Begin typing your search above and press return to search.

పవన్‌ భవదీయుడు కంటే ముందు వినోదయ్య సిత్తం...!

By:  Tupaki Desk   |   24 May 2022 2:30 AM GMT
పవన్‌ భవదీయుడు కంటే ముందు వినోదయ్య సిత్తం...!
X
పవన్‌ కళ్యాణ్ సినిమా ల ఆర్డర్‌ అంతా గందరగోళంగా ఉంది. అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ అవ్వడంతో పవన్‌ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లి పోయాడు. తాను మళ్లీ సినిమాలు చేయకపోవచ్చు అంటూ స్వయంగా పవన్ చెప్పుకొచ్చాడు. అయితే ఆర్థిక అవసరాల నిమిత్తం అంటూ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా పవన్ ప్రకటించి వరుసగా మూడు సినిమాలను ఒకే సారి ప్రకటించి అందరిని ఆశ్చర్యపర్చాడు.

ఆ సమయంలో ప్రకటించిన దాని ప్రకారం పవన్‌ కళ్యాణ్ మొదట పింక్ రీమేక్ వకీల్‌ సాబ్‌ ను చేయాల్సి ఉంది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో.. ఆ తర్వాత హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌ సింగ్ మరియు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా.. ఇలా నాలుగు సినిమాలను పవన్ టీమ్‌ అధికారికంగా ప్రకటించడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

వకీల్‌ సాబ్‌ సినిమా పూర్తి అవ్వగానే చిన్న సినిమా అంటూ రీమేక్ భీమ్లా నాయక్ ను పవన్ చేశాడు. ఆ సినిమా విడుదల అయ్యింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా ను పవన్ చేస్తున్న విషయం తెల్సిందే. హరి హర వీరమల్లు తర్వాత ఖచ్చితంగా హరీష్‌ శంకర్ దర్శకత్వంలో సినిమాను పవన్‌ చేస్తాడని అంతా భావిస్తే ప్రస్తుతం మరో రీమేక్ ను తెరపైకి తీసుకు వస్తున్నారు.

తమిళ చిత్రం వినోదయ్య సిత్తం ను రీమేక్ చేయడం కోసం దాదాపుగా పవన్ ఓకే చెప్పేశాడు. సముద్రకని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు స్క్రిప్ట్‌ వర్క్ ను త్రివిక్రమ్‌ ఆధ్వర్యంలో సాయి మాధవ్‌ బుర్ర నిర్వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం పవన్‌ 35 నుండి 40 రోజుల సమయం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వినోదయ్య సిత్తంను మొదలు పెట్టిన వెంటనే పూర్తి అయ్యేలా బ్రేక్ లేకుండా ప్లాన్‌ చేస్తున్నారు.

వినోదయ్య సిత్తం ను రెండు నెలల లోపులోనే పూర్తి చేసి ఆ వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాను పవన్‌ కళ్యాణ్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. వినోదయ్య సిద్దం ను పవన్‌ కళ్యాణ్ చాలా మెచ్చాడట. అందులోని లీడ్‌ రోల్‌ పట్ల పవన్‌ చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆ పాత్రను బేస్ చేసుకుని కథను పూర్తిగా రీమేక్ కోసం మార్చబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.

హరి హర వీరమల్లు సినిమా కంటే ముందే లేదా తర్వాత వినోదయ్య సిద్దం రీమేక్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి పవన్‌ నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే వస్తున్నాయి కాని ఎప్పుడు ఏది అనే క్లారిటీ గా రావడం లేదు.