Begin typing your search above and press return to search.

చనిపోయిన ఫ్రెండ్ వలనే కథ పుట్టింది

By:  Tupaki Desk   |   13 Sep 2017 7:11 AM GMT
చనిపోయిన ఫ్రెండ్ వలనే కథ పుట్టింది
X
టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే ఎన్నో కథలను అందించిన కె. విజయేంద్రప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన కలం బలాన్ని బాలీవుడ్ కి కూడా చూపించి తానేంటో నిరూపించుకున్నాడు. కొడుకుకు కూడా మంచి కథలను అందించి అతన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి ఎంతో కృషి చేశారని చెప్పవచ్చు. ఒక సినిమాను తెరకెక్కించాలంటే అందుకు కథ చాలా బలాన్ని ఇవ్వాలి. అది సాధ్యమైతేనే సినిమా ప్రేక్షకుల వరకు వెళుతుంది. ఆ ఫార్ములా కరెక్ట్ గా తెలిసిన విజయేంద్ర ప్రసాద్ చాలా రోజుల తర్వాత తాను రాసుకున్న కథను తానే తెరకెక్కించబోతున్నాడు.

ఆయన దర్శకత్వం వహించిన శ్రీవల్లి అనే సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ సినిమా ఈ నెల 15న రిలీజ్ కాబోతున్న సందర్బంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. మొదటి శ్రీవల్లి కథ ఎలా పుట్టింది అనే విషయం గురించి మాట్లాడుతూ.. ''నా ఫ్రెండ్ చనిపోయే కొన్ని రోజులకు ముందు అతన్ని కలవాలని అనుకున్నాను. అతను కూడా నన్ను కలవాలని అనుకున్నాడట. అయితే అతను చనిపోయాడని తెలుసుకున్న తర్వాత నేను వెళ్లి చూసినప్పుడు నేను ఏ రోజైతే కలవాలని అనుకున్నానో అదే రోజు నన్ను కలవాలని తాను కూడా అనుకున్నట్లు ఆ డైరీలో రాసుకున్నాడు. అప్పుడు నాకు అనిపించింది ఒక మనిషి మనసులో అనుకున్న ఆలోచన శబ్ద తరంగాలలాగ ఇంకొక మనిషికి చేరతాయా? అనే ఆలోచన నాకు కలిగింది. దీంతో ఒక చెడ్డ మనిషిని కూడా మనసుల ద్వారా చదివి మంచి మనిషిలాగ మార్చాలనే కథాంశంతో పునర్జన్మల ఆధారంగా చేసుకొని ఈ సినిమాను సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించాను'' అని చెప్పారు.

అలాగే సినిమా ఆలస్యం కావడానికి కారణాన్ని కూడా ఆయన చెప్పారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్లే ఈ సినిమా ఆలస్యం అయ్యిందని చెప్పారు. అలాగే ఇది తన మనస్సులోంచి పుట్టిన కథ గనుక తాను మాత్రమే ఈ కథను తెరకెక్కించడానికి కారణం అని కూడా చెప్పాడు. ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ... తప్పకుండా రాజామౌళి మహాభారతం సినిమాని తీస్తాడు. అతనికి యుద్దాలంటే చాలా ఇష్టమని కూడా చెప్పాడు.