Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోల నోట.. మా.. మా.. మాస్ మంత్రం..!

By:  Tupaki Desk   |   10 May 2022 10:48 AM GMT
టాలీవుడ్ హీరోల నోట.. మా.. మా.. మాస్ మంత్రం..!
X
పాన్ ఇండియా స్థాయిలో ఇప్పుడు మాస్ అండ్ యాక్షన్ సినిమాలు సత్తా చాటుతుండటంతో.. టాలీవుడ్ స్టార్స్ అందరూ ఇప్పుడు మాస్ మాత్రం జపిస్తున్నారు. ఫిలిం మేకర్స్ అంతా ఆడియన్స్ పల్స్ తెలుసుకొని వారికి కావాల్సిన కంటెంట్ ను అందిస్తున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ పై సౌత్ డామినేషన్ చేయడానికి ప్రధాన కారణం మాస్ చిత్రాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా పాండమిక్ తర్వాత వసూళ్ల వర్షం కురిపించిన సినిమాలను గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థం అవుతుంది. మాస్ మరియు యాక్షన్ మిక్స్ చేసిన చిత్రాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తెలుస్తుంది.

నందమూరి బాలకృష్ణ గతేడాది చివర్లో ''అఖండ'' వంటి అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాతో థియేటర్లలోకి వచ్చారు. ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. నటసింహం కెరీర్ లో తొలి 100 కోట్ల సినిమాగా నిలిచింది. బోయపాటి శైలి భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటూ మాస్ ను మెప్పించే డైలాగ్స్ - బాలయ్య మాస్ మూవ్ మెంట్స్ ఈ సినిమా విజయానికి కారణమయ్యాయని చెప్పొచ్చు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'పుష్ప'. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేయగా.. ఫస్ట్ పార్ట్ ని 'పుష్ప: ది రైజ్' పేరుతో రిలీజ్ చేశారు. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే నార్త్ సర్క్యూట్స్ లో 100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టిందంటేనే.. ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు ఎంతలా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

పుష్పరాజ్ గా బన్నీ ఊర మాస్ అవతార్ మరియు తగ్గేదే లే అనే మేనరిజం మాస్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే ఇప్పుడు 'పుష్ప: ది రూల్' కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు. 'బంగార్రాజు' వంటి రూరల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో పాటుగా.. 'భీమ్లా నాయక్' 'డీజే టిల్లు' వంటి పలు తెలుగు సినిమాలు కూడా మాస్ ను ఆకర్షించగలిగాయి.

కన్నడ హీరో యష్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో అవుట్ అండ్ అవుట్ యాక్టర్ సినిమాగా తెరకెక్కిన 'కేజీయఫ్: 2' ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హై వోల్టేజ్ యాక్షన్ - ఎలివేషన్స్ కలబోసిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది.

అందుకే 'కేజీయఫ్ 2' విడుదలై 25 రోజులు గడిచినా జనాలు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలోనే హిందీ మార్కెట్ లో 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. సంచలనం సృష్టించింది. 1130 కోట్లకు పైగా వసూళ్ళు సాధించిన RRR చిత్రాన్ని బీట్ చేసి ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది 'KGF 2'.

'అఖండ' 'పుష్ప' 'కేజీఎఫ్ 2' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడం.. మధ్యలో వచ్చిన ఇతర జోనర్ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో.. ఇప్పుడు హీరోలందరూ మాస్ మంత్రాన్ని పటిస్తున్నారు. అన్ని సెంటర్ల వారిని ఆకట్టుకోవడమే లక్ష్యంగా సినిమాలు చేస్తున్నారు.

'రాధేశ్యామ్' వంటి ఫిక్షనల్ పీరియాడికల్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ''సలార్'' అనే భారీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే బయటకు వచ్చిన ఫస్ట్ లుక్ తో ఈ సినిమా మాస్ ఏ రేంజ్ లో ఉంటుందో క్లారిటీ వచ్చేసింది. ఇదే క్రమంలో 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ''స్పిరిట్'' అనే మాస్ మూవీని సెట్స్ మీదకు తీసుకురానున్నారు.

RRR చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ రివేంజ్ యాక్షన్ మూవీలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. దీని తర్వాత 'కేజీఎఫ్' ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఓ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ లో నటించనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' చిత్రంతో పాటుగా బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో తన మాస్ చూపించబోతున్నారు. 'అఖండ' సినిమాతో హిట్ అందుకున్న బాలకృష్ణ.. ఇప్పుడు 'క్రాక్' లాంటి మాస్ సినిమాని డైరెక్ట్ చేసిన గోపీచంద్ మలినేనితో మాస్ అండ్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. 'లైగర్' చిత్రంతో విజయ్ దేవరకొండ కూడా మాస్ టచ్ ఇవ్వబోతున్నాడు.

నేచురల్ స్టార్ నాని 'దసరా' సినిమా కోసం తన కెరీర్ లోనే తొలిసారిగా రా అండ్ రస్టిక్ లుక్ లోకి మారిపోయాడు. నితిన్ 'మాచర్ల నియోజక వర్గం' చిత్రంతో తనలోని మాస్ హీరోని బయటికి తీస్తున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' లాంటి పక్కా మాస్ మూవీతో ఆకట్టుకున్న రామ్ పోతినేని.. ఇప్పుడు 'ది వారియర్' తో పాటుగా బోయపాటి శ్రీను చిత్రంతో మరోసారి మాస్ విశ్వరూపం చూపించడానికి రెడీ అయ్యారు. మరి వీరిలో ఎవరెవరు మాస్ బాటలో రాణిస్తారో చూడాలి.