Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: అర్జున్ రెడ్డి భలే ఉన్నాడు

By:  Tupaki Desk   |   14 Feb 2017 6:17 AM GMT
టీజర్ టాక్: అర్జున్ రెడ్డి భలే ఉన్నాడు
X
‘పెళ్లిచూపులు’ సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. అతడి ఫ్యూచర్ ప్రాజెక్టులన్నింటి మీదా జనాల్లో మంచి ఆసక్తి ఉంది. ‘పెళ్లిచూపులు’ సెట్స్ మీద ఉండగానే విజయ్ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ అనే సినిమా మొదలైంది. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ కొంచెం కొత్తగా అనిపించింది జనాలకు. ఇప్పుడు ప్రేమికుల దినోత్సవ కానుకగా విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ టీజర్ సినిమా మీద అంచనాల్ని పెంచేలా ఉంది.

ఒక క్లాస్ రూంలో లెక్చరర్ స్టూడెంట్స్ ను ఉద్దేశించి అర్జున్ రెడ్డి పరిచయం మొదలుపెడతాడు. అతను టాపర్ ఆఫ్ ద కాలేజ్ అని.. టాపర్ ఆఫ్ ద యూనివర్శిటీ అని.. టాపర్ ఆఫ్ ద బోర్డ్ అని ఇంట్రడక్షన్ ఇస్తుంటాడు. మరోవైపు హీరో శృంగార కార్యకలాపాలు నెరుపుతూ.. మందు కొడుతూ.. డ్రగ్స్ తీసుకుంటూ కనిపిస్తాడు. హీరో అకడమిక్ బ్యాగ్రౌండ్ ఎంత గొప్పగా ఉన్నప్పటికీ యాంగర్ మేనేజ్మెంట్లో జీరో అన్నమాట. మరి ఆ కోపం అతడికి ఎలా శత్రువుగా మారింది. దాని వల్ల అతడి జీవితం ఎలా మలుపు తిరిగింది అన్నది ఈ చిత్ర కథ.

టీజర్ చివర్లో చూపించిన ఘాటు ముద్దు సినిమా ఎంత బోల్డ్ గా ఉంటుందో కూడా చెప్పకనే చెబుతోంది. టీజర్ రిఫ్రెషింగ్ గా.. వైవిధ్యంగా కనిపిస్తోంది. చూస్తుంటే విజయ్ మరో హిట్టు కొట్టేలాగే కనిపిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించాడు. విజయ్ సరసన షాలిని ఇందులో కథానాయికగా నటిస్తోంది. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందట.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/