Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ ఆవేదన..ఇలా చేస్తారా.?

By:  Tupaki Desk   |   13 Aug 2018 5:02 AM GMT
విజయ్ దేవరకొండ ఆవేదన..ఇలా చేస్తారా.?
X
అర్జున్ రెడ్డితో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘గీతాగోవిందం’. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతోంది. మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో తాజాగా ఆదివారం విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఎప్పుడూ నవ్వుతూ, తుల్లుతూ ఉండే విజయ్ దేవరకొండ అప్ సెట్ గా కనిపించాడు. కారణం పైరసీ.. గీతాగోవిందం సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడిందనే వార్తలు విజయ్ ని కలిచివేశాయి. అందుకే మైక్ అందుకోగానే దీనిమీదే చాలా సేపు మాట్లాడారు.

అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో ‘గీతాగోవిందం’ తెరకెక్కింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ ప్రసంగం అందరినీ ఎమోషన్ కు గురిచేసింది. రెండు మూడు రోజులుగా తన మూడ్ బాగాలేదని విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘అరవింద్ గారు - వాసు గారు - మాటీం అంతా ఎంత కష్టపడి సినిమా తీశామో మాకు తెలుసు.. వారంతా ఇప్పుడు నవ్వుతూ కనిపిస్తున్నా.. పైరసీ వల్ల వారు లోపల ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు’ అంటూ విజయ్ చెప్పుకొచ్చారు.

‘తామంతా నటులమని.. యాక్టింగ్ మాత్రమే చేస్తామని.. తమతో వేరే పనులు చేయించవద్దని’ విజయ్ విజ్ఞప్తి చేశాడు. నా సినిమా విడుదల కాకముందే లీక్ అయ్యిందంటూ లింకులు పంపి తమను డిస్ట్రబ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సభ - అభిమానుల సందడి చూస్తుంటే మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చిందని.. ఎవరో చేసిన తప్పుకు మేము ఎందుకు ఫీలవ్వాలని విజయ్ అన్నారు. సినిమాల్లోకి రావడానికి ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించామని.. జీవితం అంతా పోరాడుతూనే ఉన్నామని.. ఈ పైరసీ మీద కూడా పోరాడుతామని విజయ్ స్పష్టం చేశారు. పబ్లిసిటీ కోసం పైరసీ లీకులు చేస్తామని కొందరు అంటుండడం తమను కలిచివేస్తోందని అన్నారు. సంవత్సరం నుంచి థియేటర్ కు వెళ్లలేదని..ఈ నెల 15న ‘గీతాగోవిందం’ సినిమాను థియేటర్ లో చూస్తానని.. నవ్వులతో థియేటర్ నిండిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. పైరసీని దయచేసి ఎంకరేజ్ చేయవద్దని విజయ్ సూచించాడు. ఎవరేమన్నా పడతానని.. కానీ ఇలా పైరసీ జరిగితే మాత్రం ఇంకాస్తా ఎక్కువ బాధపడుతానని తెలిపాడు. సినిమా విడుదల తర్వాత మునుపటి సంతోషం తనకు వస్తుందని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.