Begin typing your search above and press return to search.

విక్రమ్ సినిమాకి విముక్తి కలిగినట్టే!

By:  Tupaki Desk   |   7 March 2022 6:00 AM IST
విక్రమ్ సినిమాకి విముక్తి కలిగినట్టే!
X
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరుగా గౌతమ్ మీనన్ ఒకరుగా కనిపిస్తారు. ఆయన తయారు చేసుకునే కథలు .. పాత్రలను మలిచే పద్ధతి .. తెరపై వాటిని ఆవిష్కరించే విధానం ఇతర దర్శకుల శైలికి భిన్నంగా ఉంటుంది. అందువలన ఆయన సినిమాలకు అభిమానులు చాలామందే ఉంటారు.

ఆయన సినిమాలకు పనిచేయాలని ఇటు ఆర్టిస్టులు .. అటు టెక్నీషియన్లు ఉత్సాహాన్ని చూపుతుంటారు. ఇక కథపై కసరత్తు చేయడంలోను .. తాను అనుకున్న అవుట్ ఫుట్ ను రాబట్టే విషయంలోను ఆయన చండశాసనుడే అంటారు.

ఒక కథను ఎంచుకున్నప్పుడు తాను ఏదైతే అనుకున్నారో .. అది మాత్రమే తెరపై కనిపించేలా చేయడం కోసం ఆయన ఎన్ని మార్పులు చేయడానికైనా వెనుకాడరు. ఎంతకాలం వెయిట్ చేయడానికైనా సిద్ధపడతారు. అందుకు నిదర్శనంగా 'ధృవనక్షత్రం' సినిమా కనిపిస్తుంది.

చాలా కాలం క్రితమే గౌతమ్ మీనన్ 'ధృవ నక్షత్రం' సినిమాను సూర్య - దీపిక కాంబినేషన్లో చేయాలని అనుకున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టారు. ముందుగా ఇచ్చిన డేట్లు వాడుకోకపోవడం వలన దీపిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

దాంతో గౌతమ్ మీనన్ వెంటనే త్రిషను తీసుకుని ఆ పాత్రకి సెట్ చేశారు. అయితే సూర్య కూడా ఈ స్క్రిప్ట్ ఎంతకీ తేలకపోవడంతో చిరాకెత్తి ఆయన కూడా ప్రాజెక్టు నుంచి పక్కకి తప్పుకున్నాడు. దాంతో జయం రవితో లాగించేయాలని గౌతమ్ మీనన్ అనుకున్నాడుగానీ కుదరలేదు.
అప్పుడు ఆయన వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వలన సెట్ కాలేదు. ఈ నేపథ్యంలో తెరపైకి విక్రమ్ ను తీసుకుని రావలసి వచ్చింది. విక్రమ్ ఎప్పుడైతే సీన్లోకి వచ్చాడో అప్పుడే త్రిష ప్లేస్ లోకి అనూ ఇమ్మాన్యుయేల్ వచ్చింది.

పోనీ ఇప్పుడైనా ఈ సినిమా మొదలవుతుందా అని అంతా అనుకుంటున్న సమయంలో అనూ పోయి రీతూ వర్మ వచ్చి చేరింది. రెండవ కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారు. ముఖ్యమైన పాత్రలకు గాను పార్తీబన్ .. సిమ్రాన్ .. రాధిక ఎంపిక జరిగిపోయింది.

అలా మొత్తానికి భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం పూర్తయింది. ఇక ప్రేక్షకుల ముందుకు రావడమే తరువాయి అనుకున్నారు. అలా అనుకుని ఇప్పటికీ ఐదేళ్లు అయింది. కానీ ఇంతవరకూ ఈ సినిమా థియేటర్ల ముఖం చూడలేదు.

ఈ నేపథ్యంలోనే విక్రమ్ 'పొన్నియిన్ సెల్వన్' సినిమా చేయడం కూడా జరిగిపోయింది. ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానులతో ఎక్కువ గ్యాప్ రాకూడదనే ఉద్దేశంతో, 'ధ్రువ నక్షత్రం' డబ్బింగ్ ను పూర్తిచేసి వేసవిలో థియేటర్లకు వచ్చేలా చేస్తే బాగుంటుందని విక్రమ్ భావిస్తున్నాడట.

ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నాడని అంటున్నారు. కనుక ఇంతకాలం గుప్తనిధిలా ఉండిపోయిన ఈ సినిమా, ఈ సమ్మర్ కి రిలీజ్ కావడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఇంతమంది స్టార్ హీరోలను .. హీరోయిన్లను వ్రేళ్లమీద మార్చేసిన ఈ సినిమా, చివరికి ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.