Begin typing your search above and press return to search.

మళ్లీ ఆ సెన్సేషనల్ కాంబినేషన్

By:  Tupaki Desk   |   25 Oct 2015 4:18 AM GMT
మళ్లీ ఆ సెన్సేషనల్ కాంబినేషన్
X
ఓ ఇరవయ్యేళ్లు వెనక్కి వెళ్తే విక్రమ్ హీరో కూడా కాదు. తెలుగు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలేసుకుంటూ గడిపేవాడు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయిన్ కు భర్త క్యారెక్టర్లు వేసుకుంటూ ఉండేవాడు. అలాంటి వాణ్ని నమ్మి ‘సేతు’ అనే అద్భుతమైన సినిమా తీశాడు డైరెక్టర్ బాల. దర్శకుడిగా బాలకు అదే తొలి సినిమా. నెగెటివ్ టాక్ తో మొదలైన ఆ సినిమా ఆ తర్వాత సెన్సేషనల్ హిట్టయి బాలకు లెక్కలేనన్ని అవార్డులు తెచ్చిపెట్టింది. అతణ్ని పెద్ద డైరెక్టర్ని చేసింది. ‘సేతు’ తర్వాత మళ్లీ ‘పితామగన్’ కోసం జత కట్టింది విక్రమ్ - బాల జోడీ.

పితామగన్ ఇంకా పెద్ద హిట్టు. తెలుగులోకి ‘శివపుత్రుడు’ పేరుతో విడుదలై ఇక్కడా విజయం సాధించింది. ఈ సినిమాతోనే విక్రమ్ జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ సినిమా వచ్చిన పన్నెండేళ్లవుతోంది. మళ్లీ ఇన్నాళ్లకు విక్రమ్ - బాల కలిసి ఇంకో సినిమా చేయబోతున్నారు. విక్రమ్ నటించిన ‘10 ఎన్రదుకుల్లా’ సినిమా దసరాకు విడుదలైంది. దీని తర్వాత తెలుగులోకి డైనమైట్ గా రీమేక్ అయిన అరిమా నంబి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆనంద్ శంకర్ తో ఓ సినిమాకు కమిటయ్యాడు విక్రమ్. దీంతో పాటు బాల సినిమా కూడా త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడట. ఈ సెన్సేషనల్ కాంబినేషన్ లో మళ్లీ సినిమా అనగానే తమిళ ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.