Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'వినయ విధేయ రామ'

By:  Tupaki Desk   |   11 Jan 2019 11:21 AM GMT
మూవీ రివ్యూ: వినయ విధేయ రామ
X
చిత్రం : 'వినయ విధేయ రామ'

నటీనటులు: రామ్ చరణ్ - కియారా అద్వాని - వివేక్ ఒబెరాయ్ - ప్రశాంత్ - స్నేహ - మహేష్ మంజ్రేకర్ - ముకేష్ రుషి - ఆర్యన్ రాజేష్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: రిషి పంజాబి - ఆర్థర్ విల్సన్
మాటలు: ఎం.రత్నం
నిర్మాత: డీవీవీ దానయ్య
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: బోయపాటి శ్రీను

‘రంగస్థలం’తో తిరుగులేని విజయాన్నందుకున్న రామ్ చరణ్ హీరోగా.. మాస్ సినిమాలకు పెట్టింది పేరైన బోయపాటి శ్రీను రూపొందించిన సినిమా ‘వినయ విధేయ రామ’. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రామ్ (రామ్ చరణ్) ఒక అనాథ. అతడిని అనాథలైన ఇంకో నలుగురు చేరదీస్తారు. ఐదుగురూ ఒక పెద్ద మనిషి అండతో కష్టపడి పెరిగి పెద్దవాళ్లవుతారు. తనను చేరదీసిన నలుగురినీ అన్నయ్యలుగా భావించే రామ్.. వారి కోసం ప్రాణం పెట్టేస్తాడు. వారి జోలికి ఎవరు వచ్చినా వదిలి పెట్టడు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన తన పెద్దన్నయ్యకు ఎదురయ్యే ప్రతి సమస్యకూ అతను పరిష్కారంగా నిలుస్తుంటాడు. ఐతే బీహార్లో రౌడీ రాజ్యాన్ని నడిపిస్తున్న రాజా భాయ్ (వివేక్ ఒబెరాయ్)ని ఎదురించబోయి చిక్కుల్లో పడతాడు రామ్ అన్నయ్య. ఈ పరిస్థితుల్లో రామ్ ఏం చేశాడు.. రాజాను ఎలా ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

హీరోను ఇనుప గొలుసులతో కట్టేసి ఉంచుతారు. అతడిని విలన్ రెచ్చగొడతాడు. అంతే.. హీరోకు ఆవేశం వస్తుంది. అతను విసిరిన విసురుకి గొలుసులు కట్టేసి ఉన్న ఇనుప స్తంభాలు భూమి లోతుల్లోంచి బయటికి వచ్చేస్తాయి. ఇలాంటి మాస్ సీన్స్ తెలుగు సినిమాల్లో ఎన్ని చూడలేదు? అక్కడితో ఆగిపోతే బోయపాటి ప్రత్యేకత ఏముంది? వెంటనే హీరో చేతికి ఒక కత్తి దొరుకుతుంది. అతడి మీదికి ఇద్దరు రౌడీలు దూసుకొస్తారు. ఆ ఇద్దరి తలల్ని ఒకేసారి నరికితే.. అవి గాల్లోకి ఎగిరి వందల కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్తుంటాయి. అంతలో రెండు గద్దలొచ్చి ఒక్కో తలను ఎగరేసుకుపోతాయి. విలన్ రోకో రోకో అని అరుస్తూ మెషీన్ గన్ తీసుకుని గద్దల్ని కాలుస్తాడు. ‘వినయ విధేయ రామ’ గురించి మాట్లాడుతూ.. మధ్యలో ఏమిటీ పిచ్చి ఫాంటసీలన్నీ అనిపిస్తోందా? ఇది నిజ్జంగా ఈ సినిమాలోని సీనే. దీన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉండొచ్చని ఒక అంచనాకు వచ్చేయండి.

గత కొన్నేళ్లలో తెలుగు సినిమా చాలా మారిపోయింది. ఇటు దర్శకులు.. అటు హీరోలు కొత్తదనం వైపు అడుగులేస్తున్నారు. వినూత్నమైన సినిమాలకు ప్రేక్షకులూ పట్టం కడుతున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా ఒక ఫార్ములా ప్రకారం మాస్ మసాలా సినిమాలు తీసుకుంటూ సాగిపోతున్నాడు బోయపాటి శ్రీను. ఐతే ఎంత ఫార్ములాను అనుసరించినా.. తన హీరోతో ఎన్ని విన్యాసాలు చేయించినా.. తెరపైన ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రేక్షకులు ఎంతో కొంత రిలేట్ అయ్యే పాత్రలు.. కథలతోనే సాగుతూ వచ్చాడతను. ప్రేక్షకుల్ని తన కథలతో కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ చేయడం వల్ల.. అతను ఎంత అతి చేసినా సర్దుకుపోతూనే వచ్చారు. కానీ ఏ విషయాన్నయినా ‘టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్’ అనుకుంటే.. ఏం చేసినా చెల్లిపోతుందని అనుకుంటే ఒక సినిమా ఎలా తయారవుతుందో చెప్పడానికి ‘వినయ విధేయ రామ’ ఉదాహరణగా నిలుస్తుంది.

