Begin typing your search above and press return to search.

విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తానంటున్న విజయ్ దేవరకొండ..!

By:  Tupaki Desk   |   29 Aug 2022 6:59 AM GMT
విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తానంటున్న విజయ్ దేవరకొండ..!
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం.. తెలుగులో దారుణమైన వసూళ్లను రాబడుతూ భారీ డిజాస్టర్ గా మారింది. అయితే వీడీ మాత్రం ఎప్పటిలాగే సినిమా రిజల్ట్ ని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడని అర్థమవుతోంది.

'లైగర్' రిలీజ్ కు ముందు తెగ హడావుడి చేసిన VD.. విడుదల తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. అయితే ఆదివారం దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో మెరిసి అభిమానులను ఉత్సాహపరిచాడు.

ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా నిన్న చిరకాల ప్రత్యర్థులు భారత్ vs పాకిస్థాన్ లు తలపడిన సంగతి తెలిసిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన టీ-20 మ్యాచ్ ను విజయ్ దేవరకొండ ఆసక్తికరంగా తిలకించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇండియా వెర్సెస్ పాక్ మ్యాచ్ కు ముందు విజయ్ దేవరకొండ పలువురు ఇండియన్ క్రికెటర్లను కలిశాడని తెలుస్తోంది. 'కోబ్రా' సినిమాతో తెరంగేట్రం చేస్తున్న భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

మ్యాచ్ సందర్భంగా స్పోర్ట్స్ టీమ్ తో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఈ నేపథ్యంలో 'లైగర్' సినిమాలోని 'వి ఆర్ ఇండియన్స్' అనే డైలాగ్ ను లైవ్ లో వినిపించారు. అలానే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను వీడీ పంచుకున్నారు.

ఈ సందర్భంగా 'ఏ క్రికెటర్ బయోపిక్ చేయడానికి మీరు ఆసక్తి చూపుతారు?' అని కామెంటేటర్ ప్రశ్నించగా.. ''ధోని భాయ్ బయోపిక్ ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చేసేశాడు కాబట్టి, విరాట్ కోహ్లీ అన్న బయోపిక్ చేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను'' అని విజయ్ దేవరకొండ బదులిచ్చారు.

మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా 'లైగర్' సినిమాని రూపొందించారు. ఇందులో ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్ గా కనిపించడానికి VD తీవ్రంగా కష్టపడ్డాడు. ఒకవేళ నిజంగా విజయ్ కు విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే.. ఒక క్రికెటర్ గా రూపాంతరం చెందడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

నిజానికి ఇప్పటికే 'నువ్విలా' సినిమాలో విజయ్ దేవరకొండ ఒక క్రికెటర్ గా కనిపించి మెప్పించాడు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తాడేమో చూడాలి.

ఇకపోతే విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఇందులో సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా చేస్తోంది. అలానే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (JGM) అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు VD. ఈ రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకొని మళ్లీ ట్రాక్ లోకి వస్తాడని రౌడీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.