Begin typing your search above and press return to search.

విజయ్ క్రౌడ్ పుల్లర్ అవుతాడా!

By:  Tupaki Desk   |   10 July 2018 7:07 AM GMT
విజయ్ క్రౌడ్ పుల్లర్ అవుతాడా!
X
ఏళ్ళు కష్టపడితే కానీ రాని స్టార్ డం అర్జున్ రెడ్డి దెబ్బకు ఒక్క సినిమాతో తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవం. కానీ ప్లానింగ్ లో లోపమో ఇంకో కారణమో తెలియదు కానీ కొత్త సినిమాల విడుదలలో మాత్రం చాలా జాప్యం జరుగుతోంది. అర్జున్ రెడ్డి తర్వాత సోలో హీరోగా ఒక్క సినిమా కూడా రాకపోవడమే దీనికి ఉదాహరణ. కాకపోతే బయట కనిపించే క్రేజ్ కొత్త సినిమాల రిలీజ్ టైంలో ఓపెనింగ్స్ కు ఎంత వరకు హెల్ప్ అవుతుంది అనేదే భేతాళ ప్రశ్న.

ఎందుకంటే రానున్న ఐదారు నెలల్లో విజయ్ దేవరకొండ సినిమాలు మూడు దాకా రాబోతున్నాయి. వాటి మీద పెట్టుబడులు కూడా బాగానే పెట్టారు. కేవలం తనను చూడాలనే మొదటి రోజు సినిమాకు వచ్చే ప్రేక్షకులు ఎంత మంది ఉన్నారు అనేదాన్ని బట్టే విజయ్ దేవరకొండ ఫస్ట్ డే కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఈ టెస్ట్ లో మొదట రాయబోతున్న పరీక్ష గీత గోవిందం. పరుశురాం దర్శత్వంలో గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మించిన గీత గోవిందం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 15న విడుదల చేయనున్నారు. రష్మిక మండన్న హీరోయిన్ గా నటించిన ఆ మూవీ తర్వాత తక్కువ గ్యాప్ లోనే టాక్సీ వాలా రానుంది. నిజానికి ఇదే ముందు విడుదల కావాలి. కానీ ఏవో టెక్నీకల్ రీజన్స్ చెబుతూ వాయిదా వేస్తూ పోతున్నారు.

ఇప్పుడు ఈ రెండు సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్ విజయ్ దేవరకొండ రేంజ్ ఏంటో చూపిస్తాయి. సినిమాలు బాగుంటే ఆ తర్వాత వచ్చే టాక్ తో పికప్ అవ్వడం వేరు. అసలు ఎలా ఉందొ తెలియకుండా కేవలం హీరో ఇమేజ్ ని ఆధారం చేసుకుని మొదటి రెండు లేదా మూడు రోజులు హౌస్ ఫుల్ చేయటం వేరు. స్టార్ హీరోలు రెండో స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంటారు. మరి విజయ్ దేవరకొండ తాను కూడా ఆ లీగ్ లో ఉన్నాను అని రుజువు చేసుకోవాలంటే గీత గోవిందం-టాక్సీ వాలా ఓపెనింగ్స్ కీలకంగా మారనున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.