ఒక ప్రాంతాన్ని గుప్పెట్లో పెట్టుకుని అడ్డూ అదుపు లేకుండా అరచకాలు సాగించే విలన్.. అవతల ఉన్నది ఎంత వారైనా ముందు వెనుక చూడకుండా దూసుకెళ్లిపోయే హీరో.. అనుకోకుండా ఇద్దరి మధ్య వైరం.. హీరోదే పైచేయి.. ఇదీ బోయపాటి సినిమాల్లో తరచుగా కనిపించే ఫార్ములా. ఐతే కొంచెం నేపథ్యాల్నిమార్చి ఇదే కథను ఇటు అటు తిప్పి హిట్లు కొడుతూ వచ్చాడతను. ‘వినయ విధేయ రామ’ ట్రైలర్ చూస్తే మళ్లీ ఇదే విందు వడ్డించబోతున్నాడని అర్థమైంది. ఐతే ఈ అలవాటైన కథకు ఆసక్తికర నేపథ్యం జోడిండంలో.. ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్టయ్యేలా చెప్పడంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. రామ్ చరణ్ లాంటి పెద్ద మాస్ హీరో దొరికాడు కాబట్టి.. అతడిని ఎంత బలంగా (శారీరకంగా) చూపిద్దాం.. ఎలాంటి విన్యాసాలు చేయిద్దాం.. హీరోయిజాన్ని ఎంత ఎలివేట్ చేద్దాం.. ఎన్ని పంచ్ డైలాగులు వేయిద్దాం.. ఎన్ని ఫైట్లు చేయిద్దాం.. అతడితో ఎంత మందిని చంపిద్దాం అన్నదే అతడి ఆలోచనగా మారినట్లుగా అనిపిస్తుంది. ఈ చిత్రానికి అసలు ‘వినయ విధేయ రామ’ అని టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. సినిమా అంతా హీరో చేసేది విధ్వంసమే. సినిమాలో దాదాపు సగభాగం చరణ్ ఫైట్లు మాత్రమే చేశాడు. ఇంకా చెప్పాలంటే సినిమాలో రామ్ చరణ్ చేసింది ఫైట్లు మాత్రమే.

ఒక ఉత్తరాది రాష్ట్రానికి సీఎం అయిన వ్యక్తి వందల మంది కమాండోలతో కలిసి.. తెలుగు రాష్ట్రంలో ఉన్న హీరో దగ్గరికి వచ్చి అంటాడు.. ‘‘మా రాష్ట్రానికి ఒకప్పుడు బుద్ధుడొచ్చాడు. తర్వాత నువ్వొచ్చి మా దగ్గర జరుగుతున్న అరాచకాల్ని ఆపావు’’ అని. ‘సింహాద్రి’ రోజుల్లో ఇలాంటి ఎలివేషన్లు బాగానే అనిపించి ఉండొచ్చు కానీ.. ఇలాంటివి చూసి చూసి విసుగెత్తిపోయి కొన్నేళ్ల కిందటే ఇలాంటి సినిమాలకు సమాధి కట్టేశారు ప్రేక్షకులు. అలాంటిది ఇప్పుడు బోయపాటి మళ్లీ ఇలాంటి ఎలివేషన్లు ట్రై చేశాడు. తనకంటే పెద్దవాళ్లయిన కుర్రాళ్లను ఒక ఏడెనిమిదేళ్ల పిల్లాడు ‘నేను పని చేసి వీళ్లను చదివిస్తా’ అంటూ సవాల్ విసిరే తొలి సన్నివేశంతోనే ‘వినయ విధేయ రామ’ ఎలా సాగబోతుందో ఒక అంచనా వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో పరమ రొటీన్ గా.. సోకాల్డ్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్లో సినిమా నడుస్తుంది.

