Begin typing your search above and press return to search.

బిచ్చగాడు హీరోనా మజాకా..

By:  Tupaki Desk   |   8 Nov 2016 9:30 AM GMT
బిచ్చగాడు హీరోనా మజాకా..
X
‘బిచ్చగాడు’ అనే టైటిల్ పెట్టి ఓ తమిళ డబ్బింగ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం పెద్ద సాహసమే. ఈ సినిమాను జనాలు పట్టించుకుంటారని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఆ సినిమా ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయి.. ఎక్కడికో వెళ్లిపోయింది. డబ్బింగ్ సినిమాల చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించింది. ఈ సినిమా ముందు వరకు విజయ్ ఆంటోనీ వేరు. ఈ సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ వేరు. ‘బిచ్చగాడు’తో అతను తెచ్చుకున్న పేరు అంతా ఇంతా కాదు. అలాగే తెలుగులో అతడి మార్కెట్ కూడా బాగా పెరిగింది. ‘బిచ్చగాడు’ సినిమా డబ్బింగ్ హక్కుల్ని కేవలం రూ.30 లక్షలకే కొన్నాడట నిర్మాత చదలవాడ. కానీ విజయ్ ఆంటోనీ తర్వాతి సినిమా ‘బేతాళుడు’ హక్కులు ఏకంగా రూ.3 కోట్లు పలికాయి.

డబ్బింగ్ అంతా పూర్తయ్యాక ఆ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లకు మంచి రేట్లకే అమ్మాడు నిర్మాత. బిజినెస్ రూ.5 కోట్లను దాటినట్లు సమాచారం. కేవలం ‘బిచ్చగాడు’ ఊపు మాత్రమే కాదు.. ‘బేతాళుడు’ టీజర్ కూడా బాగుండటం కలిసొచ్చింది. మరోవైపు విజయ్ ఆంటోనీ తర్వాతి సినిమాకు కూడా ఆల్రెడీ ఓ పేరున్న నిర్మాత కర్చీఫ్ వేసేశాడు. ‘సాహసం శ్వాసగా సాగిపో’తో నిర్మాతగా పరిచయమవుతున్న మిర్యాల రవీందర్ రెడ్డి.. విజయ్ తర్వాతి సినిమా ‘యెమెన్’ హక్కుల్ని మంచి రేటుకే సొంతం చేసుకున్నాడట. ఇప్పటిదాకా చాలా వరకు మంచి సినిమాలే చేశాడు విజయ్ ఆంటోనీ. ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తే మున్ముందు తెలుగులో అతడి మార్కెట్ మరింత విస్తరించే అవకాశముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/