Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : పులి

By:  Tupaki Desk   |   3 Oct 2015 7:20 AM GMT
మూవీ రివ్యూ : పులి
X
చిత్రంః పులి
తారాగణంః విజయ్-శ్రుతీహాసన్-హన్సిక-శ్రీదేవి-సుదీప్-ప్రభు-ఆలీ తదితరులు
సంగీతంః దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రాఫర్ః నటరజాన్ సుబ్రమణ్యం
ఎడిటర్ః శ్రీకర్ ప్రసాద్.ఎ
నిర్మాతలుః శిబు తమీన్స్- పి.టి.సెల్వకుమార్- ఎస్వీఆర్ మీడియా
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వంః శింబుదేవన్

ఎన్నో వివాదాల తరవాత పులి సినిమా తెలుగు - తమిళ భాషల్లో రిలీజ్ అయింది. తలైవా సినిమా నుంచి విజయ్ తమిళనాడు ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దానికి కారణం.. అతని సినిమాల్లో పొలిటికల్ యాంగిల్ లో డైలాగులు ఉండటమే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. తలైవా తరువాత విడుదలైన జిల్లా చిత్రానికి ఎలాంటి అవాంతరాలు ఎదురు కాలేదు. కారణం.. అందులో ఎలాంటి పొలిటికల్ యాంగిల్ లేదు. దాంతో ఆ సినిమా విడుదల సజావుగానే సాగింది. ఆ తరువాత విడుదలైన కత్తి గానీ, ఇటీవల విడుదలైన పులి సినిమా విడుదల విషయంలో గానీ.. అవాంతరాలు ఎదురయ్యాయి అంటే... ఈ సినిమాల్లో ఏదో కొంత పొలిటికల్ యాంగిల్ వుందనే అర్థం చేసుకోవచ్చు. అన్ని హార్డిల్స్ ని దాటుకుని విడుదలైన విజయ్ 'పులి' ఏమాత్రం గాండ్రించిందో చూద్దామా!

కథః

దక్షిణ భారతదేశంలో బేతాళ కోటను కేంద్రంగా చేసుకుని పారిపాలిస్తున్న భేతాళ వంశస్తులు 56 రాజ్యాలను తమ ఆధీనంలో వుంచుకుని పరిపాలిస్తుంటారు. కొంత కాలం ఉత్తరాన వున్న కింకిణీ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని.. ఆ తరువాత దక్షిణాన వున్న బేతాళ కోటను కేంద్రంగా తమ ఆధీనంలో వున్న రాజ్యాలను పరిపాలిస్తూ... నిర్దాక్షిణ్యంగా కప్పం వసూలు చేస్తుంటారు. ఈ యాభై ఆరు రాజ్యాలలో ఒకటి భైరవ కోన. అక్కడి ప్రజలు కరువుతో పంటలు పండక.. ఉపాధిలేక ఇబ్బంది పడుతుంటారు. అయినా... రాజుకు వారు కప్పం కట్టాల్సిందేనని బేతాళులు వేధిస్తుంటారు. యవ్వన రాణి(శ్రీదేవి) ఆధీనంలో పరిపాలించబడుతున్న ఈ భైరవకోనలోనే మనోహరుడు(విజయ్) పెరిగి పెద్ద వాడవుతాడు. అదే కోనలో పెరిగిన మందార మహాలక్ష్మీ(శ్రుతీహాసన్)తో ప్రేమలో పడతాడు. అయితే నిత్య యవ్వనంతో.. మరణం అనేదే లేకుండా వుండాలంటే ఓ యజ్జం చేయాలని స్వామీజీ చెప్పడంతో.. ఆమె యవ్వనకాంక్షతో యజ్ఞం చేస్తూ వుంటుంది. పౌర్ణమి రోజు జన్మించిన 18 మంది యువతులను బలిస్తే.. ఆమెకు నిత్య యవ్వన శక్తి వస్తుందనేది ఓ స్వామిజీ చెప్పడంతో.. పౌర్ణమి రోజే జన్మించిన మందార మహాలక్ష్మీని బేతాళులు ఎత్తుకుపోతారు. అది తెలిసిన మనోహరుడు ఎలాగైనా బేతాళకోట కెళ్లి మందార మహాలక్ష్మీని విడిపించుకు తీసుకురావాలని వెళతాడు. మరి మనోహరుడు తన ప్రేయసిని రక్షించుకున్నాడా? అసలు మనోహరుడు ఎవరు? అతను భైరవకోనకు ఎలా వచ్చాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

