Begin typing your search above and press return to search.

కుర్రాడి మీద పెద్ద బేనర్ల ‘చూపులు’

By:  Tupaki Desk   |   7 Aug 2016 5:43 AM GMT
కుర్రాడి మీద పెద్ద బేనర్ల ‘చూపులు’
X
ఈ మధ్య టాలీవుడ్ పెద్ద బేనర్లు టాలెంటెడ్ యంగ్ హీరోల మీద కన్నేస్తున్నాయి. ఓవైపు స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు చేస్తూనే.. యంగ్ అప్ కమింగ్ హీరోలతో చిన్న-మీడియం రేంజి సినిమాలు తీస్తూ మంచి ఫలితాలనందుకుంటున్నాయి. అల్లు అరవింద్ పిల్లా నువ్వు లేని జీవితం.. భలే భలే మగాడివోయ్ సినిమాలతో ఎంత బాగా సొమ్ము చేసుకున్నాడో తెలిసిందే. దిల్ రాజు.. సురేష్ బాబు లాంటి నిర్మాతలు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. నాని.. శర్వానంద్.. రాజ్ తరుణ్ లాంటి యంగ్ టాలెంటెడ్ హీరోలు పెద్ద నిర్మాతలకు మంచి ఛాయిస్ అవుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకో హీరో వచ్చి చేరుతున్నాడు. అతనే విజయ్ దేవరకొండ.

తొలి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’తోనే మంచి పేరు సంపాదించిన విజయ్.. తాజాగా ‘పెళ్లిచూపులు’తో సినిమాతో అందరికీ ఇష్టుడైపోయాడు. అతడి టాలెంట్ పసిగట్టి వరుసగా అవకాశాలు ఇచ్చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ‘పెళ్లిచూపులు’ విడుదలకు ముందే ద్వారక.. అర్జున్ రెడ్డి సినిమాల్ని లైన్లో పెట్టిన విజయ్.. త్వరలోనే వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బేనర్లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడెవరో వెల్లడి కాలేదు కానీ.. అక్టోబర్ లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది. ‘పెళ్లిచూపులు’కు సమర్పకుడిగా వ్యవహరించిన సురేష్ బాబు కూడా విజయ్ తో ఓ సినిమా చేస్తాడని వార్తలొస్తున్నాయి. మరోవైపు ‘పెళ్లిచూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి కూడా మళ్లీ విజయ్ హీరోగా ఇంకో సినిమా చేస్తానంటున్నాడు. మొత్తానికి విజయ్ మున్ముందు బిజీ అయిపోయేలా ఉన్నాడు.