Begin typing your search above and press return to search.

వెంకీ అప్పుడు నాస్తికుడు.. ఇప్పుడు దేవుడు

By:  Tupaki Desk   |   8 Aug 2022 11:30 PM GMT
వెంకీ అప్పుడు నాస్తికుడు.. ఇప్పుడు దేవుడు
X
వెంకటేష్ ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి పలు సూపర్‌ హిట్‌ లను దక్కించుకున్నాడు. గోపాల గోపాల సినిమా లో నాస్తికుడు పాత్రలో నటించిన విషయం తెల్సిందే. పవన్‌ కళ్యాణ్ గోపాలుడిగా వచ్చినా కూడా దేవుడు లేడు అంటూ బలంగా నమ్మే వ్యక్తి పాత్రలో ఆ సినిమాలో వెంకటేష్ కనిపించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

అప్పుడు నాస్తికుడిగా నటించిన వెంకటేష్ ఇప్పుడు దేవుడి పాత్రలో నటించేందుకు గాను ఓకే చెప్పాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తమిళ్ లో సూపర్‌ హిట్ అయిన ఓహ్‌ మై కడవలే సినిమా ను తెలుగు లో విశ్వక్ సేన్‌ ముఖ్య పాత్రలో ఓరి దేవుడా..! అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.

ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ సేతుపతి దేవుడి పాత్రలో కనిపించాడు. గెస్ట్‌ అప్పియరెన్స్ ఇచ్చిన విజయ్ సేతుపతి సినిమా స్థాయిని అమాంతం పెంచాడు అనడంలో సందేహం లేదు.

ఇప్పుడు రీమేక్ వర్షన్ లో ఆ గెస్ట్‌ రోల్‌ ను వెంకటేష్‌ తో చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అందుకు వెంకటేష్ కూడా ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది.

ఒరిజినల్‌ వర్షన్ కు దర్శకత్వం వహించిన అశ్వంత్‌ మారిముత్తు రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఓహ్‌ మై కడవలే సినిమాలో తన పాత్ర కోసం విజయ్‌ సేతుపతి మూడు రోజుల డేట్లను మాత్రమే ఇచ్చాడు. ఆ మూడు రోజుల్లోనే తన పాత్రను పూర్తి చేశాడు. ఇప్పుడు వెంకటేష్‌ 5 రోజుల డేట్లను ఓరి దేవుడా సినిమా కోసం ఇచ్చాడని తెలుస్తోంది.

ఓరి దేవుడా సినిమా షూటింగ్ వెంకటేష్ తో అతి త్వరలో ప్రారంభం అవుతుంది. ఆ షెడ్యూల్‌ తో మొత్తం సినిమా పూర్తి అయినట్లే అంటూ సమాచారం అందుతోంది. ఈ చిన్న పాత్ర లో వెంకటేష్ నటించడం వల్ల సినిమా స్థాయి అమాంతం పెరిగి పోతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. విశ్వక్‌ సేన్ కు ఈ సినిమా మంచి కమర్షియల్‌ హిట్‌ గా నిలుస్తుందని అంటున్నారు.