Begin typing your search above and press return to search.

లెక్కలు పూర్తిగా మార్చేస్తున్నాడు!

By:  Tupaki Desk   |   28 Aug 2018 10:13 AM IST
లెక్కలు పూర్తిగా మార్చేస్తున్నాడు!
X
ఇప్పుడు టాలీవుడ్ లో ఒకటే టాపిక్. గీత గోవిందం వంద కోట్ల గ్రాస్ తో పాటు 52 కోట్ల దాకా షేర్ సాధించడం అది కూడా కేవలం 12 రోజుల వ్యవధిలో. ఇప్పటి దాకా విజయ్ దేవరకొండ హీరో అయ్యాక వచ్చిన సినిమాలు ఐదు. పెళ్లి చూపులు సూపర్ సక్సెస్ సాధించాక ద్వారక అనే మూవీ వచ్చింది కానీ అది అంతకు ముందు ఒప్పుకున్నది కావడంతో ఫలితం తేడాగా వచ్చినా ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఈ మధ్యే యుట్యూబ్ లో ఒరిజినల్ వెర్షన్ రిలీజ్ చేస్తే కేవలం 2 వారాల్లోనే 5 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ఇక మూడో సినిమా అర్జున్ రెడ్డి ఫలితం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఏడాది దాటినా దాని రెఫరెన్సులు వాడుతూనే ఉన్నారు. నాలుగో సినిమా ఏం మంత్రం వేసావే ఎప్పుడో ఏళ్ళ క్రితం సైన్ చేసింది కాబట్టి హీరోతో సహా అందరు లైట్ తీసుకున్నారు. మహానటి క్యామియో తరహా కాబట్టి కౌంట్ చేయలేం. ఇక ఐదోది గీత గోవిందం. రెండు వారాలు పూర్తి కాకుండానే వంద కోట్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ పాతిక సినిమాల అనుభవం ఉన్న హీరోలకు సైతం ఇప్పటికీ డ్రీం గా ఉన్న యుఎస్ 2 మిలియన్ డాలర్ మార్కును ఈజీగా అందుకోవడం అందరిని విస్తుపోయేలా చేస్తోంది.

విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి గీత గోవిందం తెలుగు సినిమా ప్రస్థానంలో అత్యంత గొప్ప చిత్రాల్లో ఒకటేమి కాదు. ఇప్పటి యూత్ కి తగ్గట్టు వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యేలా ఒక సింపుల్ లవ్ స్టోరీని తనదైన ట్రేడ్ మార్క్ మ్యానరిజంతో పండించిన విజయ్ దేవరకొండకే ఈ సక్సెస్ లో ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. హీరోయిన్ రష్మిక మందన్న దర్శకుడు పరశురామ్ ల క్రెడిట్ చాలా ఉన్నప్పటికీ హీరో సెంట్రిక్ పరిశ్రమలో లెక్కలు కథానాయకుడిని ఆధారంగా చేసుకునే ఉంటాయి కాబట్టి అందరి చూపు విజయ్ దేవరకొండ మీదే ఉంది. రేపు టాక్సీ వాలా అయినా నోటా అయినా లేక మరొకటైనా బిజినెస్ జరిగేది నిర్మాత రేట్లు డిసైడ్ చేసేది విజయ్ బ్రాండ్ తోనే. కాబట్టే ఇప్పుడు మనోడు హాట్ కేక్ గా మారాడు. తన స్థాయికే చెందిన పోటీ హీరోలను కిలోమీటర్ల దూరంలో ఉంచేస్తూ తనను అందుకోవడం అంత ఈజీ కాదనే సంకేతాలు బాక్స్ ఆఫీస్ వసూళ్ల రూపంలో ఇస్తూనే ఉన్నాడు. అందుకే ఇంత గ్యారెంటీ ఉంది కాబట్టి విజయ్ దేవరకొండ కాల్ షీట్స్ ఇప్పుడు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కేశాయి. రానున్న మూడు సినిమాలతోనే వంద కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. సింగిల్ డిజిట్ సినిమాలతోనే ఇంత రేంజ్ కు చేరుకున్న విజయ్ దేవరకొండ చిరంజీవి అన్నట్టు నిజంగా స్టార్ అయిపోయినట్టే.