Begin typing your search above and press return to search.

గోరంత విషయానికి కొండంత ప్రచారమా దేవరకొండా?

By:  Tupaki Desk   |   20 April 2020 3:40 PM IST
గోరంత విషయానికి కొండంత ప్రచారమా దేవరకొండా?
X
అప్పట్లో పెద్ద విషయానికి ప్రచారం చిన్నగా ఉండేది. ఇప్పుడు కాలం మారిపోయింది.. చిన్న విషయానికి కూడా ప్రచారం భీభత్సంగా ఉంటుంది. ఏమీ లేని దానికి కూడా టముకు వేసుకోవడం ఒక హాబీగా మారిపోయింది. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా సిల్లీ విషయాలకు ప్రచారం చేసుకుంటూ ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వారి అభిమానులకు సంతోషం కలిగిస్తుందేమోగానీ సాధారణ ప్రేక్షకుల దృష్టిలో చులకన అవుతారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్య నెట్ ఫ్లిక్స్ లో 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ కి భారీ ఆదరణ దక్కింది అన్నట్టుగా విజయ్ దేవరకొండ టీం ప్రచారం ప్రారంభించింది. మనం ఇందాక చెప్పుకున్నట్టు గానే జరిగింది గోరంత అయితే ప్రచారం కొండంత అన్నట్టుగా ఉంది.

విజయ్ దేవరకొండ లాస్ట్ సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' ప్రస్తుతం నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉందని రౌడీగారి టీం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేపట్టింది. దీనికి రుజువు అన్నట్టుగా ఏదో ఒక స్క్రీన్ షాట్ జతచేసి మరీ ప్రచారం కొనసాగించారు. అయితే ఇక్కడ రౌడీగారి టీం గమనించాల్సిన విషయం ఏంటంటే 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా హైదరాబాద్ లెవెల్లో మాత్రమే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఓటిటీ ప్లాట్ ఫామ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో కాదు. అంటే ఈ సినిమాను చాలా తక్కువ మంది ప్రేక్షకులు ఆదరిస్తున్నారని విజయ్ దేవరకొండ టీం పరోక్షంగా ఒప్పుకున్నట్టే లెక్క.

సినిమా నిజంగా ట్రెండింగ్ లో ఉంటే.. నెంబర్ వన్ పొజిషన్ లో గనుక నిలిస్తే దాన్ని ప్రచారం చేసుకోవడంలో అభ్యంతరం ఏమీ ఉండదు. కానీ జస్ట్ హైదరాబాద్ లెవల్లో మాత్రమే.. అది ఒకరోజు నెంబర్ వన్ పొజిషన్ లో నిలిచిన సినిమాను ఇలా ప్రచారం చేయాలనుకోవడం తో విమర్శలు మొదలయ్యాయి. ఈ సినిమాకు దాదాపు 29 కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయని ట్రేడ్ వర్గాల సమాచారం ఉంది. అందుకే ఈ సినిమాను కొనుక్కున్న వారు కూడా ఇలాంటి ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది నిజంగానే అత్యుత్సాహం అని.. ఉన్న కాస్త బ్రాండ్ వేల్యూ ని విజయ్ తక్కువ చేసుకుంటున్నాడని.. ఇలాంటి అనవసర ప్రచారాలు మానేయాలని కొంత మంది విజయ్ దేవరకొండ కు సలహాలు ఇస్తున్నారు.