Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లకు హీరోయిన్ని బయటకి తెచ్చారు

By:  Tupaki Desk   |   24 Oct 2018 10:44 AM GMT
ఇన్నాళ్లకు హీరోయిన్ని బయటకి తెచ్చారు
X
‘అర్జున్ రెడ్డి’.. ‘గీత గోవిందం’ సినిమాలతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు ‘నోటా’తో గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఇటు తెలుగులో.. అటు తమిళంలో ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఐతే ‘గీత గోవిందం’ తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే ‘నోటా’ను దించేసిన విజయ్.. దీని తర్వాత తక్కువ గ్యాప్ లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అతడి కొత్త సినిమా ‘ట్యాక్సీవాలా’ నవంబరు 16న విడుదలకు సిద్ధమవుతోంది. కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి అసలు చర్చే లేదు ఎక్కడా. ఐతే రిలీజ్ డేట్ ఇచ్చాక.. ప్రచార హడావుడి మొదలుపెట్టారు. ఈ చిత్రం నుంచి ‘మాటే వినదుగా..’ అనే పాటను శుక్రవారం విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండతో పాటుగా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఉన్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.

ఈ సినిమా మొదలైనప్పటి నుంచి హీరోయిన్ని ఇప్పటిదాకా చూపించనే లేదు. తొలిసారిగా ఆమెను జనాల ముందుకు తెచ్చింది ఇప్పుడే. ఏ పోస్టర్లో కానీ.. మరే ప్రోమోలో కానీ.. కథానాయిక కనిపించకపోవడంతో అసలు ఇందులో హీరోయిన్ ఉందా అన్న సందేహాలు కూడా జనాలకు కలిగాయి. కేవలం విజయ్ దేవరకొండను ముందు పెట్టి ప్రచారం చేశారు ఇంతకుముందు. ఐతే ఇప్పుడు ఎట్టకేలకు కథానాయికకు ప్రచారంలో భాగం కల్పించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం సమకూర్చాడు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ ను ఎస్కేఎన్ నిర్మించాడు. గీతా ఆర్ట్స్-యువి క్రియేషన్స్ సంస్థలకూ ఇందులో భాగస్వామ్యం ఉంది. మే 18నే రావాల్సిన ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జాప్యం వల్ల ఆలస్యమై.. ఇంత లేటుగా రిలీజవుతోంది.