Begin typing your search above and press return to search.

'ప్రేమ‌దేశం' హీరో మిస్సింగ్

By:  Tupaki Desk   |   4 Oct 2019 1:30 AM GMT
ప్రేమ‌దేశం హీరో మిస్సింగ్
X
హ‌లో డాక్ట‌ర్ హార్ట్ మిస్సాయే..! అంటూ యంగ్ హీరోలు అబ్బాస్ - వినీత్ చేసిన హంగామాను యూత్ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. 1996లో వ‌చ్చిన `ప్రేమ‌దేశం`(కాద‌ల్ దేశం) ఓ సంచ‌ల‌నం. ప్రేమ‌-స్నేహం నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ చిత్రం యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించింది. క‌దిర్ ద‌ర్శ‌క‌త్వంలో జెంటిల్ మెన్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ పై కె.టి.కుంజుమోన్ నిర్మించిన ఈ సినిమా ప్రేమ‌క‌థా చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది. ఏ.ఆర్‌. రెహ‌మాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో అప్ప‌ట్లో ద‌క్షిణాదిలో క్రేజీ ఆల్బ‌మ్‌. అప్ప‌ట్లో ఏ యూత్ పార్టీకి వెళ్లినా.. ఏ కాలేజీకి వెళ్లినా `ముస్త‌ఫా..ముస్తఫా..డోంట్‌వ‌ర్రీ ముస్త‌ఫా కాలం నీ నేస్తం ముస్తాఫా` అనే పాటే వినిపించేది. ఆల్బ‌మ్ లో ప్ర‌తిపాటా ప్ర‌త్యేక‌మైన‌దే. ఆ స్థాయిలో యువ‌తను వెర్రి వాళ్ల‌ని చేసింది ఆ చిత్రం.

ఈ క్రేజీ చిత్రంలో న‌టించిన వినీత్‌- అబ్బాస్‌- ట‌బు అప్ప‌టి యువ‌త‌కు హాట్ ఫేవ‌రేట్ అయిపోయారు. అంతలా ప్ర‌భావితం చేసిందీ సినిమా. ఈ సినిమా త‌రువాత కాలేజీల్లో చాలా వ‌ర‌కు ఫ్రెండ్స్ వినీత్‌.. అబ్బాస్ హెయిర్ స్టైల్స్ ని అనుక‌రించి తిరిగారంటే అర్థం చేసుకోవ‌చ్చు. యూత్ ని ఈ మూవీ ఏ రేంజ్ లో ప్ర‌భావితం చేసిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాంటి క్రేజీ సినిమా ద్వారా హీరోగా ప‌రిచ‌య‌మైన కోల్ క‌తా కుర్రాడు అబ్బాస్ ఓవ‌ర్ నైట్ లోనే హాట్ ఫేవ‌రేట్ గా మారిపోయాడు. తెలుగు- త‌మిళ భాష‌ల్లో వ‌రుస క్రేజీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుని పెద్ద స్టార్ అయిపోయాడు. కానీ ఆ స్టార్ డ‌మ్ ని నిల‌బెట్టుకోలేక‌పోయాడు. అప్పుడ‌ప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్ యాడ్ లో క‌నిపించేవాడు. మల‌యాళ చిత్రం `ప‌చ్చ‌క్క‌ల్ల‌మ్‌` త‌రువాత మరో సినిమా చేయ‌లేదు. అయితే త‌న స‌ర‌స‌న ప‌లు చిత్రాల్లో న‌టించిన అందాల క‌థానాయిక సిమ్ర‌న్ తో అబ్బాస్ ఎఫైర్ అప్ప‌ట్లో ఎంతో హాట్ టాపిక్ అయ్యింది. సిమ్ర‌న్ తో బ్రేకప్ సంచ‌ల‌న టాపిక్ అయ్యింది. ఆ క్ర‌మంలోనే 2016లో అబ్బాస్ ఇండ‌స్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేశాడు.

`ప్రేమ‌దేశం` క‌ల‌ల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న అబ్బాస్ ఇప్పుడు ఎక్క‌డున్నాడు? ఏం చేస్తున్నాడు? అంటే త‌న‌తో క‌లిసి న‌టించిన వినీత్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించాడు. అబ్బాస్ ప్ర‌స్తుతం న్యూజిలాండ్ లో వున్నాడ‌ని.. అక్క‌డే కుటుంబంతో సెటిల‌య్యాడ‌ని తెలిపారు. అప్పుడ‌ప్పుడు ఫేస్ బుక్ లో త‌న‌కు ట‌చ్ లో వుంటున్నాడ‌ని వెల్ల‌డించారు. అయితే అబ్బాస్ - వినీత్ ల‌ను క‌లిపి తిరిగి ప్రేమ‌దేశం సీక్వెల్ తీయాలంటే కుద‌ర‌దు కానీ.. అచ్చం అలాంటి కుర్రాళ్ల‌ను వెతికి కొత్త‌త‌రంతో సీక్వెల్ చిత్రం తీసే ప్ర‌య‌త్నం చేస్తే ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయ‌డానికి చాలానే ట్యాలెంట్ చూపించాల్సి ఉంటుంది. అయితే ఈకాలంలో ప్రేమ‌క‌థ‌ల్ని క‌దిర్ లా తీయ‌గ‌లిగే ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు పుట్టాల్సి ఉంటుందేమో!