Begin typing your search above and press return to search.

విర్గో పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి 'సెహరీ' టైటిల్ ఖరారు..!

By:  Tupaki Desk   |   3 Nov 2020 6:30 AM GMT
విర్గో పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి సెహరీ టైటిల్ ఖరారు..!
X
విర్గో పిక్చర్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా ఓ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో హర్ష కనుమల్లి హీరోగా పరిచయం అవుతుండగా.. 'హమ్ తుమ్' 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాలలో మెప్పించిన సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి ''సెహరీ'' అనే టైటిల్ ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 'సెహరీ' అంటే సెలెబ్రేషన్స్ అని అర్థం. ఇది కెన్యా లోని స్వహాలి భాషకు చెందిన పదం. 'సెహరీ' అనే పదం వినగానే బొమ్మరిల్లు సిద్దార్థ్ - షామిలి జంటగా నటించిన 'ఓయ్' సినిమా గుర్తొస్తుంది. ఈ సినిమాలో లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య రాసిన 'సెహరీ.. సెహరీ' అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కృష్ణ చైతన్య అద్భుతమైన సాహిత్యంలోని 'సెహరీ' పదాన్ని తీసుకొని సినిమా టైటిల్ గా పెట్టుకున్నారని తెలుస్తోంది.

కాగా, 'సెహరీ' సినిమా కలర్ ఫుల్ గా సెలెబ్రేషన్స్ చేసుకునే విధంగా ఉంటుంది అన్నట్లు టైటిల్ పోస్టర్ డిజైన్ చేయబడింది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మధ్యలో టైటిల్ చూపిస్తూ.. ఓ గిఫ్ట్ ని కూడా ఉంచారు. 'అన్ బాక్సింగ్ సూన్' అంటూ త్వరలోనే గిఫ్ట్ బాక్స్ ని తెరవబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి జ్ఞాన సాగర్ దర్శకత్వం వహించనున్నారు. సురేష్ సారంగం సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం సమకూరుస్తుండగా.. రవితేజ గిరజాల ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. అద్వయ జిష్ణు రెడ్డీ - శిల్పా చౌదరీ 'సెహరీ' చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.