Begin typing your search above and press return to search.

'వకీల్ సాబ్' ఇక్కడ వర్కౌట్ అయ్యేనా..?

By:  Tupaki Desk   |   7 Jun 2020 4:25 PM GMT
వకీల్ సాబ్ ఇక్కడ వర్కౌట్ అయ్యేనా..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' పరాజయం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రీఎంట్రీ మూవీగా నటిస్తున్న సినిమా 'వకీల్ సాబ్'. ఈ చిత్రానికి 'ఓ మై ఫ్రెండ్' 'ఎంసీఏ' చిత్రాల డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని బడా నిర్మాతలు దిల్ రాజు మరియు బోణీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీలో అమితాబ్ నటించిన సూపర్ హిట్ మూవీ 'పింక్' చిత్రానికి రీమేక్ గా రాబోతోంది. అయితే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఏమాత్రం కమెర్షియల్ ఎలెమెంట్స్ లేని 'పింక్' సినిమాని ఎందుకు రీమేక్ చేయాలని అనుకున్నాడు అనేది సగటు పవన్ అభిమానికి మొదటి నుండి ఎదురవుతున్న ప్రశ్న. అంతేకాకుండా దీనికి స్టార్ డైరెక్టర్స్ ని పక్కన పెట్టి వేణు శ్రీరామ్ చేతిలో రీఎంట్రీ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టాడు అనేది వారి మదిలో ఉన్న మరో ప్రశ్న. బాలీవుడ్ లో 'పింక్' విజయవంతం కావడమే కాకుండా పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. లైంగిక దాడికి గురైన ముగ్గురు యువతులు న్యాయం కోసం పోరాటం చేయడం.. ఒక లాయర్ వారికి అండగా ఉంటూ ఎలా న్యాయం జరిగేలా చూసాడు అనేది ఈ సినిమా ఇతివృత్తం. సమాజంలో మహిళలపై నేడు జరుగుతున్న లైంగిక దాడుల గురించి ఈ సినిమాలో ప్రస్తావించారు. ఈ పాయింట్ నచ్చే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఓకే చేసి ఉంటాడు. అంతేకాకుండా ఈ సినిమా తమిళ్ లో కొన్ని మార్పులతో అజిత్ తో రీమేక్ చేయబడి పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఇక్కడ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో వర్కౌట్ అవుతుందా లేదా అని సినీ అభిమానులు ఆలోచిస్తున్నారు.

ఇదిలా ఉండగా 'వకీల్ సాబ్' డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారట. 'పింక్' సినిమాలో కమెర్షియల్ ఎలెమెంట్స్ లేనప్పటికీ తెలుగులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఈ స్టోరీలో వారి కోసం కొన్ని మార్పులు చేశానని చెప్పుకొచ్చాడట. అయితే ఇప్పుడు 'పింక్' స్టోరీకి మసాలా ఎలిమెంట్స్ యాడ్ చేసి 'వకీల్ సాబ్'గా తీసుకొస్తే చెప్పాలనుకున్న విషయం పక్కదారి పడుతుందేమో అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చాలా రీమేక్ సినిమాలు కమర్షియాలిటీ కోసం ప్రాకులాడి మార్పులు చేర్పులు చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం మనకు తెలిసిందే. మరి ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం స్టోరీలో చేంజెస్ చేయడం వలన అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దో అని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'వకీల్ సాబ్' మరో 20 రోజుల షూటింగ్ తో పూర్తవుతుందని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా దసరా కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.