Begin typing your search above and press return to search.

తమిళ హీరో టాలెంట్ బాలీవుడ్ కు పాకింది

By:  Tupaki Desk   |   5 April 2017 11:18 AM GMT
తమిళ హీరో టాలెంట్ బాలీవుడ్ కు పాకింది
X
తమిళంలో ధనుష్ తర్వాత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకున్నా కేవలం టాలెంట్ తో స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు విజయ్ సేతుపతి. కెరీర్ ఆరంభంలో విలన్.. క్యారెక్టర్ రోల్స్ చేసిన విజయ్ సేతుపతి.. ఆ తర్వాత ‘పిజ్జా’ లాంటి చిన్న సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. వరుసగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. అద్భుతంగా నటిస్తూ గత కొన్నేళ్లలో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయాడు సేతుపతి. ఇప్పుడు స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడతను. గత ఏడాది ఒక టైంలో అతను వరుసగా ఐదు హిట్లు కొట్టడం విశేషం. ఈ హీరో టాలెంట్ బాలీవుడ్ వాళ్లకు కూడా తెలిసింది. దర్శకుడిగా.. నిర్మాతగా హిందీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన అనురాగ్ కశ్యప్ కళ్లు.. సేతుపతిపై పడ్డాయి.

కశ్యప్ నిర్మాణంలో అతడి అసిస్టెంట్ వాసన్ బాల రూపొందించబోయే ఓ ప్రయోగాత్మక చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ చిత్రంలో ‘ప్రేమ పావురాలు’ ఫేమ్ భాగ్యశ్రీ తనయుడు అభిమన్యు ఓ కథానాయకుడిగా నటిస్తుండటం విశేషం. రాధిక మదన్ కథానాయికగా నటించే ఈ ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట. కశ్యప్ నిర్మాణంలో వచ్చే సినిమాలన్నీ చాలా కొత్తగా ఉంటాయి. అతడి అభిరుచి ఆ సినిమాల్లో కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలో నటిస్తే విజయ్ సేతుపతికి బాలీవుడ్లో మంచి గుర్తింపే వచ్చే అవకాశముంది. ఇంతకుముందు ధనుష్ రాన్ జానా.. షమితాబ్ లాంటి సినిమాలతో బాలీవుడ్లో చాలా మంచి పేరు సంపాదించాడు. మరి విజయ్ సేతుపతి కూడా అలాగే ఇంప్రెస్ చేస్తాడేమో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/