Begin typing your search above and press return to search.

'గీత గోవిందం' పై కుట్ర జరిగిందా?

By:  Tupaki Desk   |   13 Aug 2018 7:58 AM GMT
గీత గోవిందం పై కుట్ర జరిగిందా?
X
ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘గీత గోవిందం’ సినిమా నుంచి కొన్ని సన్నివేశాలు కొన్ని రోజుల ముందే లీకవడం.. ఆన్ లైన్లో వైరల్ అవడం తెలిసిన సంగతే. ఎంతో ఉత్సాహంగా సినిమాను ప్రమోట్ చేస్తూ హ్యాపీగా సాగిపోతున్న చిత్ర బృందానికి ఇది పెద్ద షాకే. దీని వల్ల తాము ఎంతగా ఇబ్బంది పడుతున్నది.. ఎంత డిస్టర్బ్ అయినది విశాఖపట్నంలో జరిగిన ‘గీత గోవిందం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో హీరో విజయ్ దేవరకొండ వివరించాడు. ఎప్పుడూ సరదాగా.. కొంటెగా.. అల్లరిగా మాట్లాడే విజయ్.. ఈ ఈవెంట్లో మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాడు. దాదాపుగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాధతో మాట్లాడాడు. ఒక సందర్భంలో అతను తన బాధ.. అసహనం మొత్తం చూపిస్తూ మాట్లాడిన మాటలు చర్చనీయాంశమయ్యాయి.

తనను కొందరు కిందికి లాగాలనే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేశారని.. కానీ ఉనికి కోసం.. ఎదుగుదల కోసం.. గుర్తింపు కోసం పోరాడటం తనకు చిన్న తనం నుంచే అలవాటైందని.. తన జీవితమే పోరాటం అని.. అలాంటపుడు ఇలాంటి వాటికి ఎంత మాత్రం భయపడేది లేదని విజయ్ అన్నాడు. ప్రేక్షకులకు ఆనందాన్నివ్వడం కోసం ఏమైనా చేస్తానని కూడా చెప్పాడు. అప్పటిదాకా ఒక నైరాశ్యంతో మాట్లాడిన విజయ్.. ఈ మాట అన్నాక స్వరం మార్చాడు. ఎప్పట్లాగే వాట్సాప్ రౌడీ బాయ్స్ అంటూ తన అభిమానుల్ని ఉత్సాహ పరిచాడు. ఎవరేం చేసినా తాను తగ్గబోనని అతను సంకేతాలిస్తున్నట్లే కనిపించింది. విజయ్ మాటల్ని బట్టి చూస్తే ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అతడి రైజ్ చూసి.. ‘గీత గోవిందం’కు వచ్చిన హైప్ చూసి తట్టుకోలేక ఎవరైనా కావాలనే సినిమాలోని సన్నివేశాల్ని లీక్ చేసే కుట్ర పన్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అల్లు అరవింద్ మాట్లాడుతున్నపుడు కూడా ‘గీత గోవిందం’ విషయంలో జరిగిందానికి ఇండస్ట్రీ సిగ్గు పడాలని అనడం కూడా ఈ సందేహాలు మరింత బలపడేలా చేస్తోంది.