Begin typing your search above and press return to search.

భేతాళుడైన సైతాన్‌

By:  Tupaki Desk   |   6 Aug 2016 4:53 AM GMT
భేతాళుడైన సైతాన్‌
X
విజ‌య్ ఆంటోనీ అంటే తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడుండ‌డు. సినిమా ఇండ‌స్ట్రీ అయితే ర‌జ‌నీకాంత్‌ - క‌మ‌ల్‌ హాస‌న్‌ - విక్ర‌మ్‌ - సూర్య‌ల త‌ర్వాత ఆ జాబితాలో విజ‌య్ ఆంటోనీని చేరుస్తుంది. తెలుగు బాక్సాఫీసుపై వాళ్లంత‌టి ప్ర‌భావం చూపించిన మ‌రో త‌మిళ క‌థానాయ‌కుడిగా విజ‌య్ ఆంటోనీకి పేరొచ్చింది. డాక్ట‌ర్ స‌లీమ్‌ - న‌కిలీ చిత్రాలు విజయ్ ఆంటోనీకి తెలుగు ప్రేక్ష‌కుల్లో ఓ గుర్తింపును తెచ్చిపెట్ట‌గా, ఈమ‌ధ్య విడుద‌లైన బిచ్చ‌గాడు ఆయ‌న‌కి అగ్ర‌పీఠం వేసి కూర్చోబెట్టింది. ఒక డ‌బ్బింగ్ సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చినా అది క‌నీ వినీ ఎరుగ‌ని రేంజ్‌ లో విజ‌యం సాధించింది. ఆ సినిమాకి ఏకంగా 20కోట్ల‌కిపైగా వ‌సూళ్లొచ్చాయి. కేవ‌లం 40 ల‌క్ష‌ల‌కి నిర్మాత‌లు డ‌బ్బింగ్ రైట్స్ కొన్నారు. అంటే ఆ సినిమాకి ఏస్థాయిలో లాభాలు తెచ్చిపెట్టిందో అర్థం చేసుకోవ‌చ్చు.

అందుకే ఇప్పుడు విజ‌య్ ఆంటోనీ సినిమా అన‌గానే బ‌య్య‌ర్లు ఎగ‌బ‌డుతున్నారు. డ‌బ్బింగ్ రైట్స్ కోసం - రీమేక్ రైట్స్ కోసం సూట్‌ కేసులు ప‌ట్టుకెళ్లి ఆయ‌న ఇంటి ముందు కాపు కాస్తున్నారు. విజ‌య్ ఆంటోనీ ఎంచుకొనే క‌థ‌ల‌పై ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ పూర్తిస్థాయిలో న‌మ్మ‌కాన్ని క‌న‌బ‌రుస్తుంటాయి. నాలుగు భాష‌ల్లోనూ మార్కెట్‌ ని క్రియేట్ చేసుకొన్నాడాయ‌న‌. త‌దుప‌రి సైతాన్‌ గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆ చిత్రం ఇప్ప‌టికే అన్ని భాష‌ల్లోనూ ఫ్యానీ రేట్ల‌కి అమ్ముడిపోయింది. తెలుగు ఇండ‌స్ట్రీ అయితే ఆ చిత్రం నుంచి అద్భుతాల్నే ఆశిస్తోంది. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే సెప్టెంబ‌రు వ‌ర‌కు ఆగాల్సిందే. అన్న‌ట్టు త‌మిళంలో `సైతాన్‌`గా తెర‌కెక్కిన ఆ చిత్రం తెలుగులో `భేతాళుడు`గా విడుద‌ల‌వుతోంది.