కథనం-విశ్లేషణః

పులి అనేది ఓ సోషియే ఫాంటసీ చిత్రం. ఈ మధ్య కాలంలో తెలుగులో ఎలాగైతే బాహుబలి అనే సినిమా తెరకెక్కిందో... ఇంచు మించు అలాంటి సినిమానే. అయితే ఇందులో భారీ దనంతో కూడిన యుద్ధాలైతే లేవు. కేవలం కత్తి ఫైటింగులు మాత్రం ఉన్నాయి. ఈ తరహా చిత్రం మనం పూర్వాశ్రమంలో చాలానే చూశాం. ఈ జనరేషన్ లోనైతే బాలకృష్ణ నటించిన భైరవద్వీపం అని చెప్పొచ్చు. ఇలాంటి సోషియో ఫాంటసీ చిత్రాలను ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కిస్తే.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు కథలో లీనమై పోవాలి. అప్పుడే అలాంటి కథలు కనెక్ట్ అవుతాయి. లేకుంటే పులి లాగా బోర్ కొట్టించి.. ఎప్పుడెప్పుడు థియేటర్ నుంచి బయట పడదామా అనేంత విసిగిస్తాయి. పులి చాలా సింపుల్ స్టోరీ. బేతాళ కోటను కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తున్న శ్రీదేవి తను నిత్యం యవ్వనవతిగా వుండటానికి పౌర్ణమి రోజు జన్మించిన ఓ పద్దెనిమిది మంది యువతులను బలివ్వడానికి సిద్ధమైతే.. అందులో శ్రుతీహాసన్ ఒకరు. ఆమెను రక్షించుకోవడం కోసం హీరో చేసే సాహసాలే మిగతా కథ. ఇలాంటి కథను మనం ఓ ఇరవైఏళ్ళ క్రితం వచ్చిన 'భైరవద్వీపం' సినిమాలోనే చూశాం. అందులో కూడా మాంత్రికుడు తనకు మరణం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో యువతులను బలిస్తూ వుంటాడు. అందులో భాగంగానే రోజాను బలివ్వడానికి తీసుకెళితే.. అతని చెర నుంచి రోజాను హీరో కాపాడుతాడు. ఆ సినిమాలో కూడా బాలకృష్ణ ఎక్కడి నుంచో నదిలో కొట్టుకొచ్చి... ఆ గూడెం ప్రజలకు దొరకడం.. అక్కడే పెగిరి పెద్ద కావడం మనం చూశాం. ఇందులో కూడా విజయ్ నదిలో కొట్టుకొచ్చి.. భైరవకోనలో పెద్దమనిషిగా వుండే ప్రభుకి దొరుకుతాడు. దాంతో అతన్ని అక్కడే పెంచి పెద్ద చేస్తారు. వీళ్లు ఇలా నదిలో కొట్టుకొని రావడానికి కారణాలను ఫ్లాష్ బ్యాక్ లో చూపించడం.. వారి అసలు నేపథ్యం రివీల్ చేయడం సర్వసాధారణం. భైరవద్వీపంలో ఎలాగైతే యాక్షిణీలో లోకం వుంటుందో.. ఇందులో కూడా యక్షిణీ పర్వత ప్రాంతం వుంటుంది. ఆ సినిమాలో ఎలాగైతే మరగుజ్జు కమెడీయన్స్ వుంటారో... ఇందులో కూడా ఆలీ, విద్యుల్లతలాంటి వాళ్లను మరగుజ్జు వారిలా చూపించారు. అందులో వారు ఎలా అయితే హీరోకి హెల్ప్ చేస్తారో.. ఇందులోనూ హీరో బేతాళకోటకు వెళ్లడానికి సహాయపడతారు. ఇలాంటి సిమిలారిటీస్ సినిమాలో చాలానే వున్నాయి. నిజానికి ఇలాంటి సిమిలర్ స్టోరీలు మన తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయమే. అయితే వీటిని డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కిస్తే తప్పకుండా ఆదరిస్తారు. అయితే దర్శకుడు శింబుదేవన్ అలాంటి మ్యాజిక్ లేమీ చేయలేదు. దాంతో ఈ సినిమా చాలా పేలవంగా తెరమీద కనిపిస్తుంది.

ఈ చిత్రానికి దర్శకుడు శింబుదేవన్ కథ అందించాడు. స్క్రీన్ ప్లే కూడా అతనిదే. కథలో ఎలాంటి బలం లేదని తెలిసి కూడా.. కథనం నడిపించడంలో ఫెయిలవ్వడం నిజంగా దర్శకుడి పొరపాటే. విజయ్ లాంటి మాస్ హీరోతో విన్యాసాలు చేయించేటప్పుడు ఆడియన్స్ కుర్చీలోంచి కదలనీయకూడదు. అలాంటివేమీ ఇందులో చేయలేదు. మరీ వెటకారంగా వున్నాయి యాక్షన్ సీన్స్. అసలు హీరో ఇంట్రడక్షనే తేలిపోయింది. బేతాళులు వచ్చి గ్రామస్తులను హింసిస్తుంటే.. వారి కాళ్లను పట్టుకుని బతిమాలడం విజయ్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. పైగా ఆ సన్నివేశం కవరింగ్ కోసం... ఎక్కడ కాళ్లు పట్టుకోవాలో.. ఎక్కడ పోరాడాలో తెలుసుకుని ప్రవర్తించడమే తెలివైనోడి లక్షణం అని కన్వెన్స్ చేయడానికి ట్రై చేయడం అంత కనెక్ట్ కాదు. ఎందుకంటే... హీరో ఇంట్రడక్షన్ సీన్.. ప్రేక్షకుల్ని కథలోనికి ఆలా తీసుకెళ్లిపోతుంది. అలాంటి సీనే మరీ పేలవంగా వుంటే దానికి ఆడియన్స్ ఎలా కనెక్టవుతారు. పైగా మొదటి హాఫ్ లో వచ్చే కామెడీ సీన్లు.. అసలు బాగలేవు. కేవలం సినిమాను ముందుకు నడిపించడానికే ఆ సీన్లను ఇరికించినట్టు కనిపిస్తుంది. మొదటి హాఫ్ మొత్తం చాలా నీరసంగా సినిమా ముందుకు సాగిపోతూ వుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో సీజీతో క్రియేట్ చేసిన అడవి చిరుతతో పెట్టిన ఫైటింగ్.. మరీ కృతకంగా వుంది. దాని బదులు ఏ అడవిజాతి మనుషులతోనో యాక్షన్ సీన్స్ పెట్టినా బాగుండేది.

