Begin typing your search above and press return to search.

పబ్లిక్ ఫిగర్ నే కానీ పబ్లిక్ ప్రాపర్టీని కాదు: విద్యా

By:  Tupaki Desk   |   14 March 2017 5:42 PM IST
పబ్లిక్ ఫిగర్ నే కానీ పబ్లిక్ ప్రాపర్టీని కాదు: విద్యా
X
మొబైల్ ఫోన్లకు ఫ్రంట్ కెమేరాలు వచ్చాక సెల్ఫీల గోల ఎక్కువైపోయింది. పైగా సెలబ్రిటీలు ఎక్కడైనా కనిపిస్తే చాలు వారితో సెల్ఫీలు దిగడానికి నానా రభస సృష్టిస్తున్నారు. సరే అభిమానులు కదా అని చనువిస్తే ఆ గోల ఎప్పటికీ ఆగదు.. అంతేకాదు.. మహిళా నటులకైతే మరో ఇబ్బంది కూడా ఉంది. పోన్లే అని సెల్ఫీకి ఓకే అంటే వారేం చేస్తారో కూడా తెలియని పరిస్థితి. సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కు తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైందట. దీంతో ఆమె సెల్ఫీలు అంటే చాలు మండిపడుతోంది.

వచ్చే నెలలో విద్య నటించిన 'బేగమ్ జాన్' సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల ఆ సినిమా నిర్మాత మహేష్ భట్ - దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీలతో కలసి కోల్ కతా ఎయిర్ పోర్టులోకి వెళుతోంది విద్యాబాలన్. ఇంతలో, ఓ వ్యక్తి అక్కడకు పరుగుపరుగున వచ్చి ఓ సెల్ఫీ కావాలంటూ విద్యను అడిగాడు. దీనికి ఆమె ఓకే చెప్పింది. దీంతో, అతను చొరవగా ఆమె భుజంపై చెయ్యేసి సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. అతడి చర్యతో షాక్ కు గురైన విద్య... చేయి తీయమని చెప్పింది. అతను వినపడనట్టే చేతిని అలాగే ఉంచాడు. దీంతో, ఆమె మేనేజర్ వచ్చి చేయి తీసేయమని చెప్పాడు. దీంతో అతను చేయి తీసేశాడు. ఆ తర్వాత సెల్ఫీ కోసం ఫోన్ వైపు చూసింది విద్య. కానీ, అతని చేయి తన వీపుపై కదులుతున్నట్టు గ్రహించిన విద్య... తీవ్ర ఆగ్రహానికి గురైంది. నీవేం చేస్తున్నావో తెలుస్తోందా? ఏమనుకుంటున్నావ్? అంటూ అతనిపై విరుచుకుపడింది. ఆ తర్వాత కూడా అతను సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే... సెల్ఫీ వద్దు - బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటూ మండిపడింది.

ఆ తర్వాత ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మన మీద చేయి వేస్తే ఎంతో అసౌకర్యంగా ఉంటుందని విద్య చెప్పింది. అతను అలాగే హద్దు మీరాడు అంటూ మండిపడింది. తాము పబ్లిక్ ఫిగర్సే కానీ, పబ్లిక్ ప్రాపర్టీ కాదని ఆమె తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/