Begin typing your search above and press return to search.

ఎలక్ట్రికల్ వెహికల్స్ బిజినెస్ లోకి విజయ్ దేవరకొండ..!

By:  Tupaki Desk   |   30 Oct 2020 9:30 PM IST
ఎలక్ట్రికల్ వెహికల్స్ బిజినెస్ లోకి విజయ్ దేవరకొండ..!
X
టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాల్లో నటిస్తూనే సినిమా ప్రొడక్షన్ లోకి దిగిన సంగతి తెలిసిందే. హోమ్ బ్యానర్ ని ఏర్పాటు చేసుకొని సినిమాలకు పెట్టుబడి పెడుతూ వస్తున్నాడు. లేటెస్టుగా మరో కొత్త బిజినెస్ లోకి దిగాడు విజయ్ దేవరకొండ. హైదరాబాద్‌ కు చెందిన 'వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్' కంపెనీలో భాగస్వామిగా చేరి పెట్టుబడులు పెడుతున్నాడు విజయ్. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్స్ - స్కూటర్లను నగరవాసులకు అద్దెకు అందుబాటులో ఉంచుతుంది. ఈరోజు (శుక్రవారం) తెలంగాణా స్టేట్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమ్మిట్ లో వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ ప్రతినిధులు మరియు విజయ్‌ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ భవిష్యత్‌ లో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ కు మంచి డిమాండ్ ఏర్పడుతుందని.. ఎలక్ట్రిక్‌ వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని పేర్కొన్నారు. 'వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్' కంపెనీ అందించే వాహనాలకు రెంట్ చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ప్రయాణించే దూరానికి తగ్గట్టు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణానికి మేలు చేసే ఈ బైక్‌ లు - స్కూటర్లతో కాలుష్యం తగ్గడంతో పాటు సమయం మరియు డబ్బు ఆదా అవుతుందని తెలుస్తోంది. హైదరాబాద్ వంటి భారీ జనాభా ఉన్న అభివృద్ధి చెందుతున్న నగరాలలో.. పెరుగుతున్న జనాభాకు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు అవసరమైనప్పుడు ఇది ఉపయోగపడనుంది. ఈ సేవలు త్వరలోనే జంట నగరాల్లో ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మరో యువ హీరో విజయ్ దేవరకొండ ఈ కొత్త వ్యాపారంలో ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.