తొలి అర్ధభాగం ఏదోలా మమ అనిపించిన దర్శకుడు ద్వితీయార్థంపై కొంత పట్టు సాధించడానికి ప్రయత్నించాడు. ప్రేక్షకుల్ని సీట్ లో కూర్చోబెట్టేందుకు ట్రై చేశాడనే చెప్పొచ్చు. శ్రుతీహాసన్ ను రక్షించుకోవడం కోసం... బేతాళ కోటలోకి హీరోను ప్రవేశపెట్టి.. అక్కడ నుంచి హీరో - హీరోయిన్ ఎలా బయటపడతాడో అని ఆడియన్స్ అనుకునేలా కొంత టెన్షనే క్రియేట్ చేశాడు. అయితే హీరో బలవంతుడు అనేందుకు ఏదో వన మూలికల రసం తాగితే ఓ ఎనిమిది నిమిషాలపాటు స్పైడర్ మ్యాన్ లో విన్యాసాలు చేసి.. దాంతో హీరోయిన్ ను చాలా ఈజీగా రక్షిస్తాడులే అనే నమ్మకాన్ని కలిగేలా చేశాడు కానీ.. ఆ ఫార్ములాను ఎక్కడా ఉపయోగించుకోలేదు. ఏ వనమూలికల రసాన్నైతే నమ్ముకుని వెళ్లాడో దాన్ని భైరవకోటలో చివరిదాకా ఉపయోగించుకోకపోవడం వల్ల దాని ప్రాధాన్యత ఏంటో అర్థం కాదు. మొదట కోటలోకి ప్రవేశించగానే.. మహాబలుడు అడ్డగించడానికి వస్తే.. అతన్ని అరచేయి అడ్డం పెట్టి అలా ఆపేస్తాడు. అలా ఎందుకు జరిగిందని మహారాణి ఆలోచిస్తుండగానే.. ఆడియన్స్ అంతా వనమూలికల రసం మహత్యమే అనుకుంటారు. కానీ ఆ తరువాత... వన మూలికల రసం కాదు.. అడవి నుంచి తీసుకొచ్చి మూతలో వున్ననీటిని తాగావు.. దాంతో ఆ మహాబలుడు నిన్ను చూసి ఆగిపోయాడని తన వెంట వచ్చిన మరగుజ్జు వాళ్లతో చెప్పించాడు. అంటే ఆ ఆడిలో వున్న నీటికి వున్న మహత్యమేదో తరువాత కూడా రివీల్ చేయలేదు. దాన్ని అలానే వదిలేశాడు. ఆ తరువాత అయినా ముందుగా చెప్పినట్లు తన వెంట తెచ్చుకున్న వనమూలికల రసం ప్రభావమేంటో చూపిస్తాడా అంటే.. అదీ లేదు. తీరా ఏదో బేతాళ పరీక్షా సమయంలో తాను తాగాల్సిన వనమూలికల రసం వున్న సీసాను పక్షి ద్వారా పొందితే.. అది కాస్త బేతాళుడు(సుదీప్) తీసుకుని విసిరి పారేస్తాడు. ఇలా దానికి ఎలాంటి ప్రయారిటీ లేకుండా కేవలం సినిమాను ముందుకు నడిపించడానికి.. ప్రేక్షకుల్లో టెన్షన్ క్రియేట్ చేసేందుకు ఉపయోగించుకున్నాడు. ఎదో క్లైమాక్స్ లో దాని అవసరం పడింది. బలవంతురాలైన పాత్రలో శ్రీదేవి యాక్షన్ సీన్స్ బాగానే చేసింది. యాభైలో కూడా ఇలాంటి విన్యాసాలను ఆమెతో దర్శకుడు బాగానే చేయించాడు. అయితే ఆమెకు వేసిన ఓవర్ మేకప్ ఆడియన్స్ కళ్లల్లో నీళ్లు తెప్పిస్తాయి. అంతలా వుంది శ్రీదేవికి వేసిన మేకప్. మహారాణిపై కన్నేసిన బేతాళుడు(సుదీప్) క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో పులి దేవుడుని(విజయ్ ద్విపాత్రాభినయం) చంపేటప్పుడు ఎలా వుంటాడో... ఆ తరువాత పులి దేవుడి కుమారుడు మనోహరుడు పెరిగి పెద్దవాడైన తరువాత కూడా అలాగే వుంటాడు. సుదీప్ లో ఏమాత్రం వేరియేషన్ చూపించలేదు. కేవలం జుట్టు మాత్రమే పెంచేసి అలా చూపించేశాడు. ఇందులో శ్రీదేవి తమ్ముడిగా పులిదేవుని క్యారెక్టర్ లో విజయ్ ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తాడు. అలాంటి పులిదేవుడు విషం తాగి చనిపోతే.. కనీసం అతడు ఏమయ్యాడని కూడా మహరాణిగా వున్న శ్రీదేవి విచారించకపోవడం.. అతని భార్య ఏమైంది, అతనికి పుట్టిన బిడ్డ ఏమయ్యాడనేది తెలుసుకోకపోవడం లాంటి వాటికి క్లారిటీ ఇవ్వకపోవడం దర్శకత్వం లోపం. శ్రీదేవి కూతురుగా మందాకిణి పాత్రలో హన్సికను ద్వితీయార్థంలో ప్రవేశపెట్టి.. సెకెండాఫ్ లో హీరోయిన్ కొరత లేకుండా చేశాడే గానీ.. ఆమె పాత్రకు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. ఇలా చెబుతూ పోతే సినిమాలో చాలా లోపాలే వున్నాయి. అయితే ఇందులో పొలిటికల్ యాంగిల్ లో కొన్ని డైలాగులున్నాయి. అవి కొంత ప్రభుత్వానికి చురకలు అంటించేలానే ఉన్నాయి. వాటిని ఎందుకు అలా రాయించారంటే.. ఈ మధ్య విజయ్ పొలిటికల్ యాంగిల్ తన సినిమాల్లో వుండాలనే చూస్తున్నాడనేదానికే అని చెప్పొచ్చు. ప్రజలకు ఏది కావాలో.. దాన్ని ఇవ్వడమే పాలకుల కర్తవ్యం. దాన్ని నేను ఇవ్వడానికి ట్రై చేస్తా నంటూ.. బైరవ కోట రాజుగా నియమించబడినప్పుడు చెప్పడం వెనుక పొలిటికల్ యాంగిల్ వుందనేది అర్థం అవుతుంది. అంతే కాదు.. శ్రీదేవి క్యారెక్టర్ కూడా ముఖ్యమంత్రి జయలలితను పోలి వుంటుందనే భావించొచ్చు. ఎప్పడు చార్మింగ్ గా కనిపించే జయలలితను దృష్టిలో ఉంచుకునే శ్రీదేవి క్యారెక్టర్ ను డిజైన్ చేశారని అనుకోవచ్చు. బహుశా ఇలాంటి కోణాలను పసిగట్టిన అమ్మ.. ఆ చిత్రం చిత్రం విడుదలకు ముందు రోజు.. ఈ సినిమా యూనిట్ కు ఐటీ రూపంలో చుక్కలు చూపించిందనే వాదనా వుంది.

