Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ నాగ చైతన్య చేతికి వచ్చిందా..?

By:  Tupaki Desk   |   22 Sept 2021 8:00 AM IST
విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ నాగ చైతన్య చేతికి వచ్చిందా..?
X
'నిన్ను కోరి' వంటి ఫీల్ గుడ్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శివ నిర్వాణ ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో 'మజిలీ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ వెంటనే నాని - విజయ్ దేవరకొండ లకు కథలు వినిపించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. నాని తో చేసిన 'టక్ జగదీష్' సినిమా ఇటీవలే ఓటీటీ వేదికగా విడుదలై మిశ్రమ ఫలితాన్ని రాబట్టింది. దీంతో శివ నిర్వాణ తదుపరి ప్రాజెక్ట్ ఏంటనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది.

'టక్ జగదీష్' తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విజయ దేవరకొండతో అని శివ నిర్వాణ చెబుతూ వస్తున్నాడు. మైత్రీ మూవీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీగా ఉంది. టక్ ప్రమోషన్స్ సమయంలో కూడా వీడీ తోనే తదుపరి సినిమా అని.. అది అన్ని వర్గాలవారిని అలరించే కామెడీ ఎంటర్టైనర్ అని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేతులు మారుతోందని.. విజయ్ దేవరకొండ ప్లేస్ లో నాగచైతన్య వచ్చి చేరాడని టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఇకపై మల్టీ లాంగ్వేజ్ సినిమాలపైనే దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటి నుంచి కేవలం తెలుగుకే పరిమితమయ్యే కథలను కాకుండా.. పాన్ ఇండియా అప్పీల్ ఉండే స్క్రిప్ట్స్ ని ఎంపిక చేసుకోవాలని చూస్తున్నాడట. సుకుమార్ - విజయ్ కాంబోలో చేయబోయేది కూడా ఓ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది.

అయితే శివ నిర్వాణ చెప్పిన కథ తెలుగు నేటివిటీకి మాత్రమే సరిపోతుందని.. అందుకే ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే 'టక్ జగదీష్' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడం కూడా దీనికి కారణమని అంటున్నారు. ఈ నేపథ్యంలో శివ నిర్వాణ ఇటీవల నాగచైతన్య తో ఈ కథ గురించి చర్చించారట. శివ చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్ కి చైతూ ఇంప్రెస్ అయ్యారట. గతంలో తనకు 'మజిలీ' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడి మీద నమ్మకంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రాబోతోందని అంటున్నారు.

నాగచైతన్య ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన 'లవ్ స్టోరీ' సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక 'మనం' ఫేమ్ విక్రమ్ కె కుమార్ తో చేస్తున్న 'థాంక్యూ' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో తండ్రి అక్కినేని నాగార్జునతో కలిసి 'బంగార్రాజు' సినిమాలో నటిస్తున్నాడు చైతన్య. దీని తర్వాత శివ నిర్వాణ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.