Begin typing your search above and press return to search.

విక్ట‌రీ వెంక‌టేష్ న‌ట‌వార‌సుడు బ‌రిలో దిగుతున్నాడా?

By:  Tupaki Desk   |   27 July 2021 9:00 PM IST
విక్ట‌రీ వెంక‌టేష్ న‌ట‌వార‌సుడు బ‌రిలో దిగుతున్నాడా?
X
టాలీవుడ్ లో `హీరో` అవ్వ‌డం.. దానిని నిల‌బెట్టుకోవ‌డం అనే ఉద్యోగం సఫ‌ల‌మైతే దాని ముందు ఇంకేదీ నిల‌బ‌డ‌దు. కోట్లాది రూపాయ‌ల పారితోషికాలు ఖాతాల్లో చేర‌తాయి. డ‌బ్బుకు డ‌బ్బు హోదా గౌర‌వం అన్నీ వెంట న‌డిచొస్తాయి. ముఖ్యంగా సినీరంగంలో వేళ్లూనుకుని ఉన్న అగ్ర సినీకుటుంబాల నుంచి న‌ట‌వార‌సుల‌కు ఎంట్రీ లెవ‌ల్ ఏమంత క‌ష్టం కాదు. ఆ త‌ర్వాత నిల‌బెట్టుకుంటే సినీలోకం దాసోహం అంటుంది. వెయ్యి జ‌న్మ‌ల పుణ్య ఫ‌లం హీరో అవ్వ‌డం అని ఓ ప్ర‌ముఖ నిర్మాత అన్న‌ట్టుగా ఆ పుణ్యం ఎవ‌రికి ద‌క్కుతుంది? అన్న‌ది ఊహించ‌లేనిది.

ప్ర‌స్తుతం టాలీవుడ్ వ‌ర‌కూ మోస్ట్ అవైటెడ్ డెబ్యూ హీరోలుగా రాబోయే వారి జాబితాని పరిశీలిస్తే ఇందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - రేణు దేశాయ్ ల న‌ట‌వార‌సుడు అకీరా నంద‌న్ పేరు ముందు వ‌రుస‌లో ఉంది. ఏ క్ష‌ణ‌మైనా అకీరా నంద‌న్ హీరో అయ్యేందుకు ఛాన్సుంది. అలాగే న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. మోక్షజ్ఞ సినీఎంట్రీ 2023లో ఉంటుంది. ఎన్బీకే న‌టించిన క్లాసిక్ మూవీ ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఘ‌నంగా ఉండ‌నుంది.

ఇక అక్కినేని కాంపౌండ్ నుంచి ఇప్ప‌టికే ఇద్ద‌రు హీరోలు ప‌రిశ్ర‌మ‌లో ఉండ‌గా ద‌గ్గుబాటి కుటుంబం నుంచి రానా న‌ట‌వార‌సుడిగా బ‌రిలో దిగి విజ‌య‌వంతం అయ్యారు. ఇప్పుడు రానా త‌మ్ముడు.. డి.సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ట్యాలెంటెడ్ తేజ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇక ద‌గ్గుబాటి కుటుంబం నుంచి విక్ట‌రీ వెంక‌టేష్ కుమారుని రాక ఎప్పుడు? .. ప్ర‌స్తుతం వెంకీ అభిమానుల సందేహ‌మిది. నార‌ప్ప స‌క్సెస్ సంద‌ర్భంగా అభిమానుల‌తో ఇంట‌రాక్ష‌న్ లో వెంకీకి ఈ ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. వెంకీ త‌న‌ కుమారుడు అర్జున్ తో క‌లిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుండగా అతని అభిమానులు వార‌సుని సినీప్ర‌వేశంపై తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నారు. అయితే ఈ ప్ర‌శ్న‌కు వెంకీ వ‌ద్ద స‌మాధానం లేదు.

ఆయ‌న‌ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వెంకటేష్ వ్యక్తిగత మేకప్ మ్యాన్ రాఘవ కొంత డీటెయిలింగ్ ఇచ్చారు. ``వెంకటేష్ కొడుకు అసాధారణమైన పిల్లవాడు. ఎప్పుడూ పుస్తకాలలో మునిగిపోవడాన్ని నేను చూస్తుంటాను. స్టార్లు తమ పిల్ల‌ల‌ను సినిమాల్లో ఏదైనా స్పెష‌ల్ రోల్ తో అరంగేట్రం చేయించ‌డ‌మో.. లేక పూర్తి న‌టుడిగా బ‌రిలోకి తీసుకురావ‌డం స‌హ‌జమే అయినా.. వెంకీ వార‌సుడి విష‌యంలో అలా లేనేలేదు. త‌న‌కు ఆసక్తి ఉంటే ఈపాటికే అరంగేట్రం చేసేవాడు. అందువల్ల అర్జున్ న‌టుడు అవుతాడా అన్న‌దానిపై నేను సందిగ్ధంలో ఉన్నాను`` అని అన్నారు. అర్జున్ స్ట‌డీస్ పూర్త‌యితే కానీ ఏదీ క్లారిటీ రాదు. అయితే తన ఆలోచనా సామర్థ్యం అసాధారణమైనది. అతను ఎంతో తెలివైనవాడు..చ‌దువుల్లో అసాధార‌ణంగా రాణిస్తున్నాడు అని ప్రశంసించాడు.

అయితే విక్ట‌రీ వెంక‌టేష్ త‌న యుక్త‌వ‌య‌సులో న‌టుడ‌య్యారు. త‌న తండ్రిలానే అర్జున్ ఆలోచ‌న కూడా మారేందుకు ఆస్కారం లేక‌పోలేదు. గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ లో ఏదైనా పాజిబుల్.