Begin typing your search above and press return to search.

'ఆహా' మళ్లీ హీరోగా వెన్నెల కిషోర్‌

By:  Tupaki Desk   |   4 Jan 2021 10:39 AM IST
ఆహా మళ్లీ హీరోగా వెన్నెల కిషోర్‌
X
తెలుగు కమెడియన్స్‌ లో చాలా మంది హీరోలుగా నటించారు. రాజ బాబు.. రేలంగి నుండి మొదలుకుని మొన్నటి ధన్‌ రాజ్‌.. సుధీర్‌ వరకు ఎంతో మంది కమెడియన్స్ హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే కొందరు సక్సెస్‌ అవ్వగా కొందరు బొక్క బోర్లా పడి మళ్లీ కమెడియన్ వేషాలు వేస్తున్నారు. వెన్నెల సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుని దాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్న వెన్నెల కిషోర్‌ కూడా హీరోగా నటించాడు. ఆ సినిమా నిరాశ పర్చడంతో కమెడియన్‌ గా మాత్రమే కెరీర్‌ కంటిన్యూ చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత మళ్లీ వెన్నెల కిషోర్‌ హీరోగా చేసేందుకు సిద్దం అయ్యాడు.

ఈసారి వెన్నెల కిషోర్‌ హీరోగా నటిస్తున్నది సినిమాలో కాదు.. ఒక వెబ్‌ సిరీస్ లో అది కూడా ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఒక వెబ్‌ సిరీస్ లో అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రానాతో విరాటపర్వం సినిమాను నిర్మిస్తున్న వేణు ఉడుగుల నిర్మాణంలో ఆహా ఓటీటీ కోసం ఒక వెబ్‌ సిరీస్ రూపొందబోతుంది. వేణు స్క్రిప్ట్‌ అందిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆ వెబ్‌ సిరీస్ కు యువ దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సస్పెన్స్‌ ఎంటర్‌ టైనర్‌ వెబ్‌ సిరీస్ లో వెన్నెల కిషోర్‌ లోని కొత్త కామెడీ యాంగిల్‌ ను చూడబోతున్నారు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అతి త్వరలోనే వెన్నెల కిషోర్‌ హీరోగా నటిస్తున్న ఆ వెబ్‌ సిరీస్ ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.