నటీ నటులుః

సోషియో ఫాంటసీ సినిమాలకు విజయ్ సూటవ్వడని ఈ చిత్రం రుజువు చేసింది. అలాంటి సినిమాలకు బాడీలాంగ్వేజ్ చాలా అవసరం. అలాంటిది విజయ్ లో ఏమాత్రం కనిపించదు. కేవలం సైలెంట్ చూపులతోనే కానిచ్చేద్దాం అనుకుంటే ప్రేక్షకులు కనెక్ట్ కావడం కష్టం. మొదటి హాఫ్ లో అతని క్యారెక్టర్ సోసోగా వున్నా.. సెకెండాఫ్ లో బాగానే చేశాడు. శ్రుతీహాసన్ ను వెతుక్కుంటూ బేతాళ కోటలోకి కింకిణీ దేశం నుంచి వచ్చిన వైద్యుని పాత్రలో కొంత కామెడీ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పులి దేవుడి పాత్ర.. ఎన్టీఆర్ శక్తి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ కనిపించే గెటప్ లా వుంటుంది. శ్రీదేవి దాదాపు ఇరవై ఏళ్ల తరువాత సౌత్ ఇండియన్ మూవీలో నటించింది. ఆమె పాత్రకు సొంతంగానే డబ్బింగు చెప్పుకుంది. మొదటి హాఫ్ లో ఆమెను పరిచయం చేయకుండా సెకెండాఫ్ లో పరిచయం చేయడంలో ఉన్న మతలబ్ ఏంటో దర్శకుడికే తెలియాలి. ఆమెకు ఇచ్చిన నెగిటివ్ రోల్ క్యారెక్టర్ బాగానే చేసింది కానీ... ఇంకాస్తా తీర్చిదిద్ది వుంటే బాగుండేది. అయితే ఆమె ఓవర్ మేకప్ మాత్రం ఆమె నటనను డామినేట్ చేసిందనే చెప్పొచ్చు. మేకప్ సాధారణంగా వుండే సమయంలో శ్రీదేవి అతిలోక సుందరిలా కనిపించింది. ఆమె తరువాత చెప్పుకోవాల్సిన క్యారెక్టర్లు ఏమైనా వుంటే.. ఇక సుదీప్. బేతాళునిగా నెగిటివ్ రోల్ బాగానే చేశాడు. అయితే అతనితో పోరాట సన్నివేశాలను ఇంకాస్త బాగా తెరకెక్కించాల్సింది. హీరోయిన్లుగా నటించిన శ్రుతీహాసన్ - హన్సికలు పాటలకే పరిమితం అయ్యారు. గ్లామర్ ను ఒలికించడానికే వారిని తీసుకున్నట్టు కనిపిస్తుంది. మరగుజ్జు మహారాజుగా ఆలీ - అతని కూతురు జంబగా విద్యుల్లత నటించారు. వారు చేసిన కామెడీ కొంతవరకు బెటర్. అయితే ఓ గ్రాఫిక్ కప్పను పెట్టి దాన్ని ప్రతిసారి నాలుకతో నాకించడానికి ట్రై చేసిన కామెడీ వెగటు పుట్టిస్తుంది. అలాగే తాబేలుతో ఉమ్మేయించడం కూడా అసహ్యం అనిపిస్తుంది. ఇలాంటి వాటిని లేకుండా చూసుకుని వుంటే బాగుండేది.