హీరో అన్నయ్య ఆఫీసుకు వెళ్లి ఒక పొలిటీషయన్ బెదిరిస్తుంటే.. హీరో ఉన్నట్లుండి ఊడిపడి మరెక్కడో ఉన్న అతడి రౌడీల్ని కొట్టుకొంటూ అదే ఆఫీసుకు తీసుకొచ్చి తన ప్రతాపం చూపించడం.. ఎక్కడో బీహార్లోని ఒక మారుమూల కొండ ప్రాంతం నుంచి తన అన్నయ్య కాపాడమంటూ ఫోన్ చేయగానే ఇంకెక్కడో ఎయిర్ పోర్టులో ఉన్న హీరో అద్దాలు పగలగొట్టుకుని కిందికి దూకేసి.. ఇంకొంచెం ముందుకొచ్చి ఫ్లైఓవర్ మీది నుంచి శరవేగంగా దూసుకెళ్తున్న ట్రైన్ మీదికి దూకేసి.. అక్కడి నుంచి గుర్రమేసుకుని విలన్ డెన్‌లోకి ఎంట్రీ ఇచ్చి విలన్లను ఉతికారేయడం.. అబ్బో మామూలు విన్యాసాలు కావివి. ఒకేసారి బోయపాటి కొన్ని దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్లిపోతాడు ప్రేక్షకుల్ని. ఈ విపరీత స్థాయి యాక్షన్ ఘట్టాల మధ్య అప్పుడప్పుడూ ఫ్యామిలీ సెంటిమెంట్.. కామెడీ ట్రాక్.. లవ్ ట్రాక్స్ కూడా నడిపించాడు. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎంత మాస్ ప్రేక్షకులైనా కూడా ఇంత రొడ్డకొట్టుడు మాస్ ను భరించడం కష్టమే.

నటీనటులు:

‘రంగస్థలం’తో నటుడిగా గొప్ప పేరు సంపాదించి.. మరపురాని విజయాన్నందుకున్న రామ్ చరణ్.. దాని తర్వాత ఇలాంటి సినిమా చేయడం విచారకరమైన విషయం. అతడికి ఈ సినిమా ఏ రకంగానూ ఉపయోగపడదు. చరణ్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి యాక్సెప్టెన్స్ వస్తున్న సమయంలో ఇలాంటి సినిమా కచ్చితంగా అతడిని వెనక్కి లాగేదే. పెర్ఫామెన్స్ పరంగా చెప్పుకోవడానికేమీ లేదు. యాక్షన్ సన్నివేశాల్లో.. డ్యాన్సుల్లో అతను ఎప్పట్లాగే రాణించాడు. హీరోయిన్ కియారా అద్వానీ కేవలం పాటలకు మాత్రమే పనికొచ్చింది. ఆమె అందంగా కనిపించింది. విలన్ వివేక్ ఒబెరాయ్ దర్శకుడు చెప్పినట్లు చేసుకుపోయాడు. అతడి పాత్ర ఏమీ ఆసక్తి రేకెత్తించదు. ప్రశాంత్.. స్నేహలకు కొంచెం వెయిట్ ఉన్న పాత్రలే ఇచ్చారు కానీ.. అవేమీ అంత ఆసక్తికరంగా లేవు. సినిమాలో ఇంకెవ్వరి గురించి కూడా పెద్దగా చెప్పడానికి లేదు.

సాంకేతికవర్గం:

ఈ మధ్య అసలే దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో పదును ఉండట్లేదు. పైగా ‘వినయ విధేయ రామ’ కథ విన్నాక అతడిలో ఉత్సాహం మరింత తగ్గిపోయిందేమో. చెప్పుకోవడానికి ఒక పాట లేదు. నేపథ్య సంగీతంలోనూ ఏ ప్రత్యేకతా లేదు. అతడి కెరీర్లో అట్టడుగున నిలిచే సినిమాల్లో ఇదొకటి అవుతుంది. రిషి పంజాబి.. ఆర్థర్ విల్సన్ అందించిన ఛాయాగ్రహణం మామూలుగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. కావాల్సినంత ఖర్చు పెట్టారు. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను.. మాస్ సినిమా అంటే ఏమైనా చెల్లిపోతుందన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఈ సినిమా తీసినట్లు అనిపిస్తుంది. కథలో ఏ కొత్తదనం లేదు. కథనమూ అంతంతే. ఇంతకుముందులా యాక్షన్ ఘట్టాల్లో అతను ప్రేక్షకుల్లో భావోద్వేగాల్ని రగల్చలేకపోయాడు. ఎమోషన్ లేకుండా ఊరికే యాక్షన్ ఘట్టాలతో సినిమాను నింపేశాడు. దర్శకుడిగా అతను పూర్తిగా విఫలమయ్యాడు. బోయపాటి కెరీర్లోనే ఇది వీకెస్ట్ మూవీ అనడంలో సందేహం లేదు.

చివరగా: వినయ విధేయ రామ.. విలయం.. విధ్వంసం!

రేటింగ్- 2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre