Begin typing your search above and press return to search.

తెలుగు తెరపై పల్లె కథల వైభవం

By:  Tupaki Desk   |   14 April 2018 9:00 AM IST
తెలుగు తెరపై పల్లె కథల వైభవం
X
80లు.. 90ల వరకు అటు తమిళంలో.. ఇటు తెలుగులో పల్లెటూరి కథలతో బోలెడన్ని సినిమాలొచ్చేవి. అప్పట్లో పది సినిమాల్లో ఏడెనిమిది పల్లెటూరి కథలతోనే తెరకెక్కేవి. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రచయితలు.. దర్శకులు అర్బన్ స్టోరీల మీదే దృష్టిపెట్టారు. క్రమంగా అవే తెలుగు సినిమాను కమ్మేశాయి. పల్లెటూరి కథలకు అసలు చోటే లేకుండా పోయింది. ఐతే సరిగ్గా తీయాలే కానీ.. విలేజ్ సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరిస్తాయని.. అద్భుతమైన ఫలితాలను అందిస్తాయని అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు రుజువు చేస్తూనే ఉన్నాయి. ఇందుకు తాజా రుజువు.. ‘రంగస్థలం’. ఈ చిత్రం ఏ స్థాయి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

రెగ్యులర్ అర్బన్ సినిమాల మధ్య ‘రంగస్థలం’ చాలా వైవిద్యంగా కనిపించింది. ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. దీని కంటే ముందు పల్లెటూరి కథతో అద్భుతమైన విజయం సాధించిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఆ చిత్రం అనూహ్యమైన వసూళ్లతో నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక గత ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ వసూళ్లు రాబట్టిన ‘శతమానం భవతి’ కూడా పల్లెటూరి నేపథ్యంలో సాగే సినిమానే. రెండు భారీ సినిమాలతో పోటీ పడి కూడా ఆ చిత్రం పెద్ద విజయం సాధించింది. అంతకుముందు ‘అఆ’ కూడా చాలా వరకు పల్లెటూరి నేపథ్యంలోనే సాగుతుంది. అదెంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇంకా గత కొన్నేళ్లలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ‘‘ఉయ్యాలా జంపాలా’ లాంటి సినిమాలు కూడా పల్లెటూరి నేపథ్యంలోనే సాగుతూ మంచి వినోదాన్ని పంచాయి. ఇంకా వెనక్కి వెళ్తే విలేజ్ స్టోరీలతో తెరకెక్కిన బ్లాక్ బస్టర్లు ఎన్నో కనిపిస్తాయి. పల్లెటూరి నేపథ్యంలో ఏం సినిమా తీస్తామని లైట్ తీసుకోకుండా మంచి కథతో సినిమా తీస్తే ప్రేక్షకాదరణ అనూహ్యంగా ఉంటుందనడానికి చాలా రుజువులే కనిపిస్తున్నాయి. అర్బన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న సుకుమార్ తీయగా లేనిది మిగతా దర్శకులు ఈ తరహా సినిమాలు తీయలేరా? కాబట్టి మిగతా వాళ్లూ ఆ దిశగా ఒక ప్రయత్నం చేస్తే బెటర్.