సాంకేతిక నిపుణులుః

ఈ సినిమాలో దర్శకత్వలోపాలు చాలానే వున్నాయి. ఎలాంటి హోం వర్క్ చేయకుండా సినిమాను తెరకెక్కించడానికి దర్శకుడు శింబుదేవన్ ట్రై చేశాడు. దర్శకత్వం విలువల కంటే.. సీజీ వర్క్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. సీజీ వర్క్ చాలా బాగుంది. కుర్మరాజుగ తాబేలును బాగా చూపించారు. తాబేలు గ్రాఫిక్ చాలా రిచ్ గా వుంది. అలాగే బేతాళకోటను సీజీలో బాగా చూపించారు. అయితే మహాబలుడి రూపంలో చూపించిన ఓ పెద్ద మనిషి ఆకారం మాత్రం సీజీ వర్క్ బాగానే వున్నా.. చూడటానికి అతను మహాబులిడిలా కనిపించడు. ఏదో యానిమేషన్ బొమ్మాలా కనిపిస్తాడు. అలాగే ఇంటర్వెల్ కి ముందు హన్సికపై దాడికి దిగే నల్ల చిరుత గ్రాఫిక్ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా వుంది. నల్ల చిరుతలను మనం ఇంతకు ముందెప్పుడూ చూసుండం. అలాంటిదాన్ని పెట్టి ప్రేక్షకులను ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకున్నాడో ఏమో. ద్వితీయార్థం మొత్తం సీజీ వర్క్ తోనే సినిమాను నడిపించాడు. ఈ సినిమాకు భారీగా ఖర్చు ఎందుకు చేశారో దాన్ని బట్టే అర్థం అవుతుంది. ఇందులో సినిమాటోగ్రాఫర్ కృషి కూడా వుంది. లొకేషన్స్ ను బాగా చూపించాడు. సినిమా సెకెండాఫ్ చాలా రిచ్ గా వుంది. సినిమా నిడివి చాలా వుంది. దాదాపు 154 నిమిషాల వున్న ఈ నిడికి.. ఓ అరగంట కోత వేయొచ్చు. ఎడిటింగ్ చాలా పూర్. మరింత గ్రిప్పింగ్ ఉండాల్సింది. దేవిశ్రీ అందించిన సంగీతం అస్సలు బాగోలేదు. ఓ రెండు పాటలు మాత్రం బాగున్నాయి. సెకెండాఫ్ లో ఆర్.ఆర్.బాగుంది. ఆర్ట్ వర్క్ బాగుంది. లొకేషన్స్ ఎంపికలో గానీ.. భైరవకోన డిజైనింగ్, బేతాళకోట డిజైనింగ్ లో జాగ్రత్తలు బాగా తీసుకున్నాడు కళాదర్శకుడు.

చివరగా... అనుకున్నంత ఏమీ పులి గాండ్రించదు!

రేటింగ్ః 2​/5

#Puli, #pulimovie, #VijayPUlimovie, #Vijay, #Vijaypulireview, #pulireview, #PuliReviewintelugu, #pulirating, #Puli Talk

Disclaimer : This Review is an Opinion of Review Writer. Please Do not Judge the Movie based on This Review and Watch Movie in Theatre