Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ ను టాలీవుడ్ పట్టించుకోదా..?

By:  Tupaki Desk   |   8 Sep 2022 4:30 PM GMT
విజయ్ దేవరకొండ ను టాలీవుడ్ పట్టించుకోదా..?
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. 'పెళ్లి చూపులు' చిత్రంతో హీరోగా అందరి దృష్టిని ఆకర్షించిన VD.. మూడో సినిమాకే సంచలనంగా మారాడు. ఆ తర్వాత 'గీత గోవిదం' 'టాక్సీవాలా' వంటి హిట్లు అందుకున్నాడు. అయితే కథల ఎంపికలో జడ్జిమెంట్ సరిగా లేకపోవడంతో ఎక్కువ ప్లాప్స్ చూడాల్సి వచ్చింది.

'డియర్ కామ్రేడ్' సినిమా నిరాశ పరిచిన తర్వాత విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఇటీవల 'లైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యూఏస్ ప్రీమియర్స్ తోనే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మొదటి వారాంతంలోనే నెగటివ్ షేర్స్ లోకి వెళ్ళిపోయింది.

'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ డిజాస్టర్ అనుకుంటే.. భారీ అంచనాలతో వచ్చిన 'లైగర్' డబుల్ డిజాస్టర్ గా మిగిలింది. ఇది విజయ్ కెరీర్ లోనే కాదు.. టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో వీడీ పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవడం సంగతి అటుంచి.. అతని తదుపరి సినిమాలపై క్రేజ్ తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది.

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. దాన్ని బట్టే ఎవరి కెరీర్ అయినా డిసైడ్ అవుతుంది. సినిమాలు హిట్టై నిర్మాతలకు మంచి లాభాలు వస్తున్నాయి అంటే, ఎవరినైనా పైకి ఎత్తుకుంటుంది. అదే ప్లాపుల్లో ఉంటే మాత్రం ఒక్కసారిగా కిందికి పడేస్తుంది. ఇది ఇప్పటికే అనేక మంది హీరోల విషయంలో నిజమైంది కూడా. ఈ విధంగా చూసుకుంటే విజయ్ కూడా గడ్డుకాలం ఎదుర్కొంటున్నట్లే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'లైగర్' సినిమా ప్లాప్ అవ్వడం వల్ల దర్శకుడు పూరీ జగన్నాథ్ కంటే విజయ్ దేవరకొండ కు ట్రోల్స్ ఎక్కువ అయ్యాయని తెలుస్తోంది. రిలీజ్ కు ముందు విజయ్ మాట్లాడిన మాటలకు.. ఈ సినిమాలో కంటెంట్ కు ఏమాత్రం పొంతన లేకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మా అయ్య ఎవరో తెల్వదు.. మా తాత ఎవరో తెల్వదు అంటూ యాటిట్యూడ్ చూపిస్తే.. ఇండస్ట్రీలో మనమెవరో తెలియకుండా పోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ కు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేదు కాబట్టే.. అతనిపై ఇలాంటి నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని ఆరోపించేవారు కూడా ఉన్నారు. అదే ఒక స్టార్ కిడ్ కో లేదా ఓ పెద్ద ఫ్యామిలీ హీరోకో భారీ డిజాస్టర్ పడితే సోషల్ మీడియాలో ఇలానే ట్రోల్స్ వచ్చేవా? అని ప్రశ్నిస్తున్నారు. విజయ్'D తన సినిమా మీద విశ్వాసం వ్యక్తం చేశాడే కానీ.. ఎక్కడా కూడా యాటిట్యూడ్ చూపించలేదంటూ మద్దతుగా నిలుస్తున్నారు. రాబోయే సినిమాలతో కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని రౌడీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

'లైగర్' ఫలితంతో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో కనీసం తన ఫీలింగ్స్ కూడా చెప్పుకోలేనంత నిరాశలో ఉన్నాడని తెలుస్తోంది. రిలీజ్ రోజు పెద్దమ్మ గుడి దగ్గర కనిపించాక మళ్లీ కోర్ టీమ్ నుంచి ఎవరూ బయట కనిపించలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు పూరీ దర్శకత్వంలో సెట్స్ మీదకు తీసుకొచ్చిన విజయ్ 'JGM' ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ వీడీ ని ఎంతో కొంత ఇబ్బంది పెట్టే విషయాలే అని చెప్పాలి.

ఇదిలా ఉంటే 'లైగర్' సినిమాతో సంబంధం ఉన్న బయ్యర్లు అందరూ భారీగా నష్టపోయారు. ఒక్క నైజాంలోనే 60 శాతం నష్టాలు చూసినట్లు డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తెలిపారు. అయితే ఇప్పుడు వీరంతా నష్టపరిహారం కోసం పూరీ ఆఫీస్ మెట్లు ఎక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. విజయ్ సైతం తన రెమ్యునరేషన్ నుంచి 6 కోట్లు వెనక్కు ఇచ్చాడని ఓ వర్గం నెట్టింట ప్రచారం చేసింది కానీ.. అదంతా నిజం కాదని మరో వర్గం అంటోంది.

ఇకపోతే విజయ్ దేవరకొండ 'లైగర్' ప్లాప్ నుంచి బయటకి వచ్చి 'ఖుషి' షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తో కలిసి చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరిగింది. ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అని ప్రకటించారు కానీ.. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

VD కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్ జోనర్ లో ఉన్నాయి కాబట్టి.. 'ఖుషి' కూడా అదే బాటలో మంచి విజయం సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో దిల్ రాజు బ్యానర్ లో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో విజయ్ సినిమా ఉంటుందని టాక్ నడుస్తోంది. మరి త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.