అంత తేలిక కాదు. అందుకే ద‌ర్శ‌కుడు రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేయ‌కుండా.. అరుంధ‌తి సినిమా త‌ర‌హాలో దీన్ని న‌డిపించేశాడు. అలా అని ఇందులో ద‌ర్శ‌కుడి బ్రిలియ‌న్స్ క‌నిపించ‌ద‌నేమీ లేదు. క‌థ‌ను ప‌క‌డ్బందీగానే తీర్చిదిద్దుకున్నాడు. ఊహ‌కంద‌ని మ‌లుపుల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్ మెయింటైన్ చేయ‌గ‌లిగాడు. విల‌న్ ఫ‌లానా కుటుంబానికి చెందిన వ్య‌క్తి అని ఎవ్వ‌రైనా ఊహించేస్తారు కానీ.. ఆ వ్య‌క్తి ఎవ‌రు.. వాళ్ల ప్ర‌ణాళిక ఏంటి.. గ్రామంలో ఒక్కొక్క‌రిని ఎలా చంప‌గ‌లుగుతున్నారు.. చివ‌ర‌గా ఏం జ‌ర‌గ‌బోతోంది అనేది గెస్ చేయ‌డం క‌ష్టం. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ కు క‌ట్టుబ‌డి.. దానికి న్యాయం చేసేలా సాగింది విరూపాక్ష‌. ఆ జాన‌ర్ ను ఇష్ట‌ప‌డేవారిని విరూపాక్ష ఫుల్లుగా ఎంగేజ్ చేస్తుంది. మిగ‌తా ప్రేక్ష‌కులు కూడా సినిమా చూస్తే రిగ్రెట్ అవ్వ‌రు.


న‌టీన‌టులు:

సాయిధ‌ర‌మ్ తేజ్ సూర్య పాత్ర‌లో ఓకే అనిపించాడు. ప్ర‌మాదం త‌ర్వాత చేసిన సినిమా కావ‌డం వ‌ల్ల అత‌ను డ‌ల్లుగా క‌నిపించాడు. త‌న లుక్ స‌రిగా సెట్ కాలేదు. విగ్ తేడా కొట్టేసింది. ద్వితీయార్ధంలో తేజు ఆక‌ట్టుకున్నాడు కానీ.. ప్ర‌థ‌మార్ధంలో మాత్రం చాలా చోట్ల నామ‌మాత్రంగా సాగింది అత‌డి పాత్ర‌.. న‌ట‌న‌. తేజు ఇంకాస్త చురుగ్గా ఉండాల్సింది. మ‌రింత‌గా హావ‌భావాలు ప‌లికించాల్సింది. హీరోయిన్ సంయుక్త పాత్ర‌.. త‌న న‌ట‌న సినిమాలో స‌ర్ప్రైజ్ ప్యాకేజ్. ఈ సినిమా త‌ర్వాత ఆమెను చూసే దృక్కోణ‌మే మారిపోవ‌చ్చు. కొన్ని చోట్ల సంయుక్త కూడా హావ‌భావాల విష‌యంలో ఇబ్బంది పెట్టిన‌ప్ప‌టికీ.. ఓవ‌రాల్ గా త‌న పెర్ఫామెన్స్ ఆక‌ట్టుకుంటుంది. కీల‌క పాత్ర‌లో సీరియ‌ల్ న‌టుడు ర‌వికృష్ణ ఆక‌ట్టుకున్నాడు. అఘోరా పాత్ర‌లో అజ‌య్ అద‌ర‌గొట్టాడు. రాజీవ్ క‌న‌కాల.. బ్ర‌హ్మాజీ.. సాయిచంద్.. వీళ్లంతా త‌మ అనుభ‌వాన్ని చూపించారు. సునీల్ పాత్రను ఆరంభంలో చూసి ఏదో ఊహించుకుంటాం కానీ.. అది మామూలుగా సాగిపోయింది. త‌న న‌ట‌న ఓకే. అభిన‌వ్ గోమ‌ఠంది చిన్న పాత్ర‌. మిగ‌తా న‌టీన‌టులంతా ఓకే.


సాంకేతిక వ‌ర్గం:

విరూపాక్షకు క‌థ త‌ర్వాత‌ అతి పెద్ద బ‌లం.. సాంకేతిక నిపుణుల ప‌నితీరు. సినిమా అంతటా టెక్నిక‌ల్ బ్రిలియ‌న్స్ క‌నిపిస్తుంది. క‌న్న‌డ సంగీత ద‌ర్శ‌కుడు అజనీష్ లోక్ నాథ్ ఆర్ఆర్ అద‌ర‌గొట్టేశాడు. స‌న్నివేశాల‌ను బీజీఎం బాగా ఎలివేట్ చేసింది. సౌండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్ట‌డంలో.. ఉత్కంఠ‌ను పెంచ‌డంలో సౌండ్ డిజైన్ కీల‌క పాత్ర పోషించింది. శ్యామ్ ద‌త్ ఛాయాగ్ర‌హ‌ణం కూడా చాలా బాగుంది. అత‌డికి ఆర్ట్ డైరెక్ట‌ర్ మంచి స‌హ‌కారం అందించాడు. చాలా వ‌ర‌కు సెట్టింగ్స్ మ‌ధ్యే సినిమా న‌డిచినా.. మ‌నం ఒక అట‌వీ ప్రాంతంలోని గ్రామంలో ఉన్న భావ‌న క‌లిగించేలా ఆర్ట్ డైరెక్ట‌ర్, కెమెరామ‌న్ త‌మ ప‌నిత‌నాన్ని చూపించారు. నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి. సినిమాలో మంచి క్వాలిటీ క‌నిపిస్తుంది. కార్తీక్ దండు ర‌చయిత‌గా.. ద‌ర్శ‌కుడిగా మంచి ప‌నిత‌నమే చూపించాడు. అత‌డి క‌థే సినిమాకు పెద్ద బ‌లం. సుకుమార్ త‌న మార్కు స్క్రీన్ ప్లేతో ఆ క‌థ‌కు ఎలివేషన్ ఇచ్చాడు. సుకుమార్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ద‌ర్శ‌కులు అయ్యేవారిపై విరూపాక్ష మ‌రింత అంచ‌నాల‌ను పెంచుతుంద‌న‌డంలో సందేహం లేదు.

చివ‌ర‌గా: విరూపాక్ష‌.. థ్రిల్ చేస్తాడు

రేటింగ్ - 3/5