Begin typing your search above and press return to search.

ఇప్పుడే రావట్లేదని దేవరకొండ చెప్పేశాడు

By:  Tupaki Desk   |   14 May 2018 10:05 AM GMT
ఇప్పుడే రావట్లేదని దేవరకొండ చెప్పేశాడు
X
కొన్ని రోజులుగా అనుకుంటున్నదే నిజమైంది. విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘టాక్సీవాలా’ ఈ నెల 18న విడుదల కాదని అధికారికంగానే ప్రకటించారు. స్వయంగా హీరో విజయ్ దేవరకొండనే ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఈ చిత్రం జూన్‌లో వస్తుందని.. కరెక్ట్ రిలీజ్ డేట్ ఏదో త్వరలోనే ప్రకటిస్తామని విజయ్ చెప్పాడు. ఈ విషయమై విజయ్ తనదైన శైలిలో ఒక ట్వీట్ పెట్టాడు.

‘‘నా రౌడీల్లారా.. నేను మే 18కి రావట్లే.. భయపడ్డానికి... అరవడానికి.. గట్టిగా నవ్వడానికి ఇంకొన్ని రోజులు ఎదురు చూడండి. ఈ మ్యాడ్ కూల్ సినిమాకు తుది మెరుగులు దిద్దుతున్నాం. ఇంకో వారం రోజుల్లో జూన్‌లో ఏ తేదీకి సినిమాను రిలీజ్ చేసేది చెబుతాం. ప్రస్తుతానికి నేను ట్యాక్సీ మీద కూర్చున్న ఈ ఫొటోను ఎంజాయ్ చేయండి’’ అంటూ తన పుట్టిన రోజు సందర్భంగా ‘టాక్సీవాలా’ టీం రిలీజ్ చేసిన ఫొటోను షేర్ చేశాడు విజయ్.

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సత్తా చాటుకుని ఇంతకుముందు ‘ది ఎండ్’ అనే హార్రర్ మూవీ తీసిన రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించిన సినిమా ‘టాక్సీవాలా’. గీతా ఆర్ట్స్-2.. యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లు ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్ర టీజర్.. ట్రైలర్ విభిన్నంగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇదొక హార్రర్ బేస్డ్ ఫాంటసీ మూవీ అంటున్నారు. వీఎఫెక్స్ పనుల్లో జాప్యం వల్లే ఈ సినిమా ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. జూన్ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.