Begin typing your search above and press return to search.

ఆడియో వేడుకలోనే సినిమా చూపించేస్తాడట

By:  Tupaki Desk   |   3 Nov 2016 9:30 AM GMT
ఆడియో వేడుకలోనే సినిమా చూపించేస్తాడట
X
‘బిచ్చగాడు’ సినిమాతో చరిత్రాత్మక విజయాన్నందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయితే.. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయింది. దీంతో విజయ్ ఆంటోనీ తర్వాతి సినిమా బేతాళుడు (తమిళంలో సైతాన్) మీద అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. దీని ట్రైలర్ కూడా అంత ఆసక్తికరంగా కనిపించింది. దీపావళికే విడుదలవుతుందనుకున్న ఈ సినిమాను ఈ నెల 18కి వాయిదా వేశారు. తమిళ.. తెలుగు భాషల్లో భారీ స్థాయిలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఈ సినిమా ఆడియో వేడుకలోనే సినిమాలో కొంత భాగాన్ని అతిథులు.. మీడియా ప్రతినిధులకు చూపించేస్తాడట విజయ్ ఆంటోనీ.

సినిమా ఆరంభంలో కీలకమైన ఐదు నిమిషాల నిడివిని ఆడియో వేడుకలో ప్రదర్శిస్తాడట విజయ్ ఆంటోనీ. ఆ ఐదు నిమిషాలు చాలా ఆసక్తికరంగా.. సినిమా మీద క్యూరియాసిటీ పెంచేలా ఉంటుందట. ఐతే అది కథను ఎంత మాత్రం రివీల్ చేయదని సమాచారం. గతంలోనూ ఇలాంటి ప్రయోగాలు కొన్ని జరిగాయి. సినిమా మీద ఉన్న ఆత్మవిశ్వాసంతో విజయ్ ఈ సాహసానికి సిద్ధమవుతున్నాడు. తమిళంలో ఈ రోజు రాత్రే ‘సైతాన్’ ఆడియో వేడుక జరగనుంది. ఈ నెల 6న తెలుగు ఆడియో రిలీజ్ చేస్తారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే నిర్మాత. అతడి సరసన అరుంధతి నాయర్ కథానాయికగా నటిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/