Begin typing your search above and press return to search.

క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ జోష్ లో వర్సటైల్ యాక్టర్..!

By:  Tupaki Desk   |   6 July 2021 2:30 PM GMT
క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ జోష్ లో వర్సటైల్ యాక్టర్..!
X
క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్.. 'జ్యోతిలక్ష్మి' 'అంతరిక్షం' 'ఘాజీ' 'ఇస్మార్ట్ శంకర్' 'బ్రోచేవారెవరు రా' వంటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో 'బ్లఫ్ మాస్టర్' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాలతో హీరోగా నిలదొక్కుకున్నాడనే చెప్పాలి. ఇక ఓటీటీ వరల్డ్ లో కూడా అడుగుపెట్టిన సత్య.. తమిళ హీరోలకు తెలుగు డబ్బింగ్ చెప్పడానికి వెనుకాడలేదు. వైవిధ్యమైన కథలు విలక్షణమైన పాత్రకలు ఎంచుకుంటూ వస్తున్న సత్యదేవ్‌ చేతిలో ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

'కిర్రాక్ పార్టీ' ఫేమ్ శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ''తిమ్మరుసు''. 'అసైన్‌మెంట్‌ వాలి' అనేది దీనికి ట్యాగ్ లైన్. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లాయర్‌ పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నాడు. 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్‌ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ మరియు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్ పై మహేష్ కోనేరు - సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా విడుదల వాయిదా వేసుకున్న ఈ సినిమా తదుపరి రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది.

'బ్లఫ్ మాస్టర్' ఫేమ్ గోపిగణేశ్‌ పట్టాభి దర్శకత్వంలో సత్యదేవ్ ''గాడ్సే'' అనే మరో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని కలిగింది. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై సి. కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మలయాళ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. 'బ్లఫ్ మాస్టర్‌' వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత స‌త్యదేవ్‌ - గోపి గ‌ణేష్ కాంబినేషన్‌ లో వస్తున్న ఈ యాక్షన్ ప్యాక్‌డ్ థ్రిల్లర్‌ పై మంచి అంచనాలే ఉన్నాయి.

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తో కలసి సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం ''గుర్తుందా శీతాకాలం''. నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌ పై నాగశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'లవ్ మాక్ టైల్' చిత్రానికి తెలుగు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇక 'ఘాజీ' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్.. ఆ తర్వాత 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' చిత్రంలో కనిపించాడు. ఇప్పుడు అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కే ''రామ్ సేతు'' చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించబోతున్నారు.

నిన్న సోమవారం స‌త్య‌దేవ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా వీవీ గోపాల‌కృష్ణ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అగ్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది. 'జవాన్' నిర్మాత కృష్ణ కోమ‌ల‌పాటి.. అరుణాచ‌ల క్రియేష‌న్స్ బేన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. విజయవాడ బ్యాక్ డ్రాప్ లో స్టూడెంట్ పాలిటిక్స్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రానికి 'భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. అప్పట్లో సాయి తేజ్ తో చేయడానికి ప్రయత్నించిన కథతోనే గోపాల‌కృష్ణ ఈ చిత్రాన్ని సత్యదేవ్ తో తీస్తున్నారని టాక్. ఏదేమైనా వరుస సినిమాలతో వర్సటైల్ యాక్టర్ ఫుల్ జోష్ లో ఉన్నాడనే చెప్పాలి. ఈ సినిమాలు సక్సెస్ అయితే సత్యదేవ